ఇంటర్వ్యూల‌కు స్వస్తి.. మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాల భర్తీ

జాబ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం

అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 1.22 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం

దాదాపు 2.50 లక్షల మంది వలంటీర్లను నియమించాం

రెండేళ్లలోనే ఏకంగా 6,03,756 ఉద్యోగాలు భర్తీ చేశాం

దళారీ వ్యవస్థ లేకుండా ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాం

ప్రతికూల పరిస్థితుల్లోనూ సంక్షేమం, అభివృద్ధిని ఆపలేదు

గత పాలకులు ప్యాకేజీ, ఓటుకు కోట్ల కేసు కోసం ప్రత్యేక హోదా తాకట్టుపెట్టారు 

తాడేపల్లి: ‘‘అవినీతికి, పక్షపాతానికి, వివక్షకు, లంచాలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా, ఎలాంటి పైరవీలకు, దళారులు తావులేకుండా ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి చెబుతూ.. రాత పరీక్షల్లో మెరిట్‌ ప్రాతిపదికన మన ప్రభుత్వం ఉద్యోగాలిస్తోందని చెప్పడానికి జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి విద్యార్థిని గ్రాడ్యుయేట్‌ చదివించేలా, చదువుకున్న ప్రతి చెల్లెమ్మ, తమ్ముడికి అవకాశాలు విస్తరించే దిశగా యుద్ధ ప్రతిపాదికన అడుగులు వేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో అక్షరాల 6,03,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. 

జాబ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతీ, యువకులు, చదువుకుంటున్న విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు.

‘ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌ వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న పిల్లలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. నగరాలు, పట్టణాలకు వెళ్లి అద్దె ఇల్లు తీసుకొని నెలల తరబడి కోచింగ్‌ తీసుకుంటారు. కోచింగ్‌ తీసుకున్న తరువాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారని తెలియని పరిస్థితుల్లో ఆ పిల్లలు మనోధైర్యం కోల్పోయే స్థితి వస్తుంది. ఆ పరిస్థితులను మారుస్తూ.. వచ్చే 9 నెలల కాలంలో జూలై నెల నుంచి మార్చి – 2022 వరకు ఏయే ఉద్యోగాలకు, ఏయే నెలలో నోటిఫికేషన్‌ ఇవ్వబోతున్నామని జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. ఈ ఉద్యోగాలు ఏమిటీ..? ఏ నెలలో నోటిఫికేషన్‌ ఇస్తున్నామని అన్ని దినపత్రికల్లో మొదటి పేజీల్లో ప్రకటన ఇచ్చి ప్రతి ఒక్కరికీ తెలియజేశాం. 

జాబ్‌ క్యాలెండర్‌ ఎందుకు అవసరం అంటే.. చదువులు పూర్తిచేసుకున్న చెల్లెమ్మలు, తమ్ముళ్ల కోసం తీసుకువస్తున్నాం. ఈ క్యాలెండర్‌ ఏ ఉద్యోగ నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందో.. ఏ నెలలో వస్తుందో స్పష్టంగా తెలియజెప్పడం కోసం క్రిస్టల్‌ క్లియర్‌గా చెప్పడం కోసం క్యాలెండర్‌ తీసుకొస్తున్నాం. బ్యాక్‌ లాక్‌ పోస్టుల భర్తీ.. ఇంత వరకు చేయకుండా వదిలేసిన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా.. సామాజిక న్యాయం చేసేందుకు ఈ క్యాలెండర్‌ తీసుకువస్తున్నాం. 

అధికారంలోకి వచ్చిన కేవలం 4 నెలల్లోపే (అక్టోబర్‌ 2వ తేదీ లోపు) గ్రామ సచివాలయాలు వెలిశాయి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెల్లోనే దేశంలో ఎప్పుడూ, ఎక్కడా కనివినీ ఎరుగని విధంగా ఏకంగా 1.22 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు దేవుడి దయతో మీ బిడ్డ కల్పించగలిగాడని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడూ జరగని విషయాలు. ఈ ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ యువతలో సేవాభావాన్ని పెంపొందిస్తూ.. గౌరవ వేతనం ఇస్తూ.. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. ఈ వ్యవస్థ ద్వారా దాదాపు 2.50 లక్షల పైచిలుకు నిరుద్యోగులను గొప్ప కార్యక్రమంలో భాగస్వాములను చేయగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఏకంగా అక్షరాల 6,03,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇందులో 1,84,264  శాశ్వతంగా గవర్నమెంట్‌ ఉద్యోగాలు ఇవ్వగలిగాం. 3,99,791 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు, మరో 19,701 కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు. అన్నీ కలిపి 6,03,756 ఉద్యోగాలు ఇచ్చాం. 

