హక్కులు ‘కృష్ణా’ర్పణమే! 

కేడబ్ల్యూడీటీ–2లో బాబు సర్కారు అసమర్థ వాదనలు

తీవ్రంగా ఆక్షేపిస్తున్న నీటిపారుదల రంగ నిపుణులు

విభజన చట్టం ప్రకారంకేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నికర జలాలు యథాతథం

వాటిని పంపిణీ చేయాలంటే విభజన చట్టాన్ని సవరించాలి.. ఆ అధికారం పార్లమెంట్‌దే

ఏపీ ఈ కోణంలో వాదనలు వినిపించి ఉంటే నికర జలాల 

పంపిణీపై కేడబ్ల్యూడీటీ–2 విచారణ చేసేది కాదంటున్న నిపుణులు

చారిత్రక ఒప్పందాలు, వినియోగం ఆధారంగా 1976లో 749.16 టీఎంసీల నికర జలాలను కేటాయించిన కేడబ్ల్యూడీటీ–1

ఆవిరి నష్టాలకు 33, జూరాలకు 17.84 టీఎంసీలు కేటాయింపు

పునరుత్పత్తి జలాలు 11 టీఎంసీలు కలిపి 75% లభ్యత ఆధారంగా 811 టీఎంసీలు కేటాయించిన కేడబ్ల్యూడీటీ–1

బేసిన్‌ ఆధారంగా ‘బచావత్‌’ కేటాయింపులు చేసి ఉంటే ఉమ్మడి ఏపీకి 627.29 టీఎంసీలకు మించి దక్కేవి కాదన్న నిపుణులు

ఇప్పుడు బేసిన్‌ లోపల.. బయట వినియోగంపై ట్రిబ్యునల్‌లో విచారణ చేస్తున్నా అభ్యంతరం చెప్పని చంద్రబాబు ప్రభుత్వం

2015లోనే ఓటుకు కోట్లు కేసు భయంతో రాష్ట్ర హక్కులు తెలంగాణకు తాకట్టు పెట్టిన చంద్రబాబు

ఇప్పుడు మరోసారి రాష్ట్ర హక్కుల పరిరక్షణలో విఫలం

కృష్ణా నీటిపై రాష్ట్ర హక్కులను పరిరక్షించేలా కృష్ణా జలవివాదాల ట్రిబ్యునల్‌ (కేడబ్ల్యూడీటీ)–2లో రాష్ట్ర ప్రభుత్వం సమర్థ వాదనలు వినిపించడం లేదని నీటిపారుదల రంగ నిపుణులు ఆక్షేపిస్తు­న్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014­లోని 11వ షెడ్యూలు సెక్షన్‌–­85(7)(ఈ)–4 ప్రకా­రం కృష్ణా, గోదావరి ట్రిబ్యు­నళ్లు ఆయా ప్రాజెక్టు­లకు లేదా ప్రాంతాలకు కేటాయించిన నికర జలా­లు యథాతథంగా కొన­సాగుతాయి. అంటే.. కేడ­బ్ల్యూడీటీ–1 కేటాయించిన 811 టీఎంసీలు యథా­త­థంగా కొనసాగుతా­యని, వాటిని పంపిణీ చేయ­కూ­డద­న్నది స్పష్టమవుతోంది. 

కానీ.. రెండు రాష్ట్రా­లు అంగీకరించిన 36 అంశాల్లో నికర జలాల పునః­పంపిణీ కూడా ఉండటం గమనార్హం. విభ­జన చట్టం ప్రకారం నికర జలాల పంపిణీ విచారణ పరిధిలోకి రాదని కేడబ్ల్యూడీటీ–2లో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించి ఉంటే ఆ అంశంపై విచారణ చేయబోమని ఆదిలోనే చెప్పేదని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నికర జలాల పంపిణీపై విచారణ చేప­ట్టాలంటే విభజన చట్టాన్ని సవరించాలి. ఆ అధికారం పార్లమెంట్‌కు మాత్రమే ఉందని, అంతేగానీ ట్రిబ్యునల్‌కు లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వాదించలేదని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 

ట్రిబ్యు­నల్‌లో వాదనలు ఇలాగే కొనసాగితే రాష్ట్ర హక్కులు ‘కృష్ణార్పణం’ కావడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కేడబ్ల్యూ­డీటీ–2 కేటాయించిన జలా­లను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేసే బాధ్యతను అదే ట్రిబ్యునల్‌కు కేంద్రం అప్పగించింది. విభజన చట్టంలో నిర్దేశించిన మార్గదర్శ­కాలతోపాటు కేంద్రం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల మేరకు రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీపై కేడబ్యూడీటీ–2 విచారణ చేస్తోంది.

