సంక్షేమానికి చిరునామా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం

రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక,వాణిజ్య పన్నులు, నైపుణ్య శిక్షణ, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 
 
 స్థిర ధరల వృద్ధిరేటులో ఆంధ్రప్రదేశ్ 2021-22 ఏడాదికిగానూ 11.43% నమోదు
 
యనమల నిరాధార ఆరోపణలు..అసత్యాలతో పత్రికా ప్రకటనలు

 రెండు నాల్కలు..వక్రమార్గాలు టీడీపీ పార్టీ, నాయకులకే చెల్లు!

 (-)4 శాతం వృద్ధిరేటును నిరూపిస్తే చర్చకు సిద్ధమే..

 నవరత్నాల రూపంలో పేదలకు అందించిన సంక్షేమం రూ.1.92 లక్షల కోట్లపైనే!

 104,108 వైద్య సేవల కోసం 1100 అంబులెన్సులు, పశువుల కోసం ప్రత్యేకంగా మరో 340

 కుటుంబానికి ఫ్యామిలీ ఫిజిషియన్, యువతకోసం స్కిల్ హబ్స్, అవినీతి లేని సంక్షేమాన్ని ఏమంటారు?

 ఊరూరా సచివాలయాలు, ఆర్ బీకేలు,విలేజ్ క్లినిక్ లు, డిజిటల్ లైబ్రరీలు, మిల్క్ చిల్లింగ్ కేంద్రాల ఏర్పాటు అభివృద్ధి కాక 
మరేమిటి?

 తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామాగా, అభివృద్ధికి కేంద్ర బిందువుగా ముందుకు సాగుతోంద‌ని  రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక,వాణిజ్య పన్నులు, నైపుణ్య శిక్షణ, శాసన సభ వ్యవహారాల శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. మునుపెన్నడు లేని విధంగా 11.43 శాతం వృద్ధి రేటును సాధించింది. కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రజలకు ఏ కష్టం రానీయకుండా, ఎన్నికల హామీలను మరవకుండా విపత్తు నుంచి బయటపడిన విధానాన్ని యావత్ ప్రపంచం మెచ్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ 11.43 శాతం వృద్ధి (2021-22) రేటు సాధించడం ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేసిందనడంలో సందేహం లేదు. 

గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన యనమలగారు, 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవమున్న  చంద్రబాబునాయుడు గారు, సామాన్యులకి మంచి, చెడులను చెప్పి చైతన్య పరిచే బాధ్యత కన్నా భయపెట్టడానికే ప్రాధాన్యతనిచ్చే కొన్ని పత్రికలు మాత్రం ఇష్టమొచ్చినట్లు అసత్య ప్రచారాలు చేస్తుండడం ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి ప్రకటించినా ప్రతిపక్షలాకు వినపడవ్. ఇటువంటివి కనపడవ్ అన్నట్లు వ్యవహరించడం సర్వ సాధారణమైపోయింది.  "పాడిందే పాటరా పాచి పళ్ల"..అన్న చందంగా రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి  'నారా'క్షేమం, వాళ్ల రాజకీయాభివృద్ధే  ధ్యేయంగా పని చేస్తుండడం దుర్లభం. దుర్మార్గం కూడా.

