హోం శాఖ పరిశీల‌నలో దిశ బిల్లు

రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపించిన రెండు దిశ బిల్లులను పరిశీలిన అనంతరం తమ అభిప్రాయాలను జోడించి తదుపరి ఆమోదం కోసం హోం మంత్రిత్వ శాఖకు పంపినట్లు కేంద్ర మహిళాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గురువారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి అడగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆమోదించిన దిశ బిల్లు - క్రిమినల్‌ లా (సవరణ) బిల్లు, మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ఉద్దేశంగా రూపొందించిన బిల్లులపై హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను కోరినట్లు ఆమె తెలిపారు.

దిశ (క్రిమినల్‌ లా సవరణ) బిల్లుపై అభిప్రాయాలను కోరుతూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి 2020 జనవరి 21న తమ మంత్రిత్వ శాఖకు చేరినట్లు మంత్రి చెప్పారు. ఈ బిల్లుపై మా మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు పంపించాం. అనంతరం మా అభిప్రాయాలతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన  వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఈ బిల్లుపై  వెల్లడించిన అభిప్రాయాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలు కోరడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరణలను జత చేస్తూ తిరిగి హోం మంత్రిత్వ శాఖ ఆ బిల్లును మా మంత్రిత్వ శాఖకు పంపించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మా మంత్రిత్వ శాఖ అభిప్రాయాలను క్రోడీకరించి తిరిగి గత జూన్‌ 15న ఈ బిల్లును హోం మంత్రిత్వ శాఖకు పంపించినట్లు ఆమె వెల్లడించారు.
మహిళలు, చిన్నారులపై జరిగే లైంగిక అత్యాచార నేరాలనుత్వరితగతిన విచారించేందుకు వీలుగా ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుకు ఉద్దేశించిన మరో బిల్లు 2020 జనవరి 29న హోం మంత్రిత్వ శాఖ నుంచి తమ మంత్రిత్వ శాఖకు చేరినట్లు మంత్రి తెలిపారు. దీనిపై కూడా తమ అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు పంపించడం జరిగింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ముసాయిదా బిల్లును ఈ ఏడాది జనవరి 11న హోం మంత్రిత్వ శాఖ తమ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపింది. దానిపై కూడా మా అభిప్రాయాలను హోం మంత్రిత్వ శాఖకు తెలియచేయడం జరిగింది. ఈ రెండు దిశ బిల్లులు ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉన్నాయని మంత్రి తెలియచేశారు. 

మహిళల కోసం రాష్ట్రంలో 14 దిశ కేంద్రాలు
 హింసకు గురవుతూ ఆపదలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 14 దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మహిళాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ చెప్పారు. రాజ్యసభలో గురువారం శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబుస్తూ చిత్తూరు జిల్లాకు మంజూరు చేసిన రెండు కేంద్రాలలో ఒకటి ఇంకా పని ప్రారంభించలేదని తెలిపారు.
హింసకు గురై విపత్తును ఎదుర్కొంటున్న మహిళలకు పోలీసు రక్షణ, వైద్య, న్యాయ సహాయం, న్యాయ సలహాలు, కౌన్సిలింగ్ సేవలతోపాటు వారికి ఆశ్రయం కల్పించేందు ఉద్దేశంతో సమీకృత సేవలను అందించే విధంగా దిశ కేంద్రాలను తీర్చిదిద్దినట్లు మంత్రి చెప్పారు. ఆపదలో ఉన్న మహిళలకు దిశ కేంద్రాల్లో రేయింబవళ్ళు సేవలు అందించడం జరుగుతుంది. మహిళల సాధికారతను సాధించే విధంగా వారికి రక్షణ, భద్రత కల్పించేందుకు మిషన్ శక్తి కార్యక్రమం కింద ఆయా జిల్లాల్లో దిశ కేంద్రాల స్థాపన జరిగినట్లు మంత్రి చెప్పారు.

రాష్ట్రంలో 28 ఏకలవ్య మోడల్‌ స్కూళ్ళు
 ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 28 ఏకలవ్య మోడల్‌  రెసిడెన్షియల్‌ స్కూళ్ళు మంజూరైనట్లు గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రేణుక సింగ్‌ తెలిపారు. రాజ్యసభలో గురువారం శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు మంజూరైన 28 ఏకలవ్య స్కూళ్ళలో 11 విశాఖపట్నం జిల్లాలోను 6 తూర్పు గోదావరి జిల్లాలోను ఉన్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా ఏకలవ్య సూళ్ళలో నాణ్యమైన విద్యా బోధన అందించేందుకు అవసరమైన విధాన నిర్ణయాలు తీసుకుని సహకరించడానికి వీలుగా 2019లో  గిరిజన విద్యార్ధుల జాతీయ విద్యా సంఘాన్ని (ఎన్‌ఈఎస్‌టీఎస్‌)ను నెలకొల్పడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ సంస్థను నెలకొల్పిన తొలి ఏడాదిలోనే ఆంధ్రప్రదేశ్‌లోని ఏకలవ్య స్కూళ్ళలో 92 శాతం మంది టెన్త్‌ విద్యార్ధులు, 88 శాతం మంది ఇంటర్‌ విద్యార్ధులు ఉత్తీర్ణులయ్యారని మంత్రి వెల్లడించారు. ఇంటర్‌లో ఉత్తీర్ణులైన విద్యార్ధుల్లో 13 మంది ఇంజనీరింగ్‌ కోర్సుల్లోను, 11 మంది మెడికల్‌ కోర్సుల్లోను 21 మంది ఇతర ప్రొఫెనల్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందారని తెలిపారు. ఏకలవ్య విద్యాలయాల్లో విద్యార్ధులు జేఈఈ, నీట్‌లో కూడా రాణించేందుకు వీలుగా దక్షణ ఫౌండేషన్‌ ద్వారా ఎంపిక చేసిన ఇంటర్‌ విద్యార్ధులకు ప్రత్యేకంగా కోచింగ్‌ ఇస్తున్నట్లు ఆమె చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top