పంపిణీకి బేసిన్‌ ప్రాతిపదిక కాదు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రకు కృష్ణా జలాల పంపిణీకి 1969 ఏప్రిల్‌ 10న జస్టిస్‌ బచావత్‌ అధ్యక్షతన కేడబ్ల్యూ­డీటీ–1ను కేంద్రం ఏర్పాటు చేసి­ంది. ఈ ట్రిబ్యునల్‌ 1976 మే 27న తీర్పును ఇవ్వగా.. మే 31న దాన్ని అమలు చేస్తూ కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కృష్ణా జలాల పంపిణీకి బేసిన్‌ (పరీవాహక ప్రాంతం)ను కేడబ్ల్యూ­డీటీ–1 ప్రాతిపదికగా తీసుకోలేదు. 

ఒకవేళ బేసిన్‌ను ప్రాతిపదికగా తీసుకుంటే కృష్ణా బేసిన్‌ 2,58,948 చదరపు కిలోమీటర్ల­లో విస్తరించి ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాని విస్తీర్ణం 76,252 చదరపు కిలోమీటర్లు (29.45 శాతం) ఉంది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 (పున­రుత్పత్తి జలాలు 70 టీఎంసీలతో కలిపి) టీఎంసీల లభ్యత ఉందని కేడ­బ్ల్యూ­డీటీ–1 తేల్చింది. బేసిన్‌ను ప్రాతిపదికగా తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్ర­దేశ్‌కు 2,130 టీఎంసీల్లో 29.45 శాతం అంటే 627.29 టీఎంసీలు మాత్రమే దక్కేవి.

‘‘ఫస్ట్‌ ఇన్‌ టైమ్‌ ఫస్ట్‌ ఇన్‌ రైట్‌..’’ఇదే న్యాయసూత్రం..
కృష్ణా జలాల పంపిణీపై విచారణ ప్రారంభించడానికి ముందు కేడబ్ల్యూడీటీ–1 అంతర్జాతీయ స్థాయిలో నీటి పంపిణీకి ఎంచుకున్న న్యాయ సూత్రాలపై అధ్యయనం చేసింది. వాటి ఆధారంగా ‘ఫస్ట్‌ ఇన్‌ టైమ్‌.. ఫస్ట్‌ ఇన్‌ రైట్‌’ (ఎవరైతే మొదటి ప్రాజెక్టు నిర్మించి నీటిని వినియోగించుకున్నారో వారికే వాటిపై మొదటి హక్కు) న్యాయసూత్రంగా నిర్దేశించుకుంది. చారిత్రక

ఒప్పందాలు, వినియో­గా­లను ప్రాతిపదికగా చేసుకుంది. కృష్ణా బేసిన్‌ చరిత్రలో మొట్టమొదట 1885–1928 మధ్య కేసీ (కర్నూలు, కడప) కెనాల్, కృష్ణా ఆనకట్ట ద్వారా కృష్ణా డెల్టాకు జలా­లను వినియోగించుకున్నారు. ఈ ప్రాతిపాదికన 1951 నాటికే పూర్తయిన ప్రాజె­క్టులు.. 1951 నుంచి 1960 సెప్టెంబరు మధ్య పూర్తయిన ప్రాజెక్టులు.. ఆ తర్వాత చేపట్టిన ప్రాజెక్టులను మూడు విభాగాలుగా వర్గీకరించి కేడబ్ల్యూడీటీ–1 నీటి కేటాయింపులు చేసింది. 

ఈ ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ 749.16 టీఎంసీలను కేటాయించింది. ప్రతిపాదన దశలో ఉన్న జూరాల ప్రాజెక్టుకు 17.84 టీఎంసీలు, ఆవిరి నష్టాల రూపంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 33 టీఎంసీలు కలిపి మొత్తం 800 టీఎంసీలు కేటాయించింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది.

