పోలవరం ప్రారంభించింది నాన్నే.. పూర్తి చేసేది జగనే..

శాస‌న‌స‌భ‌లో పోల‌వ‌రంపై చ‌ర్చ‌లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

పోలవరం అంటే వైయస్‌ఆర్‌.. వైయస్‌ఆర్‌ అంటే పోలవరం

పోలవరం అనే పదం పలికే అర్హత కూడా చంద్రబాబు, రామోజీలకు లేదు

2014 వరకు పోలవరం అనే పదం పలకడం కూడా బాబుకు చేతకాలేదు

పోలవరంలో పనులు చేసింది చంద్రబాబేనంటూ ఇటీవల ఎల్లోమీడియా ప్రచారం 

పోలవరం చంద్రబాబుకు ఏటీఎం అని సాక్ష్యాత్తు ప్రధానమంత్రి చెప్పారు

డబ్బులు దోచుకునే పనులకు మాత్రమే గత ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది

మనం అధికారంలోకి వచ్చాక పోలవరంలోనే రివర్స్‌టెండరింగ్‌లో రూ.800 కోట్లు ఆదా చేశాం

పోలవరం పనులన్నీ ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి

స్పిల్‌వే పూర్తి, 48 గేట్లు అమరిక, ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌లు పూర్తిచేశాం

45.7 మీటర్ల ఎత్తు వరకు డ్యామ్‌ నిర్మాణం.. తప్పుడు కథనాలను నమ్మొద్దు

అసెంబ్లీ: ‘‘పోలవరం ప్రాజెక్టు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి స్వప్నం. పోలవరం అంటే వైయస్‌ఆర్‌.. వైయస్‌ఆర్‌ అంటే పోలవరం. ప్రాజెక్టును ప్రారంభించింది నాన్నే.. పూర్తి చేసేది ఆయన కొడుకు జగనే.. ఇదే విషయాన్ని మరోసారి చెబుతున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పోలవరం అనే పదం పలికే అర్హత కూడా చంద్రబాబుకు లేదన్నారు. పోలవరంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొని మాట్లాడారు. 

సీఎం పూర్తి ప్రసంగం..
‘‘ఇటీవల ఎల్లో మీడియాలో వచ్చిన కథనాన్ని చూశాం. పోలవరం ప్రాజెక్టులో అసలు పనులు చేసింది చంద్రబాబు మాత్రమేనంటూ.. ఒక అభూత కల్పనతో కలరింగ్‌ ఇచ్చే కార్యక్రమం చేశారు. మాకున్న ఇబ్బంది, వారికున్న అనుకూలత ఏంటంటే.. చంద్రబాబు రాజకీయాలు చేసేది ప్రజలకు మంచిచేసి ఆ మంచిని చూపించి రాజకీయాలు చేయడు. ఆయన రాజకీయాలు చేసేది కేవలం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీరికితోడు ఒక దత్తపుత్రుడు. వీరి మీద ఆధారపడి మాత్రమే రాజకీయాలు చేస్తాడు. ఒక అబద్ధాన్ని గొప్పగా వందసార్లు చెప్పిందే చెప్పి.. నిజమేమో భ్రమ కల్పించేంత గొప్పస్థాయిలో గోబెల్స్‌ ప్రచారం చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు. అందులో భాగంగానే ఇటీవల ఎల్లో మీడియాలో పోలవరంలో పనులు చేసింది చంద్రబాబేనంటూ ప్రచారం చేస్తున్నారు. 

పోలవరం అనే పదం పలికే అర్హత కూడా చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి, వీరిని మోస్తున్న ఈనాడు దినపత్రిక రామోజీరావుకు లేదు. 2004లో ముఖ్యమంత్రి అయిన తరువాత వైయస్‌ఆర్‌ తన డ్రీమ్‌ ప్రాజెక్టు పోలవరం అని చెప్పి.. ఆ ప్రాజెక్టును చేపట్టేనాటి వరకు.. కనీసం వీరంతా ఏనాడైనా పోలవరం ప్రాజెక్టు ఉంది అనే సంగతి ఆలోచన అయినా చేశారా..? 2004కు ముందు 9 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఆయన ఏమి వెలగబెట్టాడని ప్రశ్నిస్తున్నాను. కనీసం పోలవరం అనే పదం ఆయన నోట్లోంచి వచ్చిందా..? ఒక్క అడుగు అయినా పోలవరం ముందుకు కదిలిందా అని అడుగుతున్నా..? పోలవరం అనే పదం 2014 వరకు కూడా కనీసం పలకడం చేతకాలేదు. 

