స్కేటింగ్ క్రీడాకారిణి గ్రీష్మ‌కు ముఖ్య‌మంత్రి అభినంద‌న‌

 మ‌ధుర‌వాడ హెలిప్యాడ్ వ‌ద్ద తండ్రితో పాటు సీఎంను క‌లిసిన గ్రీష్మ‌

విశాఖ‌ప‌ట్ట‌ణం: స్కేటింగ్ క్రీడాకారిణి, ఆసియన్ క్రీడ‌ల విజేత గ్రీష్మ దొంత‌ర‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అభినందించారు. ఆమె ఆట తీరును, సాధించిన విజ‌యాల‌ను, ప్ర‌తిభ‌ను ప్ర‌శంసించారు. ఒక్క రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గురువారం విశాఖ‌ప‌ట్ట‌ణం వ‌చ్చిన ముఖ్య‌మంత్రిని న‌గ‌రానికి చెందిన‌ గ్రీష్మ దొంత‌ర‌ త‌న తండ్రితో పాటు మ‌ధుర‌వాడ ఐటీ హిల్‌పైన హెలీప్యాడ్ వ‌ద్ద క‌లిసింది. స్కేటింగ్ విభాగంలో త‌ను సాధించిన విజ‌యాల గురించి వివ‌రించింది. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ స్థాయిల్లో 105 మెడ‌ల్స్ సాధించానని, ఇటీవ‌ల చైనాలో జ‌రిగిన 19వ ఆసియ‌న్ క్రీడల్లో భాగ‌స్వామ్యం అయ్యాన‌ని మూడు ప‌త‌కాలు సాధించి 16వ స్థానంలో నిలిచాన‌ని పేర్కొంది. త‌ను సాధించిన మెడ‌ళ్ల‌ను ముఖ్య‌మంత్రికి చూపించి మురిసిపోయింది. గ్రీష్మ‌ విజ‌యాల గురించి తెలుసుకున్న ముఖ్య‌మంత్రి శెభాష్ త‌ల్లీ అంటూ చిరున‌వ్వుతో త‌ల‌పై నెమ‌రుతూ జీవితంలో మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆశీర్వ‌దించారు.

Back to Top