దమ్ముంటే రఘురామకృష్ణంరాజు రాజీనామా  చేయాలి

స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణంతో తొట్లకొండకు ఎటువంటి ముప్పు లేదు

ప‌ర్యాట‌క శాఖ‌ మంత్రి అవంతి శ్రీనివాస్

 విశాఖ‌పట్నం:   ర‌ఘురామ‌కృష్ణంరాజుకు ద‌మ్ముంటే వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున గెలిచిన ఎంపీ స్థానానికి రాజీనామా చేసి మ‌ళ్లీ పోటి చేయాల‌ని ప‌ర్యాట‌క శాఖ మంత్రి అవంతి శ్రీ‌నివాస్ స‌వాల్ విసిరారు. ఉత్త‌రాంధ్ర గురించి మాట్లాడేట‌ప్పుడు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ని హెచ్చ‌రించారు. విశాఖ‌లో నిర్మిస్తున్న స్టేట్ గెస్ట్ హౌస్‌కు, తొట్లకొండకు ఎటువంటి సంబంధం లేదని, ఈ నిర్మాణం వల్ల‌ తొట్లకొండకి ఎటువంటి ముప్పు లేదని స్ప‌ష్టం చేశారు. తొట్ల కొండ‌పై చంద్రబాబుతో పాటు కొన్ని‌ పచ్చమీడియా చేస్తున్న తప్పుడు ప్రచారాలని మంత్రి ఖండించారు.  చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

విశాఖ‌పై అడుగ‌డుగునా విషం చిమ్ముతున్నారు..

ఉత్తరాంధ్ర‌, విశాఖపై అడుగడుగునా చంద్ర‌బాబు విషం చిమ్ముతున్నార‌ని మంత్రి అవంతి మండిప‌డ్డారు. చంద్ర‌బాబు‌ హయాంలో ఒక్క గెస్ట్ హౌస్ అయినా కట్టారా? అని‌ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రొటోకాల్ పేరుతో రూ. 23 కోట్లు దుర్వినియోగం చేశారని మండిప‌డ్డారు.  ప్రభుత్వ ధనం వృధాగా ఖర్చు కాకూడదనే ప్రభుత్వ గెస్ట్ హౌస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తిరుపతి, విశాఖ, విజయవాడలలో గెస్ట్ హౌస్‌ల‌ నిర్మాణానికి ప్రభుత్వం‌ ప్రతిపాదించిందని పేర్కొన్నారు. 

చంద్రబాబుకు దళితుల‌ గురించి మాడ్లాడే అర్హతే లేద‌ని మంత్రి అవంతి పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదలు వచ్చినా, ఎల్జీ పాలిమ‌ర్స్‌ ప్రమాదం జరిగినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కనిపించరని ఎద్దేవా చేశారు. మ‌రోవైపు పవన్ కల్యాణ్‌ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయ‌న‌కు అమరావతిపై ప్రేమ ఉంటే గాజువాక నుంచి ఎందుకు పోటీ చేశారని ప్ర‌శ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలి, గానీ ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకూడదా? అని నిల‌దీశారు. గాజువాక‌ ప్రజల‌ ఓట్లు వేయించుకుని విశాఖకి పరిపాలనా రాజధానిని పవన్ కళ్యాణ్ ఎలా వ్యతిరేకిస్తారన్నారు.

ఇక‌ తొట్లకొండ ఎక్కడుందో తెలియకుండా ఎలా మాట్లాడతార‌ని రఘురామకృష్ణంరాజును ప్ర‌శ్నించారు. ఉత్తరాంధ్ర గురించి‌ మాడ్లాడేటపుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని‌ మాట్లాడాలన్నారు. ఆయ‌న‌కు నిజంగా దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని సవాల్ విసిరారు. రాజుకు పలుకుబడుంటే నరసాపురం-కోటిపల్లి రైల్వేలైన్ కోసం ప్రయత్నించాలని సూచించారు. అనవసర విషయాలలో జోక్యం చేసుకోవద్దని రఘురామకృష్ణంరాజుకు అవంతి హిత‌వు ప‌లికారు

తాజా వీడియోలు

Back to Top