2024 తరువాత టీడీపీకి శాశ్వత సమాధే

అధికారం అనే మానసిక వ్యాధి బాబులో బాగా ముదిరిపోయింది

అంతచూస్తానన్న వారంతా ప్రజాజీవితంలో అంతులేకుండా పోయారు

ఎన్నికలు దగ్గరపడే నాటికి చంద్రబాబు ఇంకా నీచానికి దిగజారతాడు 

సంక్షేమం, అభివృద్ధే సీఎం వైయస్‌ జగన్‌ పాలనా నేత్రాలు

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

విశాఖ: అధికారం అనే మానసిక వ్యాధి చంద్రబాబులో బాగా ముదిరిపోయింది. అంతచూస్తానని ఛాలెంజ్‌లు చేసిన వారంతా ప్రజాజీవితంలో అంతులేకుండా పోయారు. ఎవడి అంతు చూస్తావ్‌.. ఏం చేస్తావ్‌..? అని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ధ్వజమెత్తారు. గబ్బిలాల రోజులు గతించాయని, రాజకీయంగా చంద్రబాబు, ఆయన పార్టీ అంపశయ్య మీద ఉన్నారు. ప్రజలు ఎప్పుడు ఆ వెంటిలేషన్‌ లాగేస్తారని ఎదురుచూడటం తప్ప చేసేది ఏమీ లేదు.. ఈసారి ఎన్నికలతో టీడీపీ శాశ్వత సమాధి కాబోతుంది అని అన్నారు. విశాఖలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని ఏం మాట్లాడారంటే..
‘చంద్రబాబు బాగా దిగజారి మాట్లాడుతున్నాడు. ఎన్నికలు దగ్గరపడే నాటికి ఇంకా చాలా నీచానికి దిగజారిపోతాడు. చంద్రబాబు ఎంత నీచస్థాయికి దిగజారుతాడంటే.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తిరుపతి నుంచి నాయీ బ్రాహ్మణులు వచ్చి న్యాయం చేయాలని కోరితే.. ‘ఎవడ్రా మిమ్మల్ని లోపలికి పంపించింది.. మీ తోకలు కత్తిరించేస్తా’ అని మాట్లాడాడు. 2019 ఎన్నికల్లో నాయీ బ్రహ్మణులు చంద్రబాబుకు క్షవరం చేశారు. అలాగే మత్స్యకారులను ఇష్టం వచ్చినట్టుగా వ్యాఖ్యలు చేశాడు. ఎన్నికల దగ్గరయ్యే కొద్దీ వేషం మారుస్తాడు.. నేను నాయీ బ్రాహ్మణుడినే అని కత్తెర పట్టుకొని, వారి కాళ్ల మీద పడిపోవడానికి వెనుకాడని నీచానికి దిగజారుతాడు. చంద్రబాబుకు అధికారం తప్ప మరో పరమావధి లేదు. బాబు మాట్లాడే ఏ మాటలోనైనా సరే అధికార దాహం కేకలు వేస్తుంది.

వైయస్‌ జగన్‌ పాదయాత్రలో ప్రజల నుంచి అనేక అంశాలను నేర్చుకున్నారు. రాజకీయాలకు నూతన నిర్వచనం, నూతన దృక్పథం, జవాబుదారీతనం సీఎం వైయస్‌ జగన్‌ తెచ్చారు. ఒక లక్ష్యం, ఒక గమ్యం పెట్టుకున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు మాత్రమే తన పాలనా నేత్రాలుగా చేసుకొని వైయస్‌ జగన్‌ ముందుకు వెళ్తున్న వైనం చాలా మందిని కలవరపెడుతోంది. ప్రధాని సభలో కూడా ‘నా రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. రాజకీయాలు లేవు, నా రాష్ట్ర ప్రయోజనాల తరువాతే నాకు ఏదైనా’ అని ప్రధాని సమక్షంలో తన అభిప్రాయాన్ని స్పష్టంగా కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. 

చంద్రబాబు మరీ ఇంత ఫ్రస్టేషన్‌కు దిగజారిపోవాల్సిన అవసరం ఏముంది. బాబుకు వయసు మళ్లింది కదా కొంతకాలం రెస్ట్‌ తీసుకుంటే ఇబ్బంది ఏముంది..? సీఎం వైయస్‌ జగన్‌ డైనమిక్‌గా రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నారు.  కర్నూలుకు న్యాయ రాజధాని ఇస్తే..దాన్ని వ్య‌తిరేకించిన టీడీపీ, చంద్ర‌బాబును యువకులు, విద్యార్థులు, న్యాయవాదులు, మేధావులు `చంద్రబాబు రాయలసీమ ద్రోహి, గో బ్యాక్‌` అంటే.. వాళ్ల మీద ఫ్రస్టేషన్‌ చూపిస్తున్నాడు. చెప్పు చూపించాలని ఉంది.. కానీ నాకు సంస్కారం అడ్డొచ్చిందని మాట్లాడుతున్నాడు.. ఇదెక్కడి సంస్కారం చంద్రబాబూ..?  బాబు దత్తపుత్రుడు ఏకంగా చెప్పే చూపించాడు. 

వీళ్ల అంతుచూసి వెళ్తానని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. అంతుచూస్తానని ఛాలెంజ్‌లