తాడేపల్లి: ‘‘గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం అన్నది పుస్తకాల్లో చదువుకోవడం.. ఊహలకే పరిమితమైంది.. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు గ్రామస్వరాజ్యం అంటే ఇదీ అని ఆంధ్రరాష్ట్రంలో చూపించే పరిస్థితుల్లో మన ప్రభుత్వం ఉందని గర్వంగా తెలియజేస్తున్నాను. ఇవాల్టికి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ ఒక సంవత్సర కాలం కూడా గడిచిందని గర్వంగా చెప్పగలుగుతున్నా’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గాంధీ జయంతి రోజున గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీతో పాటు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు లబ్ధిదారులు, అధికారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడారు. ‘‘స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు ఈ రెండూ గిరిజనుల స్వంతం.. శతాబ్దాలుగా దోపిడీకి గురవుతూ.. అభివృద్ధికి దూరంగా ఉండిపోతున్న గిరిజనుల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.. వారికి మంచి జరగాలని ఈ రోజు 1.53 లక్షల అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని 3.12 లక్షల ఎకరాలు వారికి ఇస్తున్నాం. ఆ భూములకు రైతు భరోసా పథకాన్ని కూడా అందజేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే.. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు.. గ్రామ గ్రామానికి ప్రభుత్వ సేవలు ఇలా గ్రామ స్వరాజ్యం అంటే ఇదీ అని గ్రామస్థాయికి తీసుకెళ్లింది. గత సంవత్సరం ఇదే రోజున రాష్ట్ర జనాభాలో దాదాపు 6 శాతం ఉన్న గిరిజనులకు, అడవి బిడ్డలకు మంచి చేయాలని, వీరి జీవితాల్లో వెలుగులు నింపాలని గతంలో నాన్నగారి హయాంలో ఆ తపన, ఆ తాపత్రయం చూశాం. మళ్లీ ఈ రోజు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో దాదాపుగా 1.53 లక్షల కుటుంబాలకు సుమారు 3.12 లక్షల ఎకరాల హక్కులు కల్పిస్తూ.. ఈ రోజు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. వచ్చే నెల రోజులు ఈ కార్యక్రమం నిర్వహించి ఈ నెల రోజుల్లో హక్కుల పత్రాల పంపిణీ, రైతు భరోసా పథకం సొమ్ము గిరిజనులను రైతులుగా చేసి వారికి అన్ని రకాలుగా మంచి జరిగేలా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఎన్నికలప్పుడు పలానా చేస్తామని ఎన్నికల ప్రణాళిక తీసుకువస్తాం. గతంలో పెద్ద పెద్ద పుస్తకాల మాదిరిగా మేనిఫెస్టోను ముద్రించి.. చెత్తబుట్టకు పరిమితమయ్యే పరిస్థితులను చూశాం. అలాంటి స్థాయి నుంచి ఎన్నికల ప్రణాళిక అంటే కేవలం రెండు పేజీలు మాత్రమేనని, మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా భావిస్తానని చెప్పి.. ఆ ప్రతీ మాటను నెరవేరుస్తూ అడుగులు ముందుకువేస్తున్నాను. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పేద గిరిజనులందరికీ కనీసం రెండు ఎకరాలు ఇవ్వాలనే తపన, తాపత్రయంతో వారందరికీ మంచి జరగాలని, అక్కచెల్లెమ్మల పేరుతో మీద ఆ భూమి హక్కుల పత్రాలను పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్నాం. భూవివాదాలకు ఎక్కడా తావులేకుండా అటవీ హక్కుల భూములను డిజిటల్ సర్వే ద్వారా గట్టు, హక్కులు అన్నీ ఏర్పాటు చేసి ప్రతీ గిరిజన అక్కచెల్లెమ్మకు ఇవ్వడం జరుగుతంది. ఇలా భూమి పొందిన ప్రతి కుటుంబానికి రైతు భరోసా కింద ప్రతీ సంవత్సరం రూ.13500 వారి చేతికే ఇవ్వబోతున్నాం. ఈ సంవత్సరానికి సంబంధించిన రైతు భరోసా సొమ్ము (ఖరీఫ్ మొదట్లో రూ.7500, ఖరీఫ్ పంట చేతికి వచ్చే సమయానికి 4000, సంక్రాంతి నాటికి రూ.2000) గత ఖరీఫ్‌లో భూములు ఇవ్వలేకపోయాం.. ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఆ సొమ్ము కూడా కలిపి రూ.11500 ఇచ్చేందుకు శ్రీకారం చుడుతున్నాం. వీరికి 13500 ప్రతి సంవత్సరం రైతు భరోసా సొమ్ము అందజేస్తాం. పట్టాలు పొందిన పరతి అక్కాచెల్లెమ్మ వారి భూముల అభివృద్ధే కాకుండా ఉద్యానవనాలు, తోటల పెంపకం, నీటి సదుపాయాలు తదితర అభివృద్ధి పనులకు కూడా ప్రభుత్వం సహకరించేలా కార్యాచరణలు సిద్ధం చేస్తున్నాం. దీని ద్వారా గిరిజనులకు ఆదాయం పెరగాలి.. పచ్చదనం కూడా పెరగాలి. నామినేటెడ్ పదవులు, నామినేషన్‌లో ఇచ్చే కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం ఇచ్చేలా చట్టం చేయడం ద్వారా గిరిజనులకు చాలా