మాజీ సీఎం అయినా సామాన్యుడైనా ఒకటే

రాష్ట్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ 
 

విజయనగరం: అక్రమ కట్టడాలు నిర్మించిన ప్రతీ ఒక్కరికి నోటీసులు ఇస్తామని, అది మాజీ సీఎం అయినా సామాన్యుడైనా ఒకటేనని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. తాము ఎవరిపైనా రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడటం లేదని తేల్చి చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం సీఆర్డీఏ పరిధిలో లేదని చెప్పడానికి యనమల రామకృష్ణుడు ఎవరంటూ  సూటిగా ప్రశ్నించారు. కృష్ణానది కరకట్టపై నిర్మించిన లింగమనేని ఎస్టేట్ అక‍్రమ నిర్మాణం అంటూ సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింద‌న్నారు.  యనమల చెప్పేదేమైనా..భగవద్గీతా..? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్ అక్రమంగా కట్టారని, అందుకే నోటీసులు ఇచ్చామని పేర్కొన్నారు. 

 గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఒప్పందాలన్నీ లోకేష్, చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగాయంటూ బొత్స ఎద్దేవా చేశారు. చంద్రబాబు విద్యుత్ కోనుగోళ్ల ఎంఓయూలతో రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి హయాంలో విద్యుత్ రేట్లు ఒక్క పైసా కూడా పెంచలేదని గుర్తు చేశారు. బాబు హయాంలో ఎప్పుడూ దోచేద్దామా అన్నట్టుగా పాలన చేశారంటూ గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు. విద్యుత్‌ రేట్లు పెంచిన బాబు ఐదేళ్లలో ఎంత విద్యుత్ ఉత్పత్తిని  పెంచారో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఎవరెంత గగ్గోలు పెట్టినా ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష, ద్వేషం లేదని, అక్రమాలకు తావు లేకుండా సుపరిపాలన సిద్ధించడం కోసమే చర్యలు తీసుకుంటున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top