గత ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది

కోవిడ్‌ ఇబ్బందిలోనూ సంక్షేమ పథకాలు ఆగలేదు
 
టీడీపీ నేతల ఆరోపణల్లో అర్థమే లేదు

యనమల ఆరోపణలను ఖండించిన మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

 విజయవాడ:  గత ప్రభుత్వమే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి విమర్శించారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ఆరోపణలను మంత్రి ఖండించారు. రాష్ట్ర అప్పులపై ఆందోళన వద్దని తెలిపారు. టీడీపీ నేతలు మాట్లాడే మాటలకు ఏమైనా అర్థం ఉందా అని ప్రశ్నించారు. ఒకసారి 4 లక్షల కోట్ల మరోసారి 10 లక్షల కోట్ల అప్పు అంటున్నారని దుయ్యబట్టారు. కోవిడ్‌ ఇబ్బందులతోనూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఆగలేదని తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటేః

 

ఆర్థికాంశాలపై అడిగిందే అడగడమా..?ః

తెలుగుదేశం పార్టీ రోజువారీ షెడ్యూల్‌లో ఏదీ మాట్లాడేందుకు లేనప్పుడు.. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికఅంశాలు, అప్పులు అనే అంశాన్ని ఎంచుకుంటారేమో.. అందులో భాగంగానే మాజీమంత్రి యనమల రామకృష్ణుడు లేఖలు రాస్తున్నారు. అంతకుముందు ఫైనాన్స్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గారికి లేఖ రాశారంట. ఆయన సమాధానం ఇవ్వకున్నందున యనమల నాకు మరో లేఖ రాసినట్లు అందులో పేర్కొన్నారు. ఆయన లేఖలోని ప్రశ్నల్ని చూస్తే.. బహుశా, వాటికి సమాధానాలిస్తే యనమల పరువు మర్యాదలు పడిపోతాయనే భయంతోనే మా అధికారులు స్పందించలేదనే అభిప్రాయం నాకనిపించింది. రాష్ట్రంలో ఏ కొత్త సమస్యలూ లేనట్టుగా.. పదేపదే ఆర్థిక అంశాలపై అడిగిందే అడగడంలో యనమల రామకృష్ణుడు అనుభవం ఎలా పనిచేస్తుందో తనకు తాను పునఃసమీక్షించుకోవాలి. అయినప్పటికీ, ప్రభుత్వపరంగా మేం సమాధానాలివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 

 

60 ఏళ్ల రాష్ట్ర అప్పును మా ఖాతాలో వేస్తారా..?ః

రాష్ట్రప్రభుత్వం అప్పు చేయాలంటే.. పరిమితి ఉంటుంది. ఆ పరిమితికి మించి అప్పు చేయడానికి వీలు కాదనే విషయం మాజీమంత్రి యనమలకు కూడా తెలుసు. అలాంటిది, ఆయన ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నంలో భాగంగా నోటికొచ్చినట్లు మాట్లాడుకోవడం ఎంతవరకు సబబు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీలో ఉన్న అవగాహనలేని చోటామోటా నాయకులు సైతం ఆర్థికాంశాలపై మాట్లాడుతున్నారంటే.. అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి లేదు. టీడీపీ వారు లేఖల్లో అడిగినట్లు కాగ్‌ నివేదికలో చూపిన ఈ రాష్ట్ర అప్పు రూ.3.72 లక్షల కోట్లను.. మా ప్రభుత్వమే చేసినట్లుగా చిత్రీకరిస్తే ఎలా సరిపోతుంది..? గతంలో ఉన్నటువంటి అప్పును కూడా మా ప్రభుత్వానికి ఎలా అంటగడతారు?. దేశ స్వాతంత్య్రం తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన దగ్గర్నుంచీ రాష్ట్రవిభజన తో తెలంగాణ అప్పును మినహాయిస్తే మార్చి –2023కి తేలిన మన రాష్ట్ర మొత్తం అప్పు అది. అంటే, దాదాపు 60 ఏళ్ల కిందట్నుంచీ పెరుగుతూ వస్తున్న అప్పు అది. ఈ సంగతి కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు తెలుసు. అయితే, పనిగట్టుకుని ఈ ప్రభుత్వంపై నిందలేయడం మంచిదికాదని చెబుతున్నాను. 

