బాపూజీ కలలను సీఎం వైయస్‌ జగన్‌ నెరవేర్చారు

సచివాలయ వ్యవస్థతో పరిపాలన గుమ్మం ముంగిటికి

వైయస్‌ఆర్‌ స్ఫూర్తితో పరిపాలన సాగుతోంది

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజయవాడ: మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారని మన్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పరిపాలన గుమ్మం ముంగిటికి తీసుకెళ్లాలని నూతన ఒరవడిని సృష్టించారన్నారు. విజయవాడ ఏప్లస్‌ కన్వెన్షన్‌లో జరిగిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు నియామకపత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. సచివాలయ ఉద్యోగుల జీవితాల్లో ఇది మరుపురాని రోజు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు, ప్రజలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి వారి ఆవేదనను, అభిప్రాయాలను చెప్పుకున్నారు. ఆ తరువాత వ్యవస్థలను ప్రక్షాళన చేయాలనే ఆలోచన చేసి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో సీఎంగా వైయస్‌ జగన్‌.. పాలన నాలుగు నెలలు పూర్తిగా నిండకుండానే 4.10 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కాకుండా, దాంట్లో శాశ్వతంగా 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగులకు ఉపాధి కల్పించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన నవరత్నాలనే కాకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారన్నారు. 
  
ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేస్తున్నా చెక్కుచెదరకుండా సీఎం వైయస్‌ జగన్‌ ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లపై ఇంత పెద్ద బాధ్యతను పెట్టినప్పుడు మీరు సక్రమంగా నిర్వర్తిస్తేనే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచిపేరు వస్తుందని ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు.  గోనె సంచులు మోసుకునే ఉద్యోగాలు ఇచ్చారని అవమానించే రీతిలో మాట్లాడారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏవిధంగా చులకన భావంతో మాట్లాడుతున్నారో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ చేతుల మీదుగా తీసుకుంటున్న నియామకపత్రం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జీవితాలకు తొలిమెట్టు అని అన్నారు. 
 

Back to Top