చంద్రబాబు 1995లో సీఎం అయిన నాటి నుంచి19 సంవత్సరాల వరకు ఈ ప్రాజెక్టు గురించి కనీసం మాట్లాడని పరిస్థితి. అప్పుడు ఈ రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5, చంద్రబాబు ఏ గాడిదలు కాస్తున్నారు. 1995 నుంచి 2014 వరకు కనీసం పోలవరం గురించి మాట్లాడని పరిస్థితుల్లో ఉంటే కూడా ఈరోజు కలరింగ్‌ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు కట్టారని, ఉరుకులు, పరుగులు తీయించారని ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. కనీసం ఏదైనా చెప్పడానికి న్యాయం, ధర్మం కొద్దోగొప్పో కనీసం కళ్లకు కనిపించాలి కదా..?

పోలవరం అంటే వైయస్‌ఆర్‌.. వైయస్‌ఆర్‌ అంటే పోలవరం. ప్రాజెక్టును ప్రారంభించింది నాన్నే.. పూర్తి చేసేది ఆయన కొడుకే.. ఇదే విషయాన్ని మరోసారి చెబుతున్నాను. 

పోలవరం అంటే చంద్రబాబుకు ఏటీఎం. ఈ విషయాన్ని సాక్ష్యాత్తు ప్రధానమంత్రి మోడీ అన్నారు. చంద్రబాబు ఒక్కడికే ఏటీఎం కాదు. చంద్రబాబు గజదొంగల ముఠా దోచుకో, పంచుకో, తినుకో అనే బ్యాచ్‌ ఉంది. రామోజీరావు కొడుకు వియ్యంకుడికి కూడా ఇది ఏటీఎం. నవయుగ అనే సంస్థ రామోజీరావు కొడుకు వియ్యంకుడిది. నామినేషన్‌ పద్ధతిలో వర్కులు ఇచ్చారు. యనమల రామకృష్ణుడి వియ్యంకుడు సుధాకర్‌ యాదవ్‌కు కూడా పోలవరం ఏటీఎం. దోచుకో, పంచుకో, తినుకో అని ఇష్టం వచ్చినట్టుగా నామినేషన్‌ పద్ధతుల్లో వర్కులు తీసుకున్నారు. యదేశ్చగా దోచేశారు. వారి దోపిడీని చూసి చివరకు ప్రధాని ఏటీఎంలా వాడారని చెప్పారు. 

మనం అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్‌ టెండరింగ్‌ చేశాం. పోలవరంలోనే రివర్స్‌టెండరింగ్‌లో రూ.800 కోట్లు ఆదా అయ్యాయి. ఏ స్థాయిలో దోచుకొని తిన్నారో చెప్పడానికి ఇదొక నిదర్శనం. 

ఇంతకుముందు ప్రభుత్వంలో పోలవరం పేరు చెబితే వారి జేబుల్లోకి నిధులు పారేవి. ఆ నిధుల లెక్కలు చూసుకునేందుకు చంద్రబాబు సోమవారం పోలవరం అని వెళ్లేవాడు. ఇప్పటికి పోలవరం నిర్మాణంలో స్పిల్‌ వే పూర్తయింది. డెడ్‌స్టోరేజీ ద్వారా, రివర్స్‌సూస్‌ ద్వారా గోదావరి డెల్టాకు నీరిచ్చే పరిస్థితి. 

ప్రాజెక్టు నిర్మాణంలో పద్ధతి ఉంటుంది. ఏ పని ఎప్పుడు చేయాలనే ప్రోటోకాల్‌ ప్రకారం పనులు చేసుకుంటూ పోతే ప్రాజెక్టులు ఫలితాలు ఇస్తాయి. కానీ, అప్పట్లో చంద్రబాబు అండ్‌ కో దృష్టంతా నిధుల పారుదల మీదనే కాబట్టి ముందుగా జరగాల్సిన పనులు వెనక్కు.. వెనక జరగాల్సిన పనులు ముందు రకరకాల పద్ధతుల్లో జరిపించారు. ఎక్కువ డబ్బులు వచ్చే పనులు ముందు చేశారు.. తక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉన్న పనులు నిర్లక్ష్యం చేశారు. ఇదీ టీడీపీ వారి పోలవరం ఇంజినీరింగ్‌ డిజైన్‌. 