2021-22 సంవత్సరానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పనితీరుపై అర్థగణాంక శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం స్థిర ధరల అంశంలో ఏపీ జీఎస్డీపీ 11.43 శాతం. ఏ రాష్ట్రంతో పోల్చినా ఏపీదే ఈ విభాగంలో అగ్రస్థానం. వృద్ధి రేటు ఎలా లెక్కిస్తారో, ఆ ప్రక్రియ ఏంటో, వాటిని మీరెలా తారుమారు చేస్తారో అన్నీ తెలుసు కాబట్టే మీ ప్రతి ఆరోపణలపై స్పందిస్తున్నాం. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తున్నాం. స్థిర ధరల ప్రకారం లెక్కిస్తేనే రాష్ట్ర జీడీపీ 11.43 శాతం. అదే ప్రస్తుత ధరల ప్రకారం అయితే 18.47 శాతం. ఏ ప్రకారం చూసినా, ఏ విధంగా లెక్కేసినా (-)4 శాతం అనేది అసంభవం. అసాధ్యం. ఎంత అనుభవజ్ఞులైనా అప్పుడప్పుడు తప్పులు చేయడం సహజం. మీరు కూడా (-)4 శాతం అని పత్రికా ప్రకటనలో ఎప్పటిలాగే తప్పులో కాలేశారని భావిస్తున్నాం.  ప్రతిపక్షాలకి, విమర్శకులకి రుచించనంత మాత్రానా నిజం అబద్ధం కాదు. అబద్ధం ఎప్పటికీ నిజం కాదు. జాతీయ జీడీపీ 8.7శాతం నమోదవగా రాష్ట్ర జీఎస్డీపీ కేంద్ర జీడీపీ కన్నా 2.73 శాతం ఎక్కువగా నమోదు చేయడం నిఖార్సయిన నిజం .ఇదే ఏడాది గణాంకాలలో పొరుగు రాష్ట్రం తెలంగాణ 10.88 శాతంతో నాలుగో స్థానానికి పరిమితమైంది. రెండో స్థానంలో 11.04శాతం వృద్ధి రేటుతో రాజస్థాన్, 10.98 శాతంతో బీహార్ రాష్ట్రాలు వరుసగా స్థిర ధరల వృద్ధిరేటులో 3,4 స్థానాల్లో నిలిచాయి. 

మొత్తం స్థూల విలువ జోడింపు (GVA)లో వ్యవసాయం , అనుబంధ రంగాల సహకారం 35.47%గా నమోదైంది. వ్యవసాయ రంగంలో మన రాష్ట్ర వృద్ధి రేటు 11.27%గా ఉంది. అఖిల భారత స్థాయిలో ఇది కేవలం 3.0%. ఈ విషయంలో జాతీయ వృద్ధి కంటే మన రాష్ట్రం 8.27% అధికంగా నమోదు చేసి ఎంతో ముందుంది. వ్యవసాయం , అనుబంధ రంగాల కింద, లైవ్ స్టాక్ 11.63%, హార్టికల్చర్ 9.69%, ఫిషింగ్ , ఆక్వా కల్చర్ లో 9.08%  ఇవే  వృద్ధికి ప్రధాన కారణం.  ఈ లక్ష్య సాధనలో వ్యవసాయం , అనుబంధ రంగాల కింద సాపేక్షంగా అధిక వృద్ధి రేటు సాధించడానికి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తోన్న రైతు సంక్షేమ పథకాలు,కార్యక్రమాలే. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల(RBK) వ్యవస్థను ఏర్పాటు చేయడం వంటి ప్రభుత్వ వినూత్న సంస్కరణలే కారణం.  విత్తనం నుండి పంట విక్రయం వరకు అన్ని సేవలు రైతన్న గడప వద్దనే అందించేలా వన్ స్టాప్ సెంటర్లుగా రాష్ట్రవ్యాప్తంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను నిర్మించింది. ఇవే కాకుండా ప్రతి గ్రామంలో వీటితో పాటు సచివాలయాలు, మిల్క్ చిల్లింగ్ స్టేషన్లు, డిజిటల్ లైబ్రరీలు, విలేజ్ హెల్త్ క్లినిక్ ల వంటి వేలాది భవనాలు నిర్మించాం. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క భవనమైనా నిర్మించారా అని యనమలగారు ప్రశ్నించడం హాస్యాస్పదం. 

కోవిడ్ -19 సమయం లో కూడా భారత దేశ వృద్ధిరేటు (-)6.60%  నమోదు అయిన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రం 0.08% నమోదు  చేయడం మీకు తెలియదా?. 
2018-19 సంవత్సరంలో వ్యవసాయ రంగంలో 3.54 శాతం జీఎస్డీపీ నమోదైతే...2021-22 సంవత్సరానికి గానూ 11.27గా నమోదైంది.  2018-19 సంవత్సరంలో పారిశ్రామిక రంగంలో 3.17 శాతం జీఎస్డీపీ నమోదైతే...2021-22 సంవత్సరానికి గానూ 12.78గా నమోదైంది.  2018-19 సంవత్సరంలో సేవా రంగంలో 4.84 శాతం జీఎస్డీపీ నమోదైతే...2021-22 సంవత్సరానికి గానూ 9.73గా నమోదైంది. 2018-19 ఏడాదికిగానూ టీడీపీ ప్రభుత్వ హయాంలో 5.36 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదైంది. 2021-22 సంవత్సరంలో ఏపీ 11.43 శాతం వృద్ధి రేటు నమోదు చేసింది.

