కరోనా మృతుల ఆశ్రితులకు ఈఎస్‌ఐ పెన్షన్‌

రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు

న్యూఢిల్లీ : కరోనాతో మరణించిన కార్మికుల కుటుంబ సభ్యులకు పెన్షన్‌ను అందించేందుకు ఈఎస్‌ఐసీ ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి  రామేశ్వర్‌ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో వైయ‌స్సార్సీపీ సభ్యులు  వి.విజయసాయి రెడ్డి అడగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2020 మార్చి 23 నుంచి ప్రారంభించిన ఈఎస్‌ఐసీ కోవిడ్‌-19 రిలీఫ్‌ స్కీమ్‌ రెండేళ్ళపాటు అమలులో ఉంటుందని తెలిపారు. ఈఎస్‌ఐసీ వద్ద ఇన్సూర్‌ అయిన కార్మికులపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు.

ఈఎస్‌ఐసీ కోవిడ్‌ రిలీఫ్‌ పథకం కింద కోవిడ్‌తో మరణించిన కార్మికుడు లేదా ఉద్యోగిపై ఆధారపడిన అర్హులైన కుటుంబ సభ్యులకు ఆ ఉద్యోగి పొందే వేతనంలో సగటున 90 శాతం మొత్తాన్ని పెన్షన్‌ కింద పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద పెన్షన్‌ పొందడానికి రూపొందించిన అర్హతలను ఆయన వివరించారు. కోవిడ్‌ సోకినట్లుగా గుర్తించిన రోజు నుంచి మూడు నెలల ముందు సదరు కార్మికుడు లేదా ఉద్యోగి తప్పని సరిగా ఈఎస్‌ఐసీ ఆన్‌లైన్‌ పోర్టల్‌లో తన పేరును నమోదు చేసుకుని ఉండాలి. కోవిడ్‌ బారిన పడటానికి ముందు కనీసం 70 రోజుల పాటు ఆ ఉద్యోగి తరఫున ఈఎస్‌ఐసీ చందా చెల్లిస్తూ ఉండాలి. కోవిడ్‌తో మరణించిన వ్యక్తి మహిళ అయివుంటే పెన్షన్‌ ప్రయోజనం ఆమె భర్తకు లభిస్తుంది. ప్రస్తుతం అమలులో ఉన్న పెన్షన్‌ నిబంధనల ప్రకారం కార్మికుడు మరణాంతరం అతని భార్య తిరిగి వివాహం చేసుకునే వరకు పెన్షన్‌కు అర్హురాలు అవుతుంది. అయితే ఈఎస్‌ఐసీ కోవిడ్‌ రిలీఫ్‌ పథకం కింద పెన్షన్‌కు అర్హురాలైన మహిళకు ఈ నిబంధన వర్తించదు. ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌లో సభ్యులైన కార్మికులు లేదా ఉద్యోగులకు కూడా ఈఎస్‌ఐసీ కోవిడ్‌ రిలీఫ్‌ పథకం వర్తిస్తుందని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా పెన్షన్‌కు అర్హులైన కుటుంబ సభ్యులలో భర్త లేదా భార్య వారి జీవితాంతం పెన్షన్‌ పొందే అవకాశం ఉంది. లబ్ధిదారుడు కుమారుడైతే అతనికి 25 ఏళ్ళు నిండే వరకు, కుమార్తె అయితే వారికి వివాహం జరిగే వరకూ పెన్షన్‌ పొందడానికి అర్హులవుతారని మంత్రి చెప్పారు. 

'క్రీమీ లేయర్‌' ఫార్ములా అందరికీ ఓకటే
 ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల అధికారులకు క్రీమీ లేయర్‌ నిబంధన ఒకేలా వర్తిస్తుందని సామాజిక న్యాయ సహాయ మంత్రి సుష్రీ ప్రతిమా భౌమిక్‌ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం చెప్పారు. క్రీమీ లేయర్ ప్రాతిపదికను లెక్కగట్టే విషయంలో ప్రభుత్వరంగ సంస్థలు ప్రదర్శిస్తున్నవివక్షపై విచారణ జరపాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ నిర్ణయించిన విషయం వాస్తవమేనా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ అలాంటి విచారణకు సంబంధించిన వివరాలేవీ కమిషన్ తమకు ఇవ్వలేదని చెప్పారు. ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో డీఓపీటీ రూపొందించిన క్రీమీ లేయర్ ఫార్ములానే ఇప్పటికీ అనుసరిస్తున్నట్లు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top