పోలవరంలో గోదావరి నది 2400 మీటర్ల వెడల్పు ఉన్న నది. 2400 మీటర్ల వెడల్పు ఉన్న నదిలోంచి గోదావరి ప్రవాహం వస్తుంది. ఈ ప్రవాహం మళ్లింపుచేస్తే గోదావరిలో డ్యామ్‌ నిర్మాణం చేపట్టవచ్చు. ఇది మళ్లించాలంటే ముందుగా స్పిల్‌ వే కట్టాలి. స్పిల్‌ వే పూర్తిచేసి స్పిల్‌ వే మీదుగా గోదావరి ప్రవాహాన్ని డైవర్ట్‌ చేసి 2400 మీటర్లు ఉన్న గోదావరి ప్రవాహంలో కాఫర్‌ డ్యామ్‌ కట్టాలి. దిగువ నుంచి నీరు రాకుండా తరువాత రెండో కాఫర్‌ డ్యామ్‌ కట్టాలి. ఈ రెండింటి మధ్యలో నీరు రాని వాతావరణం క్రియేట్‌ చేసి ఎర్త్‌ఫీల్డ్‌ రాక్‌ డ్యామ్‌ (మెయిన్‌ డ్యామ్‌ స్ట్రక్చర్‌) కట్టాలి. ఇది ప్రాజెక్టు నిర్మాణంలో పాటించాల్సిన పద్ధతి. 

కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం.. స్పిల్‌ వే పనులు అసంపూర్తిగా వదిలేశారు. పునాదుల స్థాయిలోనే వదిలేశారు. మరోవైపున 2400 మీటర్లున్న గోదావరి నదీ ప్రవాహంలో ఒకవైపున మొదటి కాఫర్‌డ్యామ్‌ పనులు పెట్టారు... మరోవైపున రెండో కాఫర్‌ డ్యామ్‌ పనులు మొదలుపెట్టారు. కాఫర్‌ డ్యామ్‌ పూర్తయితే నీరు నదీ ప్రవాహం నుంచి రాలేకపోతే.. డైవర్ట్‌ చేసే స్పిల్‌ వే పని అవ్వకుండా కాఫర్‌ డ్యామ్‌ ఎలా పూర్తి చేస్తారు..? అప్రోచ్‌ ఛానల్‌ పనులు జరగలేదు, స్పిల్‌ వే పనులు జరగలేదు.. ఏ పని జరగకుండా నీరు డైవర్ట్‌ చేయలేరు. కాఫర్‌ డ్యామ్‌ పనులు కూడా మధ్యలోనే ఆపేశారు. సీజన్‌ వచ్చేసరికి గోదావరి నది ప్రవాహాన్ని వదిలేయాలి. 2400 మీటర్ల వెడల్పులో 1600 మీటర్ల కాఫర్‌ డ్యామ్‌ కట్టి రెండు గ్యాప్‌లు వదిలారు. 2400 మీటర్ల వెడల్పుతో నీరు ఉదృతంగా వచ్చేచోట.. కేవలం 2 గ్యాప్స్‌లో నుంచి నీరు ప్రవహించాల్సిన పరిస్థితి. వెలాసిటీ పెరిగి కింద వేసిన డయాఫ్రమ్‌ వాల్‌ను కూడా తన్నేసింది. కాఫర్‌ డ్యామ్‌లో పెద్ద పెద్ద గుంతలుపడ్డాయి. ఎవడైనా బుద్ధి ఉన్నోడు.. స్పిల్‌ వే పూర్తి కాకుండా కాఫర్‌ డ్యామ్‌ పనులు ఎలా ముట్టుకున్నారని తిట్టాల్సింది.. గడ్డిపెట్టాల్సింది. 

కాఫర్‌ డ్యామ్‌ పూర్తికాకుండా డయాఫ్రమ్‌వాల్‌ (మెయిన్‌డ్యామ్‌ ఫునాది గోడ) నిర్మించారు. నీరు రాకుండా ప్రదేశం క్రియేట్‌ చేయకుండా.. మెయిన్‌ డ్యామ్‌కు పునాది గోడ వేయడం మరో పొరపాటు. కాఫర్‌ డ్యామ్‌ పూర్తికాకుండా డయాఫ్రమ్‌వాల్‌ ఎలా కట్టారని బుద్ధిజ్ఞానం ఉందా అని అడగాల్సిన రెండో ప్రశ్న.

