సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌తో మంచి పాల‌న అందిస్తున్నారు

సీఎం వైయ‌స్ జగన్‌పై కేంద్ర మంత్రి ప్రశంసలు

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి  గ్రామ సచివాలయ వ్యవస్థతో చాలా మంచి పాలన అందిస్తున్నారని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేష్ పోక్రియల్ అభినందించారు. గ్రామ సచివాలయాలు, విద్యాసంస్కరణలను ఆయన ప్రశంసించారు. గురువారం వెబినార్ ద్వారా జరిగిన ఎన్‌సీఈఆర్‌టీ 57వ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో తీసుకున్న ప్రత్యేక చర్యలను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్ర మంత్రికి వివరించారు. సీఎం వైయ‌స్ జగన్ ప్రవేశపెట్టిన విద్యాకానుక, నాడు నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకాలను వివరించారు. 
అనంతరం కేంద్ర మంత్రి రమేష్ పోక్రియల్ మాట్లాడుతూ.. వైయ‌స్ జ‌గ‌న్ తీసుకొచ్చిన వ్యవస్థ ప్రజలకు మంచి మేలు చేస్తోందని అన్నారు. సీఎం వైయ‌స్ జగన్ విద్యార్థుల కోసం చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, విద్యామృతం, విద్యా కళశం ఆన్ లైన్ క్లాసులు నిర్వహించటంపై ప్రశంసలు కురిపించారు. విద్యార్థులకు మంచి న్యూట్రీషియన్ ఆహారాన్ని అందిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వమే అదనంగా బడ్జెట్‌ని కేటాయించి ఇవ్వడం సంతోషమన్నారు. ఏపీ సీఎం చేస్తున్నట్టుగా ఇతర రాష్ట్రాలు కూడా చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఇతర రాష్ట్రాలకు కూడా తెలియజేస్తామని అన్నారు.

Back to Top