 

మీ హయాంలో అప్పు రూ.2.57 లక్షల కోట్లుః

మేం అధికారంలోకి వచ్చినదగ్గర్నుంచీ ఇప్పటి వరకు చూస్తే పరిమితికి మించి అప్పు చేయలేదు.  నాలుగేళ్లల్లో రూ.4.50 లక్షల కోట్ల అప్పుతో ఈ ప్రభుత్వం నడుస్తుందన డంలో అర్ధమేలేదు. ఇలాంటి ఆరోపణను మేం ఖండిస్తున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర అప్పులో రూ.2.57 లక్షల కోట్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2014లో చంద్రబాబు ప్రభుత్వానికి రూ.97వేల కోట్లు లెగసీగా వచ్చాయి. అక్కడ్నుంచి వారు ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.97వేల కోట్లు నుంచి రూ.2.50 లక్షల కోట్లు వరకు అప్పును పెంచారు. అక్కడ్నుంచీ అది పెరుగుతూ వస్తుంది. వాస్తవాల్ని దాచి మీరెందుకు మా ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు? మీరు చేసిన అప్పును కూడా ఈ ప్రభుత్వానికి అంటగట్టడం ఎంతవరకు సమంజసం..?. ఇదే నిజాల్ని మేం పదేపదే గతంలో కూడా చెప్పాం. ఎప్పటికప్పుడు ప్రజలకు అర్ధమయ్యేలా వివరిస్తూనే ఉన్నాం. 

 

మేం చేసిన అప్పు రూ.1,36, 508 కోట్లుః

ఆర్థిక అంశాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో అవగాహన కలిగిన నాయకులు లేరనే విషయం వారి లేఖల ద్వారా అర్ధమౌతుంది. ఒక్కో లేఖలో ఒక్కో విధంగా వారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని విశ్లేషిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. యనమల రామకృష్ణుని లేఖ ప్రకారం 2018–19 రాష్ట్ర అప్పు రూ.2,57,210 కోట్లు ఉందనుకుంటే, 2021–22 ప్రకారం రూ.3,93,718 కోట్లు అప్పు ఉందన్నారు. అంటే, మూడేళ్లల్లో అప్పు రూ.1,36,508 కోట్లు. 

 

– ఈ మూడేళ్ల అప్పును ఒక్కో ఏడాదికి భాగించి చూస్తే రూ.45,502 కోట్లు. అంటే, ఏడాదికి ఈ ప్రభుత్వం చేసిన అప్పు రూ.45,502 కోట్లు అని కాగ్‌ నివేదిక ప్రకారమే చెబుతున్నట్లు మీరే అంగీకరించారు. మరికొన్ని లేఖల ద్వారా మేము ఏడాదికి రూ.1.50 లక్షల కోట్లు పైగా అప్పు చేశామనడంలో ఏమైనా అర్ధముందా..? దీన్నిబట్టి మాజీమంత్రి యనమల స్థాయికి, అనుభవానికి ఇలాంటి డొల్ల కబుర్లు తగవని.. ఆయన విధానం మార్చుకుంటే మంచిది. 

 

మీహయాంలో ఆదాయవృద్ధి రేటు 6 శాతమేః

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగి ఉంటే.. రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదనే టీడీపీ బురదజల్లే ప్రశ్నకు సమాధానమిస్తున్నాం.  రెవెన్యూ రాబడి గణాంకాల్ని పరిశీలిస్తే.. టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 వరకు వృద్ధిరేటు 6 శాతంకు పెరిగింది. ఎక్కడా కోవిడ్‌ వంటి సంక్షోభం లేకుండా ఏడాదికేడాది ఆదాయ రాబడి ప్రకారం వృద్ధిరేటు కేవలం 6 శాతమేనని అధికారిక రికార్డులు చెబుతున్నాయి.

