మహిళా పక్షపాత ప్రభుత్వం మనది

పాదయాత్రలో చూసిన పాడి రైతుల కష్టాలు ఎప్పటికీ మర్చిపోలేను

పాడి రైతుల మేలు కోసం అమూల్‌ ప్రాజెక్టును తీసుకొచ్చాం 

ఏపీ– అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టుతో పాడి రైతులకు మంచి లాభాలు

పశ్చిమగోదావరి జిల్లాలోని 153 గ్రామాల్లో పాలసేకరణ

రాష్ట్రంలో 9,899 గ్రామాలకు అమూల్‌ను విస్తరిస్తున్నాం

అమూల్‌తో 13,739 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4.06 కోట్ల‌ అదనపు ఆదాయం

అక్కచెల్లెమ్మలకు మరింత మేలు జరగాలని మనసారా కోరుకుంటున్నా..

ప.గో జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ 

తాడేపల్లి: ‘‘రాష్ట్రంలో రైతులు బాగుండాలంటే వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా రైతుకు అవకాశాలు వచ్చినప్పుడే.. అక్కచెల్లెమ్మలకు అవకాశాలు చూపించనప్పుడే గ్రామీణ ఎకానమీ నిలబడుతుందని నమ్మాను కాబట్టే.. రాష్ట్రంలోకి అమూల్‌ను తీసుకురావడం జరిగింది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పాదయాత్రలో చూసిన పరిస్థితులు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. పాదయాత్ర జరుగుతుండగా.. ప్రతి జిల్లాలో ఒక లీటర్‌ పాలు తీసుకుని వచ్చి చూపించేవారని, లీటర్‌ పాలకంటే.. లీటర్‌ మినరల్‌ వాటర్‌ బాటిల్‌ రేటే ఎక్కవని, ఇదీ మా పరిస్థితి అని అక్కచెల్లెమ్మలు చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లాలో ఏపీ–అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టును ప్రారంభోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

ఈ సందర్భంగా సీఎం ఏం మాట్లాడారంటే..
‘అమూల్‌ సంస్థ దేశంలోనే నంబర్‌ వన్‌ సహకారరంగ సంస్థగా ఉంది. దాదాపు రూ.50 వేల కోట్ల టర్నోవర్‌ చేస్తోంది. ఈ సంస్థలో వాటాదారులు పాలుపోసే అక్కచెల్లెమ్మలే. అమూల్‌ సంస్థ ఏ స్థాయిలో ఉందంటే.. ప్రపంచంతో పోటీ పడుతూ 8వ స్థానంలో నిలిచింది. అమూల్‌లో ప్రాసెసింగ్‌ ఎలా ఉందంటే.. ఏకంగా పాల నుంచి చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఆ స్థాయిలో ఉంది కాబట్టే పాల సేకరించే అక్కచెల్లెమ్మలకు మిగిలిన సంస్థల కంటే చాలా ఎక్కవ ధర చెల్లిస్తున్నారు. లాభాలు అన్నీ సంవత్సరానికి ఒకసారి అక్కచెల్లెమ్మలకు తిరిగి ఇచ్చే గొప్ప స్వభావం అమూల్‌లో ఉంది. సహకార రంగాన్ని ప్రైవేట్‌ వ్యక్తులు ఆక్రమించకపోతే.. నిజంగా ఈ రంగం బలపడితే.. రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో చెప్పడానికి ఉదాహరణ ఈ అమూల్‌. 

అమూల్‌ సంస్థతో 2020 జూలై 21వ తేదీన అమూల్‌తో మన ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 2020 డిసెంబర్‌ 2న రాష్ట్రంలో అమూల్‌ పాల వెల్లువ ప్రాజెక్టును కూడా ప్రారంభించాం. ఇప్పటి వరకు చిత్తూరు, వైయస్‌ఆర్‌ జిల్లా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే 722 గ్రామాల్లో విజయవంతంగా పాల సేకరణ జరుగుతుండగా.. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో అమూల్‌ ప్రాజెక్టు అడుగుపెడుతోంది. 153 గ్రామాల్లో పాల సేకరణ ప్రారంభిస్తున్నాం. అమూల్‌ ద్వారా వచ్చే రెండేళ్లలో పూర్తిగా గ్రామీణ ముఖచిత్రం మారబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2600 గ్రామాల్లో ఈ సంవత్సరం, రెండు సంవత్సరాల్లో దశల వారీగా 9899 గ్రామాల్లో పూర్తిగా అమూల్‌ను విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అక్క, చెల్లెమ్మకు ప్రతి లీటర్‌ పాలకు ఇప్పుడున్న ధర కంటే రూ.5 నుంచి రూ.15 ఎక్కువ రేట్‌ వచ్చే విధంగా ప్రణాళిక రూపొందించడం జరిగింది. 

