సీఎం స‌ర్‌.. ఏపీని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు

బీటెక్‌ స్టూడెంట్ ప్రగతి జైశ్వాల్ 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని ఎడ్యుకేష‌న్ హ‌బ్‌గా తీర్చిదిద్దుతున్నార‌ని తిరుప‌తికి చెందిన బీటెక్ విద్యార్థిని ప్ర‌గ‌తి జైశ్వాల్ కొనియాడారు. శుక్ర‌వారం తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం చేసుకుంది. 
ఈ సందర్భంగా జరిగిన వర్చువల్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన విద్యార్ధులు ఏమన్నారంటే...వారి మాటల్లోనే

ప్రగతి జైశ్వాల్, బీటెక్‌ స్టూడెంట్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి

సార్, అందరికీ నమస్కారం, నాకు మీతో మాట్లాడే అవకాశం రావడం చాలా గొప్పగా భావిస్తున్నాను. ఏపీలో అనేకమంది విద్యార్ధులు నాలాగా నాణ్యమైన విద్యను పొందాలనే ఆశయంతో ఉన్నారు. అనేక మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్ధులు వారికి ఉన్న పరిమితమైన వనరులతో ఉన్నత చదువులు ఎలా చదవాలన్న సందిగ్ధంలో ఉన్న సమయంలో మీరు ప్రవేశపెట్టిన అనేక పథకాలు మా విద్యార్ధి లోకానికి, వారి కుటుంబాలకు చాలా ఉపయోగపడ్డాయి. మీ విజనరీ లీడర్‌షిప్‌ వల్ల ఇదంతా సాధ్యమైంది. అంతర్జాతీయ యూనివర్శిటీలలో చదువుకునే అవకాశం ఆషామాషీ కాదు, కానీ మీరు సాధ్యం చేశారు. రూ. కోటికి పైగా ఫీజును మీరు చెల్లిస్తున్నారు, ఈ ఎడెక్స్‌ వంటి కోర్సులలో సుమారు 1800 కోర్సులు అందిస్తున్నారు, అదీ ఉచితంగా ఇంటర్నేషనల్‌ యూనివర్శిటీల సిలబస్‌తో ఇస్తున్నారు. నేను ఎడెక్స్‌ కోర్సు నేర్చుకున్నాను, ఇంటర్నేషనల్‌ కోర్సులు నేర్చుకోవడం వల్ల మంచి ఉద్యోగావకాశాలు వస్తాయి. ఈ నూతన విద్యా విధానం ద్వారా ఏపీ విద్యార్ధులకు చాలా అవకాశాలు వస్తాయి. ఏపీని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు, విద్యారంగానికి మీరు ఇస్తున్న ప్రాధాన్యత మేం ఎప్పటికీ మరిచిపోం. మేమంతా విద్యారంగం అభివృద్దికి మా వంతు సాయం చేస్తాం. లక్షలాది మంది విద్యార్ధులు మీ వెంట ఉన్నారు. ఏపీని స్టేట్‌ ఆఫ్‌ నాలెడ్జ్, స్టేట్‌ ఆఫ్‌ ఇన్నొవేషన్, స్టేట్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దే క్రమంలో మేము తోడుగా ఉంటాం, థ్యాంక్యూ సార్‌. 

లక్షలాది మంది విద్యార్ధులకు సీఎం స్పూర్తిదాయకం: ఎ.హరిత, బీటెక్‌ విద్యార్ధిని, జేఎన్‌టీయూ, అనంతపురం

సార్, మా నాన్న చిన్న రైతు, నేను జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొందాను. నాలాగా అనేకమంది విద్యార్ధులు తల్లిదండ్రులకు భారం కాకుండా ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారంటే మీరే కారణం. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో విద్యావిధానం చాలా బావుంది. మా ఇంజినీరింగ్‌ కరిక్యులమ్‌ ఇప్పుడు చాలా బావుంది. గతంలో ఇంత అప్డేటెడ్‌ కరిక్యులమ్‌ లేదు, మా స్కిల్స్‌ పెంచుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ ఎడెక్స్‌ ఒప్పందంతో టాప్‌ యూనివర్శిటీల కోర్సులను మేం ఇక్కడి నుంచే నేర్చుకోవచ్చు. మేం గ్లోబల్‌ లెవల్‌ పోటీకి సిద్దమవుతాం, ఈ కోర్సులు నేర్చుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది, కానీ మేం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా నేర్చుకునే అవకాశం మీరు కల్పించారు. ఈ కోర్సులు నేర్చుకుని మేం మంచి ఉద్యోగావకాశాలు పొందుతాం. మీరు అంతర్జాతీయ యూనివర్శిటీలను ఏపికి తీసుకొచ్చారు, మాలాంటి లక్షలాది మంది విద్యార్ధులకు మీరు స్పూర్తిదాయకంగా ఉన్నారు, ధ్యాంక్యూ సార్‌. 

ఏపీ యువత, ప్రజలంతా మీ వెంటే జ‌గ‌న‌న్నా..: అంజలి, బీకాం విద్యార్ధిని, మేరీ స్టెల్లా కాలేజ్, విజయవాడ

అన్నా, మీరు విద్యా వ్యవస్ధలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సులు ప్రవేశపెట్టారు, లైఫ్‌ స్కిల్‌ కోర్సులు కూడా మాకు నేర్పుతున్నారు. విద్యారంగాన్ని చాలా అభివృద్ది చేశారు, కమ్యూనిటీ సర్వీస్‌ ప్రాజెక్ట్‌ ద్వారా నేను చాలా నేర్చుకున్నాను. బీటెక్‌ విద్యార్ధులతో సమానంగా అండర్‌ గ్రాడ్యుయేషన్‌ వారికి ఇంటర్న్‌షిప్‌ ప్రవేశపెట్టారు. ఇది చాలా ఉపయోగంగా ఉంది. మాకు మార్కెట్‌లో వాల్యూ క్రియేట్‌ చేశారు, నేను ఇంటర్న్‌షిప్‌ ద్వారా ఆపర్చునిటీ పొందాను, వర్క్‌ ఎన్విరాన్‌మెంట్, వర్క్‌ కల్చర్‌ నేర్చుకున్నాను, నేను ఇంటర్న్‌షిప్‌లో నెలకు రూ. 8000 స్టైఫండ్‌ పొందుతున్నాను. నేను సింగిల్‌ పేరెంట్‌ చైల్డ్‌ను, మా అమ్మకు నేను తోడుగా ఉంటున్నాను, ఈ ఎడెక్స్‌ కోర్సులు మీ వల్ల మాత్రమే సాధ్యమైంది, కామర్స్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లో మేం మంచి కోర్సులు నేర్చుకునే అవకాశం మీరు కల్పించారు. మేం భవిష్యత్‌లో మంచి స్ధాయికి ఎదిగేలా మీరు అవకాశం కల్పించారు. మీ విజనరీ లీడర్‌షిప్, డెడికేషన్‌కు ఇది గొప్ప ఉదాహరణ, మా ఏపీ యువత, ప్రజలంతా మీ వెంటే ఉంటారన్నా...

Back to Top