బీసీ కుల గణనపై అధ్యయనానికి కమిటీ

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి
  
 మిగతా రాష్ట్రాలకంటే ముందుగానే ఏపీలో కుల గణన చేపడదామని సీఎం వైయ‌స్‌ జగన్  చెప్పారు
 
బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

తాడేప‌ల్లి: బీసీ కుల గణనపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశించిన‌ట్లు బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహాత్మా జ్యోతీరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
 
    ఈ సందర్భంగా బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి  చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే ఆదర్శాలు మనందరికీ ఆచరణీయమని అన్నారు. ఆయన అడుగు జాడల్లో మన నాయకుడు  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు నడుస్తూ పూలే  వారసుడిగా నిలిచారన్నారు. రాష్ట్రంలోని 139 బీసీ  కులాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడం కోసం బీసీ గణన చేపట్టాలని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి వేణు చెప్పారు. దీని కోసం కులగణన చేపడుతున్న ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి అధ్యయనం చేసేందుకు ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని, పూలే జయంతి సందర్భంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మంత్రి వేణు చెప్పారు. దేశంలోనే అందరి కంటే ముందుగా మన రాష్ట్రంలోనే కులగణన చేపట్టాలని సిఎం గారు ఆదేశించినట్లు మంత్రి వేణు వివరించారు. 

సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం: మంత్రి జోగి రమేష్
    గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రి భాయ్‌ పూలేలు బీసీల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. వారి ఆశయాలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్న రాష్ట్రం వైయ‌స్ జగన్‌ గారి నాయకత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారేనని, దేశంలోని ఏ రాష్ట్రంలో ఇలాంటి సామాజిక న్యాయం చేయలేదన్నారు  మనల్ని చూసి మిగిలిన రాష్ట్రాలు కూడా బీసీల అభ్యున్నతికి తీసుకుంటున్న చర్యలపై అధ్యయనం చేస్తున్నాయన్నారు. బీసీలకు ఏ ఒక్క మేలూ చేయని చంద్రబాబు కూడా బీసీలపై చర్చకు సిద్ధమా అంటున్నాడు. బీసీలంతా గళమెత్తి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యమని జోగి రమేష్‌ స్పష్టం చేశారు. 
    
    ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన వారిలో రాష్ట్ర మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ,  జోగి రమేష్,  మేరుగ నాగార్జున, ఎంపీలు మార్గాని భరత్, నందిగం సురేష్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,  జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి,  మొండితోక అరుణ్‌ కుమార్,  పోతుల సునీత, ఎమ్మెల్యే  కైలే అనిల్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, అగ్రికల్చరల్‌ మార్కెంటింగ్‌ సలహాదారు  బత్తుల బ్రహ్మానందరెడ్డి, విజయవాడ సిటీ పార్టీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు నారాయణ మూర్తి,  నారమల్లి పద్మజ, పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

Back to Top