చంద్రబాబుది దివాళా కోరు ప్రభుత్వం

అధికారం తప్ప ప్రజల గురించి ఆలోచనే లేదు

అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేసేందుకు కుట్ర

బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం

విజయవాడలో వైయస్‌ఆర్‌ సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ మహాధర్నా

హైదరాబాద్ : అధికారం, ఓట్లు, సీట్లు తప్ప ప్రజల గురించి ఆలోచించే పరిస్థితుల్లో చంద్రబాబు లేడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. దివాలాకోరు విధానంతో ప్రభుత్వం ముందుకు పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో వైయస్‌ఆర్‌ సీపీ అగ్రిగోల్డ్‌ బాధితుల బాసట కమిటీ కన్వీనర్‌ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పార్టీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకా ప్రతాప్‌ అప్పారావు, సీనియర్‌ నాయకులు పార్థసారధి, జోగి రమేష్, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్రంలో 19.52 లక్షల అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నారని, వారిని ఆదుకోవాలనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడం దురదృష్టకరమన్నారు.

చంద్రబాబు దుబారా ఖర్చు, ప్రత్యేక విమానాల్లో జల్సాలు, ఇళ్ల మరమ్మతుల కోసం వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశారన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులు పిట్టల్లా రాలిపోతున్నా.. బాధితుల గురించి ఆలోచించలేని దౌర్భాగ్య స్థితిల్లో ప్రభుత్వం ఉందన్నారు. అందుకే ప్రభుత్వంపై సమరశంఖారావం పూరిస్తూ, మరోపక్క బాధితులకు అండగా ఉండేందుకు, వారికి మనోధైర్యం కల్పించేందుకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం చేస్తుందన్నారు. 14 లక్షల మంది చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఉంటే ఆ కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 1,185 కోట్లు ఇస్తే బాధల నుంచి బయటపడతారని చెప్పినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికే 263 మంది బాధితులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మొక్కుబడిగా రూ. 10 కోట్లు ఇచ్చి ప్రభుత్వం మొసలికన్నీరు కారుస్తుందన్నారు. చంద్రబాబు, లోకేష్, వారి బినామీలు దోచుకోవడం కోసమే అగ్రిగోల్డ్‌ ఆస్తులను బయటపెట్టడం లేదన్నారు. కమిటీలని కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాడని మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు వైయస్‌ఆర్‌ సీపీ పోరాటం చేస్తుందన్నారు. 

Back to Top