ఈ రకంగా చేయకపోవడం వల్ల మనం అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో ఎప్పుడూ ఊహకు అందనివిధంగా గోదావరి వరద వచ్చింది. ఆ వరదను గమనిస్తే.. గోదావరి రెండేళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద వచ్చిన సన్నివేశం చూశాం. న్యాచురల్‌గా ఒకవైపున స్పిల్‌ వే మీదుగా నీరు డైవర్ట్‌ కావడం లేదు.. ఎందుకంటే పనులు జరుగుతున్నాయి. రెండోవైపున చిన్న గ్యాపుల నుంచి నీరు వచ్చేసరికి స్కౌరింగ్‌ జరిగింది. 

మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఇవన్నీ రిపేర్‌ చేస్తూ అడుగులు ముందుకేశాం. అప్రోచ్‌ ఛానల్‌ మీదుగా స్పిల్‌ ఛానల్‌ను, స్పిల్‌ ఛానల్‌ దిగువన పైలేర్‌ ఛానల్‌ను పూర్తిగా కంప్లీట్‌ చేశాం. నీరు కూడా స్పిల్‌ వే మీదుగా వస్తున్నాయి. చంద్రబాబులా కాకుండా మొత్తం స్పిల్‌ వే స్ట్రక్చర్‌పూర్తిచేసి 48 గేట్లు కూడా అమర్చడం జరిగింది. గోదావరి వందేళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద వచ్చినా సరే.. సమర్థవంతంగా స్పిల్‌ వే ద్వారా వరదను నియంత్రించగలిగాం. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేస్తే.. ఆ రెండు ఖాళీలను పూడ్చేసి.. జరిగిన నష్టాన్ని వైబ్రోకంప్యాక్షన్‌ ద్వారా ఇసుక వేసి.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ను పూర్తిగా కంప్లీట్‌ చేశాం. అంతేకాకుండా మెయిన్‌డ్యామ్‌లో భాగమైన గ్యాప్‌–3 వద్ద కాంక్రీట్‌ డ్యామ్‌ పనులను కూడా పూర్తిచేశాం. 2021లో జూన్‌11న గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌ వే మీదుగా మళ్లించడం జరిగింది. అనూహ్య వరదల కారణంగా కాఫర్‌ డ్యామ్‌ దెబ్బతినకుండా మీటర్‌ ఎత్తు పెంచాం. దిగువ కాఫర్‌ డ్యామ్‌లో కోతకు గురైన ప్రదేశాన్ని పూడ్చాం. పనుల సీజన్‌ మొదలుకాగానే ఎంత వేగంగా పనిచేయాలో.. అంతేవేగంగా పనిచేశాం. అన్ని రకాలుగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పూర్తయ్యాయి. స్పిల్‌ పనులు పూర్తయ్యాయి. నీరు స్పిల్‌ వే మీదుగా డైవర్షన్‌ జరుగుతుంది. 

ఎన్‌హెచ్‌పీసీ డిజైన్స్‌ క్లియరెన్స్‌ ఇచ్చారు. డిజైన్లు క్లియరెన్స్‌ అయిపోయింది కాబట్టి ఈ సీజన్‌లో వేగవంతంగా పనులు జరగడం మొదలయ్యాయి. అన్ని రకాలుగా ఒక పద్ధతి ప్రకారం పనులు జరుగుతున్నాయి. వర్షాకాలం వచ్చినా కూడా రెండు కాఫర్‌ డ్యామ్‌లు పూర్తయ్యాయి కాబట్టి మధ్యలో ఉన్న ప్రదేశంలో మెయిన్‌డ్యామ్‌ నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఏ వరద వచ్చినా ఇబ్బంది లేకుండా పనులు మొదలవుతాయి. డిజైన్ల ప్రకారం డయాఫ్రమ్‌ వాల్‌ 30 శాతం కోతకు గురైందో.. చేయాల్సిన రిపేర్లకు సలహాలు ఇచ్చారు. డయాఫ్రమ్‌వాల్‌ను పటిష్టం చేసి.. మరో 18 నెలల కాలంలో ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. ఇంకా వేగంగా పనులు పూర్తిచేసేందుకు శాయశక్తులా పర్యవేక్షణ చేస్తూ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ను ఇంప్లిమెంట్‌ చేస్తున్నాం. 

దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు నవంబర్‌ 2022లో తిరిగి మొదలుపెట్టడం, 2023 ఫిబ్రవరి 14 నాటికి దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు విజయవంతంగా పూర్తిచేశాం. ఎన్‌హెచ్‌పీసీ వారు ఇచ్చిన డయాఫ్రమ్‌వాల్‌ టెస్టులను చేసి ఆ రిపోర్టులను సీడబ్ల్యూసీకి, డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌కు పంపించి, వారు కూడా ఏడాది మార్చి 3, 4 తేదీల్లో డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ కమిటీ కూడా ప్రాజెక్టును సందర్శించి మీటింగ్‌ కూడా నిర్వహించడం జరిగింది. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిన్న ప్రదేశాల్లో సమాంతరంగా డయాఫ్రమ్‌ వాల్‌ కట్టాలని కూడా వారి సలహా మేరకు పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉంది, అడుగులు వేగంగా ముందుకుపడుతున్నాయి. 

ప్రాజెక్టుకు సంబంధించి అన్ని రకాల అనుమతులు లభించాయి. కేంద్రం నుంచి మరింత సపోర్టు అవసరం అని చెప్పడానికి ప్రధానమంత్రిని కలవడం జరిగింది. ప్రధానని కలిసి వివరించిన అజెండాలో ఈ పాయింట్‌ కూడా ఉంది. 

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం కేంద్ర కేబినెట్‌కు వెళ్లి అప్రూవల్‌ కావాల్సింది ఉంది. అందుకు సమయం పడుతుంది కాబట్టే రూ.15 వేల కోట్లు అడ్‌హక్‌ కింద మంజూరు చేయండి.. పనులు వేగవంతంగా జరుగుతూపోతాయి.. మీరు సవరించిన అంచనా వ్యయం అప్రూవ్‌ చేసినప్పుడు రీఅడ్జెస్ట్‌ అని చెప్పడం జరిగింది. మాటిమాటికి ప్రజల్లో అపోహ క్రియేట్‌ చేసేందుకు డ్యామ్‌ తగ్గిస్తున్నారు.. 41.1కే నిర్మిస్తున్నారు అని చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5 పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ సభ ద్వారా ప్రజలందరికీ స్పష్టంగా తెలియజేస్తున్నాను.. మనం కట్టే డ్యామ్‌ ఎత్తు పూర్తిగా (45.7 మీటర్లు) కట్టేస్తాం. వాటర్‌ ఇంపౌండ్‌ చేసేది మాత్రమే ఫస్ట్‌ ఫేస్‌లో 41.15 మీటర్లు ఉంటుంది. డ్యామ్‌ సెక్యూరిటీ ప్రకారం సీడబ్ల్యూసీ గైడ్‌లైన్స్‌ ప్రకారం డ్యామ్‌ సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ కోసం ఒకేసారి డ్యామ్‌ను నింపకూడదు. మూడు సంవత్సరాల్లో నీరు ఇంపౌండ్‌ చేస్తూ పోవాలనేది సీడబ్ల్యూసీ గైడ్‌లైన్స్‌. ఇందులో ఎటువంటి తప్పులేదు. చేయడం కూడా ఇదే పద్ధతిలో చేయాలి. పద్ధతి ప్రకారం కావాలని క్రియేట్‌ చేస్తున్న ఈ మాటను దయచేసి నమ్మొద్దని ప్రజలను కోరుతున్నాను. 

నిర్వాసితుల బాగుకోసం, వారికి మరింత మేలు చేసేలా ప్రతి ముంపు కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడానికి గతంతో మేము హామీ ఇచ్చాం. దానికి నేను కట్టుబడి ఉన్నాను. ఆ హామీ ప్రకారం ఇప్పటికే కేబినెట్‌లో తీర్మానం జరిగింది. తీర్మానం మేరకు ఇప్పటికే ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. 41.15 మీటర్లలోపు రూ.550 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అది కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 

పోలవరం ప్రాజెక్టు ప్రయారిటీ కింద రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ ప్రాజెక్టును కేంద్రం నిర్మించాల్సింది. కానీ, ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికి రూ.2600 కోట్లు మనమే ఖర్చు చేశాం. ఇంకా కేంద్రం నుంచి ఆ నిధులు రావాలి. మాకు ప్రాజెక్టు నిర్మాణంపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే పనులను వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కమిట్‌మెంట్‌కు వ్యతిరేకంగా ఏరకంగా దుష్ప్రచారం జరుగుతుందో ప్రజలంతా ఆలోచన చేయాలని కోరుకుంటున్నాను. 
 

తాజా వీడియోలు

Back to Top