వీరితో పాటు చాలీచాలని జీతాలతో బతుకుబండి ఈడుస్తున్న 7,02,656 మందికి లబ్ధి చేకూర్చేలా అందరి వేతనాలు పెంచడం జరిగింది. ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల కాలంలో 7,02,656 మంది ఉద్యోగస్తులంతా కూడా ఎలా బతికారు.. ఎంత జీతాలు ఇచ్చేవారు అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. ఈ రెండు సంవత్సరాల కాలంలో 7,02,656 మంది జీతాలు ఎంత.. వీళ్ల బతుకులు ఎలా మారాయి అనేది కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడి దయతో ఈ కార్యక్రమం చేయగలిగినందుకు చాలా సంతోషాన్నిస్తుంది. ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు వారి జీతాలు ఏ విధంగా ఉండేవని, ఈ రోజు మన ప్రభుత్వ ఆ జీతాలు ఏ స్థాయికి పెంచి రెండు సంవత్సరాల్లో ఇస్తున్నామని అందరికీ తెలియస్తూ ప్రకటన ఇవ్వడం జరిగింది. 

ఉద్యోగాల విషయంలో మరో మార్పు చేయడం జరిగింది. గతంలో రూ.12 వేలు గవర్నమెంట్‌ తరఫున ఔట్‌సోర్సింగ్‌ విధానంలో కాంట్రాక్ట్‌కు ఇస్తే.. తీరా ఉద్యోగస్తుడికి చేరే వరకు రూ. 7 – 8 వేలకు పడిపోయే పరిస్థితి. మధ్యలో దళారీలు ఉండేవారు.. వారికి లంచాలు, కటింగ్‌లు అన్నీ రకాలుగా నష్టపోయేవారు. చివరకు ఔట్‌సోర్సింగ్‌ కాంట్రాక్ట్‌కు రూ.12 వేలు ఇచ్చే పరిస్థితి ఉంటే.. చివరకు ఉద్యోగికి రూ. 8 వేలు కూడా చేతికందని పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసి ప్రతి నెలా 1వ తేదీన క్రమం తప్పకుండా మధ్యలో ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా.. జవాబుదారీతనం తీసుకొస్తూ.. అన్ని ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఉద్యోగాల నియామకం కోసం ఏపీ ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ (ఆప్కాస్‌) ఏర్పాటు చేసి దాదాపుగా 95 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఔట్‌ సోర్సింగ్‌ ఎంప్లయీస్‌కు గతంలో కంటే చాలా మెరుగైన జీతాలు వచ్చేలా చేశామని గర్వంగా తెలియజేస్తున్నాను. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి అని దశాబ్దాలుగా ఆర్టీసీ కార్మికులు అడిగేవారు. ఏ రోజూ ఎవరూ పట్టించుకున్న పరిస్థితులు లేవు. అలాంటి పరిస్థితులను పూర్తిగా మారుస్తూ సంవత్సరానికి రూ.3,600 కోట్ల అదనపు భారం ప్రభుత్వం మీద పడుతున్నా.. దాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరించి ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వంలో 51.387 మంది ఆర్టీసీ ఉద్యోగస్తులను ప్రభుత్వంలోకి విలీనం చేసి.. వారందరికీ ఉద్యోగ భద్రత ఇవ్వడమే కాకుండా పదవీ విరమణ వయస్సును కూడా 60 సంవత్సరాలకు పెంచామని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తున్నాను. 

కాంట్రాక్ట్‌ ఉద్యోగస్తులందరికీ గతంలో ఎన్నడూ జరగని విధంగా మినిమం టైమ్‌ స్కేల్‌ తీసుకువచ్చి వారి జీతాలు కూడా పెంచామని సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనందరి ఏర్పాటు కాకముందు ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయాలే.. అప్పట్లో ఏపీపీఎస్సీలో ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందోనని ఎదరుచూపులే ఉండేవి.. అప్పుడప్పుడు మీడియా లీకులు వచ్చేవి. నోటిఫికేషన్‌ కోసం కళ్లు కాయలు కాసేలా నిరుద్యోగులు ఎదురుచూసేవారు. ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్లి సంవత్సరాల తరబడి అద్దెలు కడుతూ కోచింగ్‌ తీసుకుంటూ నోటిఫికేషన్‌ లేక నిరాశపడేవారు. ఇలాంటి పరిస్థితిని పూర్తిగా మారుస్తూ చేయగలిగిన మంచి చేయడానికి ముందడులు వేస్తున్నాం. 

రాష్ట్ర విభజన సమయంలో 1.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని మేము భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి.. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. గత ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోగా.. ప్రత్యేక హోదా ద్వారా ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు వస్తాయని ఎదురుచూస్తున్న పరిస్థితిని మార్చేశారు. ప్రత్యేక ప్యాకేజీ, ఓటుకు కోట్ల కేసు కోసం ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారు. అప్పటి కేంద్ర ప్రభుత్వంలో గత ప్రభుత్వ పెద్దలు రెండు మంత్రి పదవులు అనుభవించారు. అవకాశం ఉన్న రోజుల్లో వారు రాజీపడడం వల్ల మనం ఢిల్లీకి వెళ్లిన ప్రతీసారి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇవ్వండి అని రిక్వస్ట్‌ చేయాల్సిన పరిస్థితిలోకి వచ్చాం. 

