ఇ-కామర్స్ కంపెనీల దూకుడుకు కళ్ళెం

రాజ్యసభలో  వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
 

న్యూఢిల్లీ : ఇ-కామర్స్‌ కంపెనీల అనుచిత వ్యాపార విధానాలకు కళ్ళెం వేయడానికి వినియోగదారుల సంరక్షణ నిబంధనలను మరింత కఠినతరం చేయబోతున్నట్లు వాణిజ్య శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్‌ ప్రకాష్‌ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఇ-కామర్స్‌ కంపెనీలు అనుసరిస్తున్న అనుచిత వ్యాపార విధానాలపై వ్యాపారుల, రిటైలర్లు, పారిశ్రామిక సంఘాల నుంచి అనేక ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయని తెలిపారు. అసాధారణ డిస్కౌంట్లు, అత్యంత తక్కువు రేట్లకు ఆన్‌లైన్‌లో ఉత్పాదనలు అమ్మకానికి పెట్టడం ద్వారా మార్కెట్‌పై సాధించిన ఆధిపత్యాన్ని ఇ-కామర్స్‌ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లుగా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను లోతుగా విచారించి, పరిశీలించాల్సిందిగా సంబంధింత ప్రభుత్వ విభాగాలను కోరినట్లు మంత్రి చెప్పారు.

ఇతరులెవరూ పోటీకి రాకుండా ఇ-కామర్స్‌ కంపెనీలు కొన్ని వాణిజ్య సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు ఆరోపిస్తూ కాంపిటీషన్‌ కమిషన్‌కు సైతం ఫిర్యాదులు అందినట్లు మంత్రి తెలిపారు. వీటిపై కూడా తగిన చర్యలు చేపట్టడం జరుగుతుంది. నూతన ఇ-కామర్స్‌ విధానం ద్వారా ఇలాంటి చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడే ఇ-కామర్స్‌ కంపెనీలకు కళ్ళెం వేస్తామని మంత్రి చెప్పారు. ఫ్లాష్‌ సేల్స్‌ వంటి ఆకర్షణలతో ఇ-కామర్స్‌ సంస్థలు అనుచిత వ్యాపార పద్ధతులకు పాల్పడకుండా నిరోధించేందుకు వినియోగదారుల పరిరక్షణ(ఇ-కామర్స్‌) నిబంధనలను సవరించడానికి ముందుగా ప్రభుత్వం వాటిపై వ్యాపార వర్గాల  సలహాలు, సూచనలను ఆహ్వానిస్తూ వినియోగదారుల వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో పెట్టినట్లు ఆయన తెలిపారు. 

ఉచితంగా 8 లక్షల టన్నుల ఆహార ధాన్యాల పంపిణీ...
ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకం కింద గత ఏడాది మే, జూన్‌ మాసాలలో వలస కార్మికులు, వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుబడిపోయిన వలస కార్మికులు, రేషన్‌ కార్డులు లేని వారికి ఉచితంగా పంపిణీ చేసేందుకు 8 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలను వివిధ రాష్ట్రాలకు కేటాయించినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి రాజ్యసభలో వెల్లడించారు. ఈ ఆహార ధాన్యాలు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతున్నాయో లేదో పర్యవేక్షించేదుకు 12 మానిటరింగ్‌ సంస్థలను నియమించినట్లు శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా చెప్పారు. రేషన్‌ షాప్‌లలో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ కారణంగా ఎలక్ట్రానికి పాయింట్‌ ఆఫ్‌ సేల్ (ఈ-పోస్‌) పరికరాలు పనిచేయని సమస్యపై ఆయా రాష్ట్రాలతో సవివరంగా చర్చించినట్లు ఆమె చెప్పారు. ఒన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డ్‌ పథకం కింద లబ్ధిదారులు తమకు అందుబాటులో ఉన్న రేషన్‌ షాప్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

సేంద్రీయ సాగులో మనదే అగ్రస్థానం…
సర్టిఫైడ్‌ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతుల సంఖ్యలో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్‌ తోమర్‌ తెలిపారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ సర్టిఫైడ్‌ సేంద్రీయ పంటలు సాగు చేస్తున్న రైతుల సంఖ్య ప్రపంచ దేశాలన్నింటి కంటే భారత్‌లోనే అత్యధికంగా ఉందని చెప్పారు. అలాగే సర్టిఫైడ్ సేంద్రీయ పంటల సాగు విస్తీర్ణంలో భారత్‌ ప్రపంచంలో అయిదవ స్థానంలో ఉన్నట్లు తెలిపారు.  పరంపరగత్‌ కృషి వికాస్‌ యోజన, మిషన్‌ ఆర్గానికి వేల్యూ చైన్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ నార్త్‌ ఈస్ట్‌ రీజయన్‌ వంటి పథకాల ద్వారా 2015-16 నుంచి ప్రభుత్వం సేంద్రీయ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ రెండు పథకాల ద్వారా పంట దిగుబడి నుంచి సర్టిఫికేషన్‌, మార్కెటింగ్‌ వరకు సేంద్రీయ రైతులకు సంపూర్ణ సహకారం సహాయ సహకారాలను అందిస్తోంది. పంట చేతికి వచ్చిన తర్వాత దానిని ప్రాసెస్‌, ప్యాకింగ్‌, మార్కెటింగ్‌ చేయడం ఈ పథకాలలో అంతర్గత భాగమని ఆయన చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top