వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో వైయస్సార్‌సీపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 259 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. తొలి రౌండ్‌లో వైయస్సార్‌సీపీ ఆధిక్యంలో కొనసాంది. ప్రస్తుతం బద్వేల్‌లో మూడో రౌండ్ ముగిసింది. 23,754 ఓట్ల ఆధిక్యంలో వైయస్ఆర్‌సీపీ కొనసాగుతోంది. పట్టణంలోని గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లుచేశారు. కోవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇందుకోసం నాలుగు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎన్నికల కమిషన్ జారీచేసిన కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటుచేశారు. ప్రతి కేంద్రంలో ఆర్వో, ఏఆర్వోలకు ఒక టేబుల్ ఏర్పాటుచేశారు. ఆర్వో ఉన్న కౌంటింగ్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ర్యాండమ్ చెకింగ్ కోసం ఒక వీవీ ప్యాట్ కేంద్రం ఏర్పాటుచేశారు. ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. గరిష్టంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. ఇప్పటివరకు సర్వీసు ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన, దివ్యాంగుల ఓట్లు మొత్తం 235 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. ఓట్లు లెక్కించే సమయానికి సర్వీసు ఓటర్ల ఓట్లు అందితే వాటిని కూడా కలిపి లెక్కిస్తారు. నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68.39 శాతం పోలింగ్ నమోదైంది. లెక్కింపు నేపథ్యంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. అలాగే, లెక్కింపు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాజంపేట సబ్‌కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ మీడియాకు తెలిపారు. తెలంగాణలోని హూజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం కూడా మంగళవారం వెలువడనుంది. ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా మరో 27 శాసనసభ, మూడు లోక్‌సభ స్థానాలకూ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందులో దాద్రానగర్ హవేలీ, మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా, హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 30న ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే.