వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యం

3 రాజధానుల ఉపసంహరణ బిల్లుపై మంత్రి బుగ్గన  

 అమరావతి: వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమ‌ని ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి తెలిపారు. అందుకే అన్ని రాష్ట్రాలు అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని చెప్పారు. అసెంబ్లీ ముందుకు 3 రాజధానుల ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. ఉపసంహరణ బిల్లులపై చర్చకు స్పీకర్‌ అనుమతించారు. పరిపాలన వికేంద్రీకరణ-సమ్మిళిత అభివృద్ధి ఉపసంహరణ బిల్లును అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. రాయలసీమ, ఉత్తరాంధ్ర, వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణకమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పిందని మంత్రి బుగ్గన అన్నారు. కోస్తాను వెనుకబడిన ప్రాంతంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పలేదన్నారు.  
గ‌తంలో హైద‌రాబాద్‌లోనే అన్ని కేంద్ర ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌డంతో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృత‌మైంది.  ప్రభుత్వ రంగ సంస్థలు, ఆల్మోస్ట్ 90% ప్రైవేట్ సంస్థ‌లు, సాప్ట్‌వేర్ సంస్థ‌లు హైద‌రాబాద్‌లోనే ఉన్నాయి. అందువ‌ల్లే విభ‌జ‌న చేయాల్సి వ‌చ్చింది. ఇదే అభిప్రాయం శ్రీ‌కృష్ణ క‌మిటీ నివేదిక కూడా చెప్పింది.  కానీ చంద్ర‌బాబు క‌మిటీ నివేదిక‌ను స‌భ‌లో పెట్ట‌లేదు. ఎలాంటి చ‌ర్చ జ‌ర‌ప‌కుండా 33 వేల ఎక‌రాల్లో రాజ‌ధాని నిర్మిస్తామ‌ని, మ‌రో 50 వేల ఎక‌రాల అట‌వీబూముల‌ను వాడుక‌లోనికి తెస్తామ‌ని చెప్పారు. 50 వేల ఎక‌రాల్లో రాజ‌ధాని నిర్మించేందుకు ల‌క్ష కోట్లు అవ‌స‌రం అవుతాయి. ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌జ‌లు వ్య‌తిరేకిస్తూ 2019 ఎన్నిక‌ల్లో టీడీపీని ఓడించారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక  అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చేసేందుకు మూడు రాజ‌ధానుల నిర్ణ‌యాన్ని ప్ర‌భుత్వంతీసుకుంది. గ‌తంలో చంద్ర‌బాబు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు, విత్త‌నాలు త‌యారు చేసే వారితో క‌మిటీ ఏర్పాటు చేసి రాజ‌ధాని క‌ట్టాల‌నుకున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మాత్రం ఫ్రోఫెస‌ర్లు, ఎక్స్‌ఫ‌ర్ట్‌తో క‌మిటీ వేసి, అందులో మంత్రుల‌ను స‌భ్యులను హైప‌వ‌ర్ క‌మిటీలో చేర్చారు.  అప్ప‌ట్లో చంద్ర‌బాబు క‌రెక్ట్‌గా ఆలోచ‌న చేయ‌లేదు.  అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. అన్ని చోట్లా అందరం కలిసి ఉండాల‌న్న‌దే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం.   ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రాంతాలు కూడా సంతోషంగా ఉండాల‌ని రివిల్ బిల్లు ప్ర‌వేశ‌పెడుతున్న‌ట్లు మంత్రి బుగ్గ‌న తెలిపారు. 

Back to Top