ఒంగోలు టౌన్‌లో రావాలి జగన్‌–కావాలి జగన్ 

న‌వ‌ర‌త్నాల‌పై విస్తృత ప్ర‌చారం
 
వైయ‌స్ఆర్‌సీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని  

ఒంగోలు : ఎన్నికల్లో ప్రజల్ని మరో సారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి,  వైయ‌స్ఆర్‌సీపీ ఒంగోలు పార్లమెంట్‌ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. ప‌ట్ట‌ణంలోని 13వ డివిజన్‌లో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమంలో ఆయన  పాల్గొన్నారు. డివిజన్‌ అధ్యక్షుడు ఎం.రాజేష్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పంది రత్నరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నగర అధ్యక్షుడు శింగరాజు వెంకట్రావు అధ్యక్షత వహించారు. బాలినేని మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో మరోసారి జనాలను మోసం చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నాలు ప్రారంభించాడన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంత వరకు అమలు చేయలేదన్నారు. తీరా ఎన్నికలు రాగానే నానా రకాల ప్రలోభాలకు తెరలేపారన్నారు. కొత్తగా ప్రజలపై హామీలను ఇవ్వడానికి నిసిగ్గుగా వ్యవహరిస్తున్నారన్నారు. 

కాపులను మోసగిస్తున్న బాబు..
కాపులను బీసీల్లో చేరుస్తానని గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇంత వరకు నెరవేర్చకుండానే మరో సారి 5 శాతం రిజర్వేషన్‌ పేరుతో దగా చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్రం ఆర్థికంగా వెనుకబాటులో ఉన్న వివిధ కులాల్లోని వారిని ఆదుకునేందుకు 10 శాతం రిజర్వేషన్‌ ప్రకటిస్తే   సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా కాపుల ఓట్లను కొల్లగొట్టేందుకు 5 శాతం రిజర్వేషన్‌ ఇస్తామని మోసం చేస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో బీసీల్లోని వివిధ కులాలకు ఇచ్చిన హామీలనే ఇంత వరకు నెరవేర్చలేదన్నారు. తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు ఒంగోలులోని బీసీలకు ఆరామక్షేత్రాలు, వారి కమ్యూనిటీ అవసరాలకు లబ్ధి చేకూర్చామన్నారు. 

మంజునాథ కమిషన్‌ రిపోర్టు ఇవ్వలేదు
కాపులను బీసీల్లో చేర్చడానికి మంజునాథ కమిషన్‌ ఇంత వరకు నివేదిక ఇవ్వలేదన్నారు. నివేదిక రాకుండానే కాపులకు రిజర్వేషన్‌ ఇస్తామని చెప్పడం మోసం కాదా అని ప్రశ్నించారు. న్యాయపరమైన చిక్కులు, ఇబ్బందుల గురించి తెలిసినా ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.  పొత్తుల విషయంలో చంద్రబాబు ఎవ్వరితోనైనా నిసిగ్గుగా ముందుకు వస్తారని ధ్వజమెత్తారు.  

అవినీతికి అడ్డాగా..
రాష్ట్రాన్ని అవినీతి అడ్డాగా మార్చేశారని చంద్రబాబును బాలినేని విమర్శించారు. ప్రతి టెండర్‌లోనూ రూ. కోట్లు కొల్లగొట్టారన్నారు. ఈ ఎన్నికల్లో అవినీతి సొమ్మును ఎగజల్లేందుకు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి తనకు అనుకూలంగా మలుచుకున్నారన్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారన్నారు. తెలుగుదేశం మునిగిపోయే పడవ లాంటిదని, అందులో ప్రయాణించే వారికి ప్రమాదం తప్పదన్నారు. జగన్‌పై హత్యాయత్నం కుట్ర వెనుక ఉన్న  ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఎన్‌ఐఏ విచారణలో బయట పడుతుందన్నారు. కార్యక్రమంలో  వైయ‌స్ఆర్‌సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, దామరాజు క్రాంతికుమార్, చిన్నపరెడ్డి, కోడూరి కిషోర్, యనమల నాగరాజు, నల్లమల్లి బాలు, జలీల్, దేవరపల్లి అంజిరెడ్డి,ఐ.వి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Back to Top