 

నాలుగున్నరేళ్లలో మా ప్రభుత్వ వృద్ధిరేటు 16.7 శాతంః

 అదే వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం పచ్చాక 2019–20న రూ.1,11,030 కోట్లు ఆదాయం ఉండగా, 2020–21లో రూ.1,17,135 కోట్లు ఆదాయం రాగా, 2021–22కి రూ.1,50,555 కోట్లు, 2022–23లో రూ.1,77,457 కోట్లు రాబడితో ఏడాదికేడాది వృద్ధిరేటును లెక్కిస్తే 16.7 శాతం పెరిగింది. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ఏడాదికేడాది ఆదాయ రాబడి ప్రకారం కేవలం 6 శాతమే ఉన్న వృద్ధిరేటు.. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాలుగున్నరేళ్ల పాలనలో రాష్ట్ర ఆదాయ వృద్ధిరేటు 16.7 శాతం పెరిగింది. అందులోనూ మా హయాంలో ఏడాదిన్నరపాటు కోవిడ్‌ సంక్షోభం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ, రాష్ట్ర ఆదాయ వృద్ధిరేటు ఏమాత్రం తగ్గలేదు. ఇవన్నీ మేము మీలా నోటికొచ్చినట్లు చెప్పే లెక్కలు కావు. కాగ్‌ నివేదికలు, ఆర్థిక వెబ్‌సైబ్‌లలో అధికారికంగా పేర్కొన్న గణాంకాల్నే చెబుతున్నాం.

 

కాగ్‌ నివేదికల్ని పురంధేశ్వరి తప్పుబడతారా..?ః  

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి లేఖ ఆమె అవగాహనారాహిత్యాన్ని తెలియజేస్తుంది. దేశం, రాష్ట్రాల్లోని ప్రభుత్వాలన్నీ కాగ్‌ నివేదికల ద్వారా తమ ఆర్థిక, అప్పులు గురించి ఒక లైన్‌మీద నడుస్తుంటాయి. ఇప్పుడేమో, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అంశాలపై ఒక ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరగాలంటూ పురంధేశ్వరి కోరుతున్నారంటే ఏమైనా అర్ధముందా..? అంటే, ఆమె కేంద్రప్రభుత్వం ఇచ్చే కాగ్‌ నివేదికలను తప్పుబడుతున్నారన్న మాటే కదా..? మేం శ్వేతపత్రం విడుదల చేయాలని మరోలేఖలో ఆమె కోరారు. అంటే, రాష్ట్రం తమ ఆర్థికపరిస్థితిపై కేంద్రానికి.. అదేక్రమంలో కేంద్రం కూడా రాష్ట్రానికి శ్వేతపత్రాలు చూపెడుతూ కొత్త సంస్కృతిని అమలుకావాలనే అభిప్రాయంతో ఆమె ఉన్నారా..?. కాగ్‌ నివేదిక, ఆర్థికమంత్రి నివేదిక, ఆర్బీఐ నివేదికలన్నీ తప్పనేది అటు టీడీపీ, ఇటు పురంధేశ్వరి గారి అభిప్రాయమైతే.. వారి రాజకీయ అనుభవాల్ని, స్థాయిల్ని ఏమేరకు దిగజార్చుకుంటున్నారో తెలుస్తుంది. తెలంగాణ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ఆమె ఎందుకు లేఖ రాయరు..? అదేవిధంగా టీడీపీ హయాంలో ఇంచుమించు రూ.40 వేల కోట్లు పెండింగ్‌ బిల్లులున్నాయి. ఆ బిల్లుల గురించి ఆమె అడగరు గానీ.. ఇక్కడ ఆర్థికాంశాలపై తనకు నచ్చినట్లు సమాధానం కావాలని కోరతారు. ఇదెక్కడి రాజకీయ నైతికత..? అని ప్రశ్నిస్తున్నాను.  

 