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం లేదు కాబట్టి.. అక్కడున్న ప్రభుత్వానికి లోక్‌సభలో పూర్తి మెజార్టీ ఉంది కాబట్టి.. ఈ రోజు మనం పదే పదే అడగడం తప్ప.. ఏం చేయగలగలేని పరిస్థితుల్లో ఉన్నాం. దేవుడి దయతో ఈ పరిస్థితులు కూడా ఎప్పుడో ఒక రోజు మారుతాయని ఎప్పి సంపూర్ణంగా నమ్ముతున్నాను. దేవుడి ఆశీస్సులతో మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను. 

గత ప్రభుత్వంలో ఆ రోజు అన్న మాటలు మనందరికీ తెలిసినవే.. ఏ రకంగా మాటలతో మోసం చేశారో అందరికీ తెలుసు. ఫలానా వ్యక్తి వస్తే జాబు వస్తుందని గొప్పగా చెప్పారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేల భృతి ఇస్తామని చెప్పారు. ఆ తరువాత ఉద్యోగాలు లేవు.. నిరుద్యోగభృతి లేదు. ఎన్నికల మూడు నెలల ముందు మాత్రం.. ఒక డ్రామా మాత్రం చేశారు. ఈ రోజు అందుకు భిన్నంగా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 6.03 లక్షల ఉద్యోగాలిచ్చాం. 

గత ప్రభుత్వం అప్పట్లో ఇస్తామన్న 1.40 లక్షల ఉద్యోగాలు ఎగరగొట్టింది. ఆ పరిస్థితి నుంచి.. ఈ రోజు కోవిడ్‌ పరిస్థితుల్లో ఉన్నా కూడా.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గినా కూడా ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఎక్కడా సంక్షేమం ఆగలేదు.. అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగలేదని ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నాను. నవరత్నాలు ఆగలేదు.. వాగ్దానాల అమలు ఆగలేదు.. బడుల నిర్మాణం, రైతులకు, అక్కచెల్లెమ్మలకు, చదువుకునే పిల్లలకు, ప్రతి సామాజిక వర్గానికి అందరికీ న్యాయం చేస్తూ అడుగులు ముందుకువేసే కార్యక్రమం సాగుతూనే ఉంది. గతంలో ఉద్యోగాలు అంతోఇంతో ఇచ్చే ప్రైవేట్‌రంగంలో ఉంటుందోనని రాజధాని ఎక్కడుందని హైదరాబాద్‌ పరుగెత్తుకెళ్లేవారు. ఈ రోజు ఆ పరిస్థితులు మార్చేస్తున్నాం. మన ఉద్యోగాలు మన గ్రామంలోనే వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. డీ సెంట్రలైజేషన్‌తో జాబ్‌ మార్కెట్‌ కూడా విస్తరిస్తున్నాం. గ్రామాల్లో రూపురేఖలు మారుతున్నాయి. శిథిలావస్థలో ఉన్న బడులు నాడు–నేడుతో రూపురేఖలు మార్చుకొని ఇంగ్లిష్‌ మీడియం దిశగా అడుగులు వేస్తున్నాయి. 

మన గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌లు, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అడుగడుగున చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. మన గ్రామంలోనే సంవత్సరకాలంలో గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజ్‌లు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, డిజిటల్‌ లైబ్రరీలు తీసుకురావడం జరుగుతుంది. దేవుడి దయతో మనం ఏర్పాటు చేయబోతున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు, 8 ప్రాంతాల్లో హార్బర్లు, 16 మెడికల్‌ కాలేజీలు, ఆసరా, చేయూత పథకాలను లింక్‌ చేస్తూ అమూల్, రిలయన్స్, హిందుస్థాన్‌ లివర్, ఐటీసీ వంటి కంపెనీలను తీసుకువస్తున్నాం. గ్రామ స్థాయిలో ఉద్యోగాలు, ఉపాధి విప్లవానికి నాంది పలుకుతాయని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

పిల్లలను చదివించుకునేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నాం. నాణ్యమైన విద్య అందించేలా విద్యా విధానంలో మార్పులు తెస్తున్నాం. ప్రతి విద్యార్థి గ్రాడ్యుయేట్‌ చదివించేందుకు గట్టి సంకల్పంతో అడుగులు వేస్తున్నాం. చదువుకున్న ప్రతి చెల్లెమ్మ, తమ్ముడికి అవకాశాలు విస్తరించే దిశగా యుద్ధ ప్రతిపాదికన అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వాలని, రాబోయే రోజుల్లో ఇంకా మంచి చేసే అవకాశం రావాలని మనసారా కోరుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 

 

Back to Top