తాడేపల్లి: పేదరికాన్ని పారదోలాలనే లక్ష్యంతో ఆనాడు మహనీయులు అంబేడ్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ తలపెట్టిన యజ్ఞం స్ఫూర్తి ఈ రోజు మరింత పెరిగిందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మహనీయుల దార్శనికతకు అనుగుణంగా సీఎం వైయస్ జగన్ పాలన సాగుతోందన్నారు. దీని వల్ల పేదలు, అణగారిన వర్గాల వారు ఎంతో అభ్యున్నతి సాధిస్తారని, చైతన్యవంతమైన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందుతోందన్నారు. స్వాతంత్య్రోదమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి కార్యక్రమాన్ని తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి జగ్జీవన్ రామ్ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే.. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగితే ఫలితాలు ఎలా ఉంటాయన్నది సీఎం వైయస్ జగన్ చూపుతున్నారు. అవి ఎంత ఆచరణీయం అని అందరూ తెలుసుకుంటున్నారు. ఆ మహనీయులను తల్చుకున్నప్పుడు ఒక స్ఫూర్తిని తెచ్చుకుంటున్నాం. వారు 90 ఏళ్ల క్రితమే దార్శనికత చూపారు. సమాజం ఎలా ఉంది? ఏం మారాలి? అన్నది ఆలోచించి స్పష్టమైన దిశా నిర్దేశం చేశారు. ఇవాళ సీఎం వైయస్ జగన్ చేస్తున్న కృషి.. దళితులు, మైనారిటీలు, వెనకబడిన వర్గాల శ్రేయస్సు, అభ్యున్నతి పనులను 70 ఏళ్ల క్రితమే నాటి పాలకులు మొదలు పెట్టి ఉంటే, ఎంతో మార్పు వచ్చి ఉండేది. నాడు మహనీయులు చెప్పిన మాటలు, లేవనెత్తిన అంశాలు, ఇవాళ కూడా సమాజంలో కనిపిస్తున్నాయి. పాలకవర్గాలు చాలా వాటిని తమ నియంత్రణలో పెట్టుకుంటున్నాయి. భావ ప్రకటన, స్వేచ్ఛ చాలా కాలం లేకుండా పోయింది. రిజర్వేషన్లు అమలు చేసి, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేశారు. సంకుచిత భావంతో సమాజాన్ని కులం పేరుతో విడదీసే ప్రయత్నం చేశారు. దీన్ని గుర్తించిన తర్వాత పేద వర్గాల్లో పోరాటాలు మొదలయ్యాయి. అయితే సామాజికంగా, ఆర్థికంగా వారికి చేయూతనిచ్చేందుకు ఎవరూ ప్రయత్నించలేదు. కానీ, రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టాక గత 22 నెలలుగా ఆ ప్రక్రియ కొనసాగుతోందని గర్వంగా చెప్పగలుగుతాం. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్పు, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం. ఇలాంటి చర్యల ద్వారా అత్యధిక ప్రయోజం పొందేది నిరుపేదలే. పేద వర్గాలు, దళితుల అభ్యున్నతి కోసమే సీఎం వైయస్ జగన్ పని చేస్తున్నారు. అణగారిన వర్గాలకు సమాజంలో తమ వంతు పాత్రను పోషించేలా ఆయన అవకాశం కల్పిస్తున్నారు. అందుకే ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లో చట్టం ప్రకారం ఇవ్వాల్సిన దాని కంటే చాలా ఎక్కువ మందికి పదవులు ఇచ్చారు. అదే విధంగా మహిళలకు కూడా ఆయన అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. వారికి అవకాశం ఇస్తే రాణించగలరని చూపారు. ఇవాళ తిరుపతి ఉప ఎన్నికలో కూడా అదే ఆయన చూపుతున్నారు. నామినేటెడ్ పోస్టులు కానీ, నామినేషన్ విధానంలో ఇచ్చే పనుల్లో వారికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. కేవలం ఒక కులానికే పరిమితం కాకుండా, అందరినీ గుర్తిస్తున్నారు. ఎందుకుంటే, కేవలం కులం ఆధారంగానే ఎవరూ ఎదగరు. మహనీయులు చూపిన దార్శనికతకు అనుగుణంగా సీఎం వైయస్ జగన్ ముందుకెళ్తున్నారు’ అని సజ్జల అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ కనకారావు, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి, గుంటూరు మేయర్ కె.మనోహర్‌నాయుడు, పార్టీ అధికార ప్రతినిధులు ఈదర రాజశేఖర్‌రెడ్డి, పద్మజారెడ్డి, నారాయణమూర్తి, పలువురు నాయకులు పాల్గొన్నారు.