గ్యారెంటీ, నాన్‌ గ్యారెంటీ అప్పుల్లో టీడీపీ చేసిందే ఎక్కువః

కాగ్‌ నివేదికలో పేర్కొన్న అప్పు కాకుండా ఇతరత్రా కార్పొరేషన్‌ అప్పులున్నాయనే ఆరోపణల్లో వాస్తవాల్ని కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరముంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి రూ.1.18 లక్షల కోట్ల కార్పొరేషన్‌ల అప్పుల్లో 2019 నాటికి గ్యారెంటీలతో రూ.57,687 కోట్లు టీడీపీ ప్రభుత్వం అప్పు చేసింది. అదేవిధంగా గ్యారెంటీ లేకుండా రూ.66,664 కోట్లు అప్పు చేసింది. అదే మా ప్రభుత్వం వచ్చాక రూ.57,687 కోట్లు గ్యారెంటీ రుణం కాస్తా రూ.1.18 లక్షల కోట్లు అయ్యింది. నాన్‌ గ్యారెంటీ రుణం ఇప్పటికీ రూ.83,800 కోట్లు ఉంటే, మా ప్రభుత్వం వచ్చాక కేవలం రూ.20వేల కోట్లు మాత్రమే రుణం తీసుకుంది. ఈ గణాంకాల గురించి టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడరు..? ప్రజలకు వాస్తవాలు వివరించొచ్చుకదా..? అదిమాత్రం చేయరు. 

 

ఆర్థికపరిస్థితిపై వారివి బేస్‌ లెస్‌ ఆరోపణలేః

ఆర్థికపరిస్థితిని అంచనా వేయాలంటే స్థూల ఉత్పత్తి, ద్రవ్యలోటు, రెవెన్యూలోటు, వార్షిక వృద్ధిరేటు అనే ఫిజికల్‌ పారామీటర్స్‌ను బేస్‌గా తీసుకోవాలి. అయితే, టీడీపీ నేతల ఆరోపణలన్నీ బేస్‌లెస్‌గా.. ఆర్థిక అంశాలపై ఏమాత్రం అవగాహన లేనట్టుగా వారు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ప్రజల దృష్టికి తెస్తున్నాను.  

 

టీడీపీ ఫౌండేషనే ఫిల్మ్‌ ఫీల్డ్‌ ః

టీడీపీ ఫౌండేషనే ఫిల్మ్‌ ఫీల్డ్‌ కనుక.. ప్రతీదీ సినిమా టైటిల్స్ మాదిరిగా, క్యాచీ టైటిల్స్ -ఫిగర్స్ తో, అభూతకల్పనలతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలని కోరుకుంటుంది. అందులో భాగంగానే కేంద్రం ఇచ్చిన కాగ్‌ నివేదికను పక్కనబెట్టి రూ.10 లక్షల కోట్లు అప్పు చేశామంటూ క్యాచీ ఫిగర్‌లు ప్రచారం చేస్తున్నారు. అదే వైఎస్‌ఆర్‌సీపీ ఫౌండేషన్‌ చూస్తే.. మాట ఇస్తే.. దాన్ని నెరవేర్చి ప్రజల ముందుకెళ్లడమనేది అందరికీ తెలిసిన విషయం. కాబట్టే.. జగన్‌గారు నాయకత్వంలో కులాలు, మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమాభివృద్ధి ఫలాల్ని అందిస్తూ ఆదరణ పొందుతున్నారు. 

 

చంద్రబాబు మాటలగారడికి కాలం చెల్లిందిః

ఆదినుంచి వ్యూహాత్మక రాజకీయ కుట్రల్లో భాగంగా నారా చంద్రబాబు నాయుడు తన వ్యతిరేకులపై విషప్రచారం చేయడంలో దిట్ట. ఆయన చెప్పుకునే సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, ఐటీని నిజానికి ఎవరు కనిపెట్టారో కూడా అందరికీ తెలిసిందే. గతంలో అమరావతిలో ఒలింపిక్స్‌ జరుపుతామన్నారు. నోబెల్‌ ఫ్రైజ్‌లు తానే ఇస్తానని చెప్పారు. అయితే, ఆయన మాటల్ని అమరావతిలో ఎవరూ నమ్మలేదు గానీ..  మొన్న గచ్చిబౌలి, డల్లాస్, బెంగుళూరులో వీరంగం చేసిన తమవాళ్లు మాత్రం కాస్త నమ్మినట్లు వాతావరణం కనిపిస్తుంది. వాళ్లు కూడా కళ్లు తెరవాల్సిన రోజులొచ్చాయి. స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ఆధారాలతో అడ్డంగా దొరికిన దొంగలా జైలుకెళ్లిన చంద్రబాబుకు మద్ధతిచ్చేందుకు ఇక్కడెవరూ ముందుకురాకపోతే.. పక్కరాష్ట్రాల్లో వాస్తవాలు తెలియనోళ్లతో సంబరాలు చేయించుకున్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. 

Back to Top