రంగం                        Andhra Pradesh                              All India
    2018-19 (TRE)     2019-20 (SRE)     2020-21 (FRE)    2021-22 (AE)        2020-21 (FRE)    2021-22
                            (PE)
వ్యవసాయం     3.54    8.6    2.68    11.27        3.3    3
పారిశ్రామిక    3.17    3.91    0.33    12.78        (-)3.3    10.3
సేవ రంగం     4.84    8.25    1.68    9.73        (-)7.8    8.4
                                   
వృద్ధి రేటు    5.36    6.89    0.08    11.43        (-)6.6    8.7

"ఖజానా ఖాళీ, రూ.100కోట్ల నిధి మాత్రమే మిగిలింది. ఎక్కడెక్కడ అప్పులొస్తాయో అన్నీ తెచ్చేశాం. ఒక్క రూపాయి కూడా ఇక అప్పు పుట్టదు. శ్రీలంకలా పనైపోయిందన్నారు. జింబాబ్వేలా మారిపోతుందన్నారు. నిత్యం వచ్చే వార్తా పత్రికల్లో కథనాలన్నింటికీ ఆంధ్రప్రదేశ్ ను ముడిపెట్టి సరికొత్తగా కథలు అల్లారు. ఇంత సంక్షేమం ఎలా సాధ్యమని అల్లాడిపోయారు. వడ్డీలు తక్కువ, అప్పు తక్కువ ఎలా చేయగలుగుతున్నారా అని విలవిలలాడిపోయారు. బీజేపీతో నేరుగా చెలిమి చేసినా తమరి ఐదేళ్ల కాలంలో చేయలేనంత చేస్తున్న మా ప్రభుత్వ సంక్షేమాభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారు. 40 ఏళ్ళ అనుభవానికి సాధ్యం కాని అభివృద్ధి ఏ అనుభవం లేని యువనాయకుడు 40 ఏళ్లపైన వయసులోనే ఎలా చేస్తున్నాడో అర్థం కాక తలలుపట్టుకున్నారు.  రూ.లక్ష కోట్ల అప్పు కూడా చేయని వైసీపీ ప్రభుత్వాన్ని గత కొన్ని నెలల ముందే రూ.10 లక్షల అప్పు అంటగట్టారు.”  అంత అప్పులేదని, కోవిడ్ లో అప్పు వింత కాదని తెలిసినా వితండవాదం చేశారు. పార్లమెంట్ లో సాక్షాత్తు కేంద్రమంత్రి సహా పలు ఆర్థిక వ్యవస్థలు అధికారికంగా గణాంకాలు తేల్చినా మీ పార్టీ స్వభావం ఏమాత్రం మారకపోవడం శోచనీయం.  అయినా సరే ప్రజలకు జవాబుదారీ కాబట్టి ప్రతి విషయం స్పష్టంగా చెబుతూనే వచ్చాం.వాస్తవాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉంటాం.

ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,07,771 కోట్లు.భారతదేశం యొక్క తలసరి ఆదాయం రూ. 1,50,007 కోట్లు. అంటే రాష్ట్ర తలసరి ఆదాయం  దేశ తలసరి ఆదాయం కంటే 38.5% ఎక్కువ. తలసరి ఆదాయం అంశంలో  ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో మెరుగ్గా ఉంది. మీరు పదే పదే నానా యాగి చేసే  అప్పుల విషయానికొస్తే, టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.2,64,451 కోట్ల రుణ భారంలో ఆంధ్రప్రదేశ్ కూరుకుపోయింది. 2022 మార్చికి ఏపీ అప్పులు రూ.3,98,903 కోట్లని స్వయంగా కేంద్ర ఆర్ధికశాక సహాయక మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్ లో ప్రకటించారు . ఆ లెక్క ప్రకారం, ఈ మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,34,452 లక్షల కోట్లు మాత్రమే. గత ప్రభుత్వం  చేసిన అప్పుతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ మీరు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవం. అప్పు పెరుగుదల ని పోల్చి చూస్తే, గత ప్రభుత్వ హయాం లో 2014 -19 లో కేంద్ర ప్రభుత్వ CAGR 9.89% పెరిగినప్పుడు, మన రాష్ట్ర CAGR 16.80% పెరిగింది. అదే జగన్  ప్రభుత్వ హయాం లో  కేంద్ర ప్రభుత్వ CAGR 14.37% పెరిగినప్పటికీ మన రాష్ట్ర CAGR 13.28% మాత్రమే పెరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు నెమ్మదిగా పెరిగింది (SLOWER PACE) తప్ప మీరు చెప్పినట్టు కాదు. మీరు చేసినంత అసలే లేదు. పైగా మా ప్రభుత్వం చేసింది కూడా కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కుంటూ సంక్షేమ పథకాలు ఏవీ ఆపకుండా ఉండడానికే . రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ, అప్పులు,వడ్డీ,జీడీపీ, జీఎస్టీ ఇలా అన్నింటిలో వాస్తవాలు వేరు. యనమలగారు చెప్పే లెక్కలు వేరు. ప్రతికా ప్రకటనల్లో రాయించే ప్రతి అక్షరం ఓ అబద్ధం.   అప్పులు, వడ్డీలు, జీఎస్‌డీపీ లెక్కలపై సరైన అవగాహన లేకుండా ప్రభుత్వ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా కల్పిత తప్పుడు లెక్కలతో పత్రికా ప్రకటన విడుదల చేశారనడానికి పైన పేర్కొన్న వాస్తవ గణాంకాలే ఉదాహరణ.

నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO), మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (MoSPI) డిసెంబర్ 2022న  2012లో ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI)ని విడుదల చేసింది.
MOSPI ప్రచురించిన ద్రవ్యోల్బణ రేట్లను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రం 7.81%తో భారతదేశంలో అత్యధిక ద్రవ్యోల్బణ రేటును కలిగి ఉంది, తర్వాత మధ్యప్రదేశ్: 6.96, ఉత్తరప్రదేశ్: 6.76, హర్యానా: 6.67 మరియు పంజాబ్ 6.60.కానీ,  ఆంధ్రప్రదేశ్‌ ద్రవ్యోల్బణం దేశంలోనే మొదటిదని మీరు నిరూపిస్తానంటే బహిరంగ చర్చకు సిద్ధమే. నగదు నిర్వహణ, అధిక వడ్డీలు, ష్యూరిటీ లేకుండా ఇష్టమొచ్చినట్లు చేసిన అప్పులు, గుదిబండలా వదిలేసిపోయిన బకాయిలు, అంచనాలు, ఖర్చుపెట్టిన మొత్తాలు,మీ పాలనలో ఉద్యోగులకు జీతాలిచ్చిన తీరు, టీడీపీ హయాంలో నెలల తరబడి జీతాలివ్వక చిన్న ఉద్యోగులను టార్చర్ పెట్టిన అంశాలపై చర్చ పెడతామంటే చర్చించడానికి మేం సిద్ధమే. జన్మభూమి కమిటీల అరాచకాలు, భూముల కుంభకోణాలు, ఫైబర్ నెట్ స్కాం, స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణం వీటిపైనా కూడా చర్చిద్దాం రండి. టీడీపీ లెక్కలు, అప్పులు, ఆర్భాటపు ఆస్తుల ప్రకటనలు, మాగొప్పగా విడుదల చేసిన శ్వేత పత్రాలు..గత ప్రభుత్వంలో ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించినట్లు గారడీలు, బురిడీలు అందరూ అంతా చూశారు యనమలగారూ. మీరు అంచనాలను నిజాలుగా చెప్పడం, అంచనాలు తప్పినపుడు అసత్య ప్రచారం చేయడం మీకే చెల్లు. రెండు నాల్కలు, వక్రమార్గాల్లో మిమ్మల్ని మించిన వారు లేరు.

నీతిఆయోగ్, భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో ప్రకటించిన ఎస్డీజీ ఇండెక్స్ ప్రకారం, ఈ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్   72 స్కోరుతో 4వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం మూడేళ్లలో తన స్కోర్‌ను నిరంతరం మెరుగుపరుచుకుంటూ సత్తా చాటుతోంది. 2018-19లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్కోర్ 64 నుండి 2020-21లో ఆ స్కోరు 72కి మెరుగుపడడం ఏపీ ప్రభుత్వ విధానాలకు ప్రతిబింబంగా నిలిచింది. పైగా  ప్రతిసారి ఈ స్కోరులో భారతదేశ సగటు స్కోరు కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా ఉందని గమనించండి . కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు ఇకనైనా కళ్లు తెరచి చూడండి.

తాజా వీడియోలు

Back to Top