ఎన్‌ఐఏకు ఇస్తే చంద్రబాబుకు భ‌య‌మెందుకు

బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌ :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)కు బదిలీ చేయడంతో సీఎం చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారయణ వ్యాఖ్యానించారు.  ఈ హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు ఇస్తే చంద్రబాబుకు ఎందుకు భయమని ప్రశ్నించారు. చంద్రబాబు జీవితమంతా హత్యా రాజకీయాలేనని దుయ్యబట్టారు.

శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయ‌న  మీడియాతో మాట్లాడుతూ.. వైయ‌స్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. భయంతోనే చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారన్నారు. ఎన్‌ఐఏ విచారణ చేయాలని కోర్టే తీర్పు ఇచ్చిందని, ఏపీ పోలీసుల నివేదికలో కూడా వైయ‌స్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిందని స్పష్టంగా ఉందన్నారు.

ప్రతిపక్షనేతపై జరిగిన హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏ విచారణ చేపట్టడంపై ఏపీ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. దాడి కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం సరికాదనీ, ఎన్‌ఐఏ విచారణను రీకాల్‌ చెయ్యాలని కోరారు.  

Back to Top