విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై తమ ప్రభుత్వ వైఖరి ఏంటో, విధానమేంటో ప్రజలకు, కార్మికులకు స్పష్టం చేయాలని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగనీయబోమని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, ఇప్పుడు ప్లాంట్‌కు సంబంధించి వేగంగా జరుగుతున్న పరిణామాలకు సమాధానం చెప్పాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించడం, పండుగ బోనస్ ఇవ్వక పోవడం, బలవంతపు వీఆర్‌ఎస్ అమలు చేస్తుండటం, బ్లాస్ట్ ఫర్నేస్‌లు వరుసగా మూసి వేస్తుండటం వంటి పరిణామాలు చూస్తుంటే.. ఉక్కు పరిశ్రమ భవిష్యత్తుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. శనివారం విశాఖపట్నంలో మాజీ మంత్రి అమర్నాథ్‌తో కలిసి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారా? కేంద్రం చేస్తున్న ప్రైవేటీకరణను సమర్థిస్తున్నారా? సెయిల్‌లో విలీనం చేస్తారా?. అసలు ఏం చేయబోతున్నారు? వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని మండలి విపక్షనేత డిమాండ్ చేశారు. ప్రజలను మభ్యే పెట్టేలా, ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో చెలగాటం ఆడుతూ రాజకీయాలు చేయొద్దని, ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అనుసరిస్తే ఈ ప్రాంత ప్రజలు ఉపేక్షించబోరని హెచ్చరించారు. విశాక స్టీల్ ప్లాంట్ విషయంలో రాజకీయాలు చేసే ఉద్దేశం తమకు లేదన్న బొత్స.. ‘ఆంధ్రుల హక్కు–విశాఖ ఉక్కు’ అనే నినాదంతో ఉన్న సెంటిమెంట్‌కు భంగం కలిగించే పనిలో భాగం కావొద్దని సూచించారు. జగన్‌గారు సీఎంగా ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్‌లో కార్మికుల తొలగింపు, ఫర్నేస్‌ల మూసివేత, వీఆర్‌ఎస్ ఇవ్వడం వంటివి చోటు చేసుకోలేదని గుర్తు చేశారు. నాడు కేంద్ర ప్రభుత్వ కూటమిలో లేకపోయినా, స్టీల్ ప్లాంట్‌ను పరిరక్షించాలని కేంద్రాన్ని కోరామన్న ఆయన, అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వం బీజేపీని డిమాండ్ చేసే స్థాయిలో ఉందని గుర్తు చేశారు. పాల సేకరణ ధర ఎందుకు తగ్గింది?: విశాఖ డెయిరీ చరిత్రలో రైతుల నుంచి సేకరించే పాల ధరలు పెంచడమే కానీ, ఏనాడూ తగ్గించడం లేదని మండలి విపక్షనేత గుర్తు చేశారు. అలాంటిది ఇప్పుడు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారని నిలదీశారు. విశాఖ డెయిరీ పాల సేకరణ ధర తగ్గిస్తే, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి అమూల్‌ను తీసుకురావడంతో, పాల సేకరణ దర లీటరుకు రూ.5 నుంచి రూ.7 వరకు పెరిగిందే తప్ప, ఆనాడు ధర తగ్గించలేదని తెలిపారు. పాడి రైతుల సమస్యల పరిష్కారం, రైతుల ప్రయోజనాలు తమకు ముఖ్యమని, అందుకే విశాఖ డెయిరీ పాల సేకరణ ధర తగ్గించడంపై విచారణ చేయాలని బొత్స డిమాండ్ చేశారు. ఉచిత ఇసుకపై స్పష్టత ఇవ్వండి: రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన ఉచిత ఇసుక వి«ధి విధానాలపై స్పష్టత ఇవ్వాలని, లారీ ఇసుక రూ.9 వేలకు ఎప్పుడిచ్చేది చెప్పాలని మండలి విపక్షనేత కోరారు. ఉచిత ఇసుకపై వరస జీఓలతో ప్రభుత్వం గందరగోళం సృష్టించిందన్న ఆయన, దాన్ని మాత్రం సక్రమంగా అమలు చేయడం లేదని ఆక్షేపించారు. తమ ప్రభుత్వ హయాంలో టన్ను ఇసుకకు రూ.370 సినరేజీ, రూ.5 జీఎస్టీ, రూ.100 హ్యాండ్లింగ్ ఛార్జ్.. అన్నీ కలిపి టన్ను ఇసుకకు రూ.475 చెల్లించి తీసుకుపోయే వీలు కల్పించిందని తెలిపారు. ఆ లెక్కన 10 టన్నుల లారీ ఇసుకకు రూ.4750 చెల్లించేవారని చెప్పారు. అదే ఇప్పుడు ఇసుక ఉచితం అని చెప్పినా, రూ.9 వేలకు లారీ ఇసుక లభించాల్సి ఉండగా, ఎక్కడా ఆ ధరకు దొరకడం లేదని తెలిపారు. అందుకే ఇప్పటికైనా ఉచిత ఇసుకను పకడ్బందీగా ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని కోరారు. రాష్ట్రంలో యథేచ్ఛగా మహిళలు, చిన్నారులపై దాడులు జరుగుతున్నా, శాంతి భద్రతలు కాపాడడం లేదని మండలి విపక్షనేత ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరు తప్పు చేసినా చట్టపరంగా తగిన చర్య తీసుకోవాల్సి ఉన్నా, అధికార పార్టీ అయితే ఒకలా, విపక్షం అయితే మరోలా పోలీసులు వ్యవహరిస్తున్నారని, ఇది ఏ మాత్రం సరికాదని బొత్స తేల్చి చెప్పారు.