ఏపీకి 512.04.. తెలంగాణకు 298.96.. కేంద్రం తాత్కాలిక సర్దుబాటు
కేడబ్ల్యూడీటీ–1 ప్రాజెక్టులకు రక్షణ కల్పించిన, కేటాయించిన నికర జలాలను పరిగణలోకి తీసుకుంటే రాయలసీమకు 144.7 టీఎంసీలు, కోస్తాకు 387.34 టీఎంసీలు, తెలంగాణకు 278.96 టీఎంసీలు దక్కుతాయి. 

అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా డెల్టా ఆధునికీకరణలో మిగిలిన 20 టీఎంసీలను తెలంగాణలోని బీమా ఎత్తిపోతలకు కేటాయించింది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే రాయలసీమకు 144.7, కోస్తాకు 367.34, తెలంగాణకు 298.96 టీఎంసీలు దక్కుతాయి. ఈ లెక్కనే ఆంధ్రప్రదేశ్‌కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను కేటాయిస్తూ 2015 జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది.

రాష్ట్ర హక్కుల పరిరక్షణ ఇలాగేనా?
కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నికర జలాలు (75 శాతం లభ్యత)ను కేడబ్ల్యూ­డీటీ–2 యథాతథంగా కొనసాగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల నికర జలాలను కొనసాగిస్తూనే 75 –65 శాతం మధ్య, సగటు ప్రవాహాల ఆధారంగా 194 టీఎంసీల మిగులు జలాలను అదనంగా కేడబ్ల్యూ­డీటీ–2 కేటాయించింది. 

విభజన చట్టం ప్రకారం చూస్తే 811 టీఎంసీలను పునఃపంపిణీ చేయడం చట్టవిరుద్ధం. అదనంగా కేటాయించిన 194 టీఎంసీల పంపిణీపై కేడబ్ల్యూడీటీ–2 ఇప్పుడు విచారణ చేయాలి. అందులో విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ, తెలుగుగంగ, నెట్టెంపాడు, కల్వ­కుర్తిలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. 

కానీ.. కేడబ్ల్యూడీటీ–2 నికర జలాల పునఃపంపిణీపై విచారణ చేస్తు­న్నా టీడీపీ కూటమి  ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపో­వడం.. కృష్ణా డెల్టాలో వినియోగిస్తున్న జలాల్లో బేసిన్‌ బయట 95 శాతం వాడుకుంటున్నామని అంగీకరించడం తదిత­రా­లను చూస్తుంటే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం సరైన వాదనలు వినిపించడం లేదని స్పష్టమవుతోందని నీటిపారుదలరంగ నిపు­ణులు తేల్చి చెబుతున్నారు.

ఆనాడే హక్కులు తాకట్టు..
విభజన తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కు­లను తెలంగాణకు తాకట్టు పెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జున­సాగ­ర్‌ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం ఆదేశించింది. అయితే నాగార్జున­సాగర్‌తోపాటు శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని, పులిచింతల విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కార్‌ తమ అధీనంలోకి తీసుకున్నా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు నోరు మెదపలేదు. దీనివల్లే శ్రీశైలం, పులిచింతలలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ ఆ జలాలను ఖాళీ చేస్తూ.. నీటిని సముద్రం పాలు చేస్తూ ఏపీ  హక్కులను తెలంగాణ హరిస్తోందని నీటిపారుదల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 

ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాడు దాని నుంచి తప్పించుకోవడానికి అక్రమ ప్రాజెక్టులపై ఉదాసీనంగా వ్యవహరించారు. తెలంగాణ సర్కార్‌ శ్రీశైలం నుంచి 120 టీఎంసీలు తరలించేలా అక్రమంగా పాల­మూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల చేపట్టినా.. నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం పెంచినా.. సుంకేశుల బ్యారేజ్‌ గర్భంలో తుమ్మళ్ల ఎత్తిపో­తల చేపట్టినా నాడు ఏమాత్రం అడ్డుకోలేదు. 

తెలంగాణ చేపట్టిన ఆ ప్రాజెక్టులను నిలిపివేయాలని అపెక్స్‌ కౌన్సిల్‌ మొదటి సమావేశంలో చంద్రబాబు బలంగా వాదించలేకపో­యారని.. అప్పుడే కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టేశారని నీటిపారుదలరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. 

Back to Top