విజయవాడ: డా. బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహావిష్కరణ మహాశిల్పాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ ఈ విగ్రహం దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అని చెప్పడానికి గర్వపడుతున్నాను. 81 అడుగుల వేదిక ఏర్పాటు చేసి, దాని మీద 125 అడుగుల మహా విగ్రహం. అంటే 206 అడుగుల ఎత్తయిన ఈ విగ్రహం.. దేశంతో కాదు మనం పోటీ పడేది ప్రపంచంతోనే పోటీ పడుతున్నామని తెలియజేస్తున్నాను. విగ్రహం ప్రత్యేకతలు 18.18 ఎకరాల్లో.. రూ.404.35 కోట్లతో ► రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 18.18 ఎకరాల్లో దాదాపు రూ.404.35 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్‌ను రూపొందించారు. ఎంఎస్ అసోసియేట్ సంస్థ డిజైన్లు రూపొందించింది. అంబేడ్కర్ విగ్రహం పనుల కోసం రూపొందించిన ప్రాజెక్టు పనులకు దేశీయ మెటీరియల్‌నే ఉపయోగించారు. ►ప్రత్యేకంగా అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటేన్లు, చిన్నపిల్లలు ఆడుకోవటానికి, వాకింగ్ చేసుకోవటానికి వీలుగా తీర్చిదిద్దారు. పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో.. 539 పిల్లర్లతో నిర్మించారు. ముందుభాగం కారిడార్‌ను 166 పిల్లర్లతో రూపొందించారు. దీనిని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్‌వర్క్ ఏర్పాటుచేశారు. విగ్రహం బేస్ కింది భాగంలో.. ► గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్‌లు ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లో నాలుగు హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన మూడు హాళ్లు ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఉంటాయి. ► ఫస్ట్ ఫ్లోర్‌లో 2,250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన నాలుగు హాళ్లుంటాయి. ఒక హాల్లో అంబేడ్కర్‌కు దక్షిణ భారతదే«శంతో ఉన్న అనుబంధాన్ని డిస్‌ప్లే చేస్తారు. రెండు హాళ్లలో మ్యూజియం, ఒక హాల్‌లో లైబ్రరీ ఉంటాయి. ► ఇక సెకండ్ ఫ్లోర్‌లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్‌లు ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. ► అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులు చేపట్టి స్మృతివనం ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ► అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే (డిజిటల్) మ్యూజియంను 75 మంది సీటింగ్ కెపాసిటీతో అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించారు. ► ఇది ప్రపంచంలోనే అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియం కావడం విశేషం. ► మినీ థియేటర్లు, ఫుడ్‌కోర్టు, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్ ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ 6,340 చదరపు అడుగుల విస్తీర్ణంలో, 2,000 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్‌కోర్టు 8,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ► బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్ ఫౌంటేన్, ముందుభాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టం ఉన్నాయి. ఇవన్నీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో కూడి ఉంటాయి. కాలచక్ర మహా మండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేడ్కర పీఠం (పెడస్టల్)ను రూపొందించారు. ► విగ్రహ పీఠం లోపల జి ప్లస్ 2 అంతస్తులను ఐసోసెల్స్ ట్రాపేజియం ఆకారంలో ఆర్సీసీ ఫ్రేమ్డ్ నిర్మాణం చేశారు. రాజస్థాన్‌కు చెందిన పింక్ రాక్‌ను ఉపయోగించారు. ► అంబేడ్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటుచేస్తున్నారు. అంబేడ్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతుంది. ► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే, ఆయనే సమాధానం ఇచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టం ఏర్పాటుచేస్తున్నారు. èవిగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. ► స్థానిక కూలీలతో పాటు, ఢిల్లీ, బిహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన 500–600ల మంది కూలీలు రెండేళ్లపాటు మూడు షిఫ్ట్‌ల్లో పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు.