తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచ రాజకీయాలు చేసిన సీఎం చంద్రబాబుకు సుప్రీం కోర్టు వ్యాఖ్యలు చెంపపెట్టు అని వైయస్ఆర్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి పదవి ఉందని పెదవి జారి అబద్ధాలను నిజం చేయాలని చూస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చంద్రబాబూ అని హెచ్చరించారు. భూమన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై బురద జల్లేందుకు శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు కోట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతీశారని అన్నారు. చంద్రబాబు స్వార్థ, కుటిల, కుతంత్ర రాజకీయాలతో మహా ప్రసాదానికి మలినం అంటించాలని చూస్తే దేవదేవుడు చూస్తూ ఊరుకోరని చెప్పారు. సాక్షాత్తు శ్రీవారే సుప్రీం కోర్టు ధర్మాసనంతో చంద్రబాబుకు చెంప పెట్టులాంటి మాటలు పలికించారని అన్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పిన మాటలకు భిన్నంగా చంద్రబాబు నెయ్యిలో జంతువుల కొవ్వు వాడినట్లు ఎలా చెబుతారని ప్రశ్నించారు. సత్యాన్ని అసత్యంగా మార్చాలన్నదే చంద్రబాబు దురాలోచన అని మండిపడ్డారు. చంద్రబాబు సిట్ అంటే కూర్చునే అధికారులను సిట్‌లో నియమించి విచారణ జరిపిస్తే ఆ రిపోర్ట్ ఎలా ఉంటుందో అందరికి తెలుసునన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలపలేదు కాబట్టే తాము సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని కోరామని చెప్పారు. ప్రసాదంలో కల్తీ చేసి ఉంటే తాము సర్వనాశనం అయిపోవాలని, రక్తం కక్కుకుని చనిపోవాలని శ్రీవారి సన్నిధిలోని కోనేటిలో స్నానమాచరించి, అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి వేడుకొన్నామన్నారు. తప్పు చేసి ఉంటే నిజంగా ఆ దేవదేవుడు తమకు శిక్ష విధించేవారని అన్నారు. నిజంగా తాము తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. నిజం ఎప్పటికైనా గెలుస్తుందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయిశ్చిత్త దీక్షలు చేపట్టి దుర్గమ్మ ఆలయాన్ని శుద్ధి చేశారని, పాపాలు చేసిన వారే ప్రాయిశ్చిత్తం చేసుకుంటారని ఎద్దేవా చేశారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై నీచ రాజకీయాలు చేసిన చంద్రబాబు, పవన్‌ను, వారికి వంతపాడుతున్న ఎల్లో మీడియాను ప్రపంచ వ్యాప్తంగా హిందువులంతా ఛీకొడుతున్నారని చెప్పారు.