ఏపీ అమూల్‌ ప్రాజెక్టు ప్రారంభించిన తరువాత.. ఇంత వరకు ఏం జరిగిందనేది.. పాడి రైతులకు అర్థమయ్యేలా.. ‘అమూల్‌ సంస్థ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు జిల్లాలో 13,739 మంది మహిళా రైతుల దగ్గర నుంచి 52.93 లక్షల లీటర్లను సేకరించింది. అందుకు వారికి రూ.24.54 కోట్లు చెల్లించడం జరిగింది. ఇంతకు ముందు లీటర్‌ పాల మీద రూ.5 నుంచి 15 వరకు అదనంగా అమూల్‌ సంస్థ చెల్లించడం ద్వారా కొనుగోలు చేసిన రూ.24.54 కోట్లలో అదనంగా అక్కచెల్లెమ్మలకు వచ్చింది అక్షరాల రూ.4.06 కోట్లు వచ్చాయి. ఇదీ జరిగిన మేలు అని సగర్వంగా ప్రతి అక్కకు తమ్ముడిగా, ప్రతి చెల్లెమ్మకు అన్నగా సగర్వంగా తెలియజేస్తున్నాను. 

పాలకు అధిక ధర చెల్లించడమే కాకుండా.. పాల బిల్లులను కూడా కేవలం 10 రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం ద్వారా మన అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా మరింత మంచి జరిగింది. సహకార రంగంలో డెయిరీలు ఎందుకు మూతపడ్డాయి..? ఎందుకు ప్రైవేట్‌ డెయిరీలు దోపిడీలు చేస్తున్నాయని గమనిస్తే.. ఇదే సహకార రంగంలో ఉన్న డెయిరీలు పూర్తిస్థాయిలో పాల ప్రాసెసింగ్‌ యూనిట్లు అమూల్‌ మాదిరిగా లేకపోవడం, మార్కెట్‌ను పెంచుకోవడంలో ఆ స్థాయికి ఎదగకపోవడం, అన్నింటికీ మించి సహకార రంగ డెయిరీలు కొన్నింటినీ ప్రైవేట్‌ వ్యక్తులు ఆక్రమించుకొని అధ్వాన్నమైన పరిస్థితిలోకి వెళ్లిపోవడం వల్ల, ప్రైవేట్‌ డెయిరీల ఆదాయం పెంచుకోవడం కోసం రాష్ట్రంలోని సహకార రంగాన్ని పూర్తిగా నాశనం చేసిన పరిస్థితులు మన కళ్ల ఎదుటే కనిపించాయి. వీటన్నింటినీ మార్చాలి.. అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే తాపత్రయంతో పుట్టుకొచ్చిన కార్యక్రమం ఇది. 

2600 గ్రామాల్లో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్, ఆటోమెటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లను తీసుకువస్తున్నాం. దీని వల్ల మనం పోసే పాల నాణ్యత తెలిసిపోతుంది. స్లిప్‌ కూడా ఇస్తారు. అందుకు తగ్గట్టుగా అక్కచెల్లెమ్మలకు మంచి ధర చెల్లిస్తారు. ఇంతకు ముందు అదే నాణ్యత ఉన్నా.. అక్కచెల్లెమ్మలు మోసపోయేవారు. ఈ రోజు అమూల్‌ మోసం చేయడం లేదు కాబట్టి.. ప్రతి లీటర్‌కు రూ. 5 నుంచి రూ.15 అదనంగా అందుతున్నాయి. రాబోయే రెండు సంవత్సరాల్లో 9899 గ్రామాల్లో అక్షరాల రూ.4 వేల కోట్లు ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది. ప్రతి గ్రామాలంలో బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, ఆటోమెటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ యూనిట్లు తీసుకువస్తున్నాం. 

మహిళా సాధికారత కోసం మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు అందరికీ తెలుసు. అమ్మఒడి, చేయూత, ఆసరా, వడ్డీ లేని రుణాలు, సంపూర్ణ పోషణ, దాదాపు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్ల నిర్మాణానికి అడుగులు వేయడం, దిశ బిల్లు, దిశ పోలీస్‌ స్టేషన్, యాప్, మద్య నియంత్రణ దిశగా అడుగులు, వలంటీర్లు, గ్రామ సచివాలయాల్లో 50 శాతానికి పైగా అక్కచెల్లెమ్మలకు ఉద్యోగాలు, నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు అక్కచెల్లెమ్మలకు 50 శాతం రిజర్వేషన్‌ ఇచ్చేలా చట్టం చేయడం, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో, 56 బీసీ కార్పొరేషన్లలో అన్నింట్లో కూడా సగం కచ్చితంగా అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కచెల్లెమ్మలకు మరింత మేలు జరగాలని కోరుకుంటున్నాను. 

చేయూత ద్వారా అక్కచెల్లెమ్మలకు ఇచ్చే డబ్బును ఇంకా మెరుగ్గా ఉపయోగపడే విధంగా.. అక్కచెల్లెమ్మలకు ఉపాధి అవకాశాలు ఇంటి ముందుకే రావాలనే ఉద్దేశంతో పెద్ద సంస్థలతో అనుసంధానమై అవకాశాలను గడప దగ్గరకే తీసుకువస్తున్నాం. చేయూత పథకం ద్వారా దాదాపు 1.12 లక్షల యూనిట్ల ఆవులు, గేదెలు కొనుగోలు చేయించి అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. వీటన్నింటి వల్ల అక్కచెల్లెమ్మలకు మరింత మేలు జరగాలని మనసారా కోరుకుంటూ.. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ప్రభుత్వంపై ఉండాలని కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top