విశాఖ ఐఐపీఈ క్యాంపస్‌కు కోర్టు కేసు ఆటంకం 

రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ : విశాఖపట్నంలో నెలకొల్పిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) క్యాంపస్‌ నిర్మాణానికి కోర్టు కేసు ఆటంకంగా మారిందని పెట్రోలియం శాఖ సహాయ మంత్రి   రామేశ్వర్‌ తెలి తెలిపారు. రాజ్యసభలో బుధవారం వైయ‌స్సార్సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఐఐపీఈ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో 201 ఎకరాలను కేటాయించి 175 ఎకరాలను ఐఐపీఈకి స్వాధీనం చేసినట్లు చెప్పారు. మిగిలిన 26 ఎకరాలకు సబంధించి కోర్టులో కేసు ఉన్నందున ఐఐపీఈకి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్వాధీనం చేయలేదు. ఐఐపీఈకి అప్పగించిన భూమిలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) సరహద్దు గోడను నిర్మిస్తోందని మంత్రి చెప్పారు.
ఆంధ్రా యూనివర్శిటీ లీజుపై ఇచ్చిన వసతిలోనే ప్రస్తుతం ఐఐపీఈ పని చేస్తోంది. ఐఐపీఈ క్యాంపస్ నిర్మాణం కోసం మూలధన వ్యయం కింద 655 కోట్ల రూపాయల కేటాయింపును పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. ఈ మొత్తంలో ఇప్పటి వరకు 184 కోట్ల రూపాయలు విడుదల చేయగా ఆంధ్రా యూనివర్శిటీ ఆవరణలోని తాత్కాలిక క్యాంపస్‌లో వసతి సౌకర్యం, శాశ్వత క్యాంపస్‌లో సరిహద్దు గోడ నిర్మాణం కోసం 51 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. కోర్టు వివాదంలో ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఐఐపీఈకి స్వాధీనం చేయడాన్ని బట్టి శాశ్వత క్యాంపస్‌ నిర్మాణం జరుగుతుందని చెప్పారు.
 
మూడేళ్ళలో ఓబీసీ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.3459 కోట్లు
  గడచిన మూడేళ్ళలో ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) విద్యార్ధులకు పోస్టు మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కింద కేంద్ర ప్రభుత్వం 3,459 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి  సుష్రీ ప్రతిమా భౌమిక్‌ తెలిపారు. ఓబీసీ విద్యార్ధులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం చేసే ఖర్చు 20 శాతం తగ్గిన విషయం వాస్తవమేనా అంటూ రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అలాంటిదేమీ లేదని చెప్పారు. 2017-18 నుంచి 2019-20 వరకు సుమారు కోటీ 23 లక్షల మంది ఓబీసీ విద్యార్ధులకు ప్రభుత్వం పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఓబీసీ విద్యార్ధులకు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల పంపిణీని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తాయని తెలిపారు. అర్హులైన ఓబీసీ విద్యార్ధులకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఆర్థిక సహాయానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత నిధులను వెచ్చించి స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేస్తుందని వివరించారు. 

తాజా వీడియోలు

Back to Top