ఉపయోగకరంగా నిలబడ్డాం. ఎస్సీలు, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ శాసనసభలో చట్టాన్ని కూడా తీసుకువచ్చాం.. ఈ చట్టానికి సంబంధించిన బిల్లును కేంద్రానికి పంపించడం జరిగింది. గిరిజనుల అభివృద్ధికి ఈ కమిషన్ ఉపయోగపడుతుంది. అధికారంలోకి రాగానే గిరిజన సలహా మండలిని కూడా వెంటనే ఏర్పాటు చేశాం. గత ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన కూడా వారికి రాలేదు. గిరిజన సలహా మండలి వేసి మంచి చేయాలనే ఆలోచన కూడా ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఎవరూ చేయలేదు. అటువంటి పరిస్థితులను పూర్తిగా మార్చేశాం. గిరిజనులు అంటే నా స్వంత కుటుంబ సభ్యులు అని చెప్పి భావన ఇస్తూ అడుగులు ముందుకు వస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో వైద్యం అందక మరణిస్తున్న సంఘటనలు ఆ రోజుల్లో చాలా కనిపించేవి. చాలా సందర్భాల్లో ఇలాంటి ఘటనలు చూశాను. పాదయాత్రలో కూడా గిరిజన ప్రాంతాల్లోని ఇబ్బందులు చూశాను. ఈ పరిస్థితులు మార్చాలనే గట్టి నిర్ణయంతో ప్రభుత్వం ఇవాళ అడుగులు ముందుకేస్తుంది. ప్రభుత్వ వైద్యశాలలను నాడు–నేడు కార్యక్రమాలతో నేషనల్ స్టాండెడ్స్‌కు తగ్గట్టుగా హంగులు ఇస్తూ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్‌ను బిల్డ్ చేస్తున్నాం. గిరిజన అక్కచెల్లెమ్మలకు బాసటగా ఉంటూ పాడేరులోనే దాదాపు రూ.500 కోట్లతో వైద్య కళాశాల కూడా ఇదే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయబోతున్నాం. విజయనగరం జిల్లా కురుపాంలో దాదాపు రూ.153 కోట్లతో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి ఈ రోజే శంకుస్థాపన చేయబోతున్నాం. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, డోర్నాల ఐటీడీఏల పరిధుల్లో దాదాపుగా రూ.300 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులకు ఈ రోజే శంకుస్థాపన చేయబోతున్నాం. అమ్మ కడుపులో బిడ్డ పెరగడం ప్రారంభమైన నాటి నుంచి అవ్వాతాతల వరకు అందరికీ మేలు చేసేలా మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. వైయస్‌ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం ద్వారా గర్భిణులకు, బాలింతలకు, ఆరేళ్ల వయస్సు వచ్చే వరకు పిల్లలకు సైతం పౌష్టికాహారం అందించేందుకు అడుగులు వేశాం. దాదాపు 5 లక్షల ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్లు వాడుకున్నా.. ఉచితంగా ఇచ్చేట్లుగా చర్యలు తీసుకున్నాం. 500 మించి జనాభాను ఉన్న 146 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం. షెడ్యుల్డ్ ప్రాంతాల్లోని ఎస్టీ గ్రామ పంచాయతీల్లో వార్డుమెంబర్ల స్థానాలను ఎస్టీలకే కేటాయించడం జరిగింది. జగనన్న అమ్మ ఒడి దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి.. విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, వాహనమిత్ర, చేదోడు, నేతన్న నేస్తం, మత్స్యకారభరోసా ఇలా ప్రతి ఒక్క పథకం కూడా రాష్ట్రంలోని పేద వర్గాలకు గొప్పగా మంచి జరిగిందని గర్వంగా చెప్పగలుగుతున్నాను. నాడు–నేడు కార్యక్రమంతో బడులు, ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నాం. మన పిల్లలకు, మన వాళ్లకు మంచి జరగాలని ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. ఇంగ్లిష్ మీడియం చదువులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందాలి.. మంచి జరగాలని చేరువలోకి తీసుకువస్తున్నాం. చేతిరాతలతో పాటు, తలరాతలను కూడా మార్చేందుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ వేదికపై నుంచి తెలియజేస్తున్నాను. స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు ఈ రెండూ గిరిజనుల స్వంతం.. శతాబ్దాలుగా దోపిడీకి గురవుతూ.. అభివృద్ధికి దూరంగా ఉండిపోతున్న గిరిజనుల జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ.. వారికి మంచి జరగాలని ఈ రోజు 1.53 లక్షల అక్కచెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని 3.12 లక్షల ఎకరాలు వారికి ఇస్తున్నాం. భూములు ఇవ్వడమే కాకుండా భూముల అభివృద్ధి కోసం సపరేట్‌గా కలెక్టర్లు వారిని నడిపించాలి. మీ అందరికీ మంచి జరగాలని, ఇంకా ఎక్కువ మంచి చేసే భాగ్యం దేవుడు నాకు ఇవ్వాలని దేవుడిని ప్రార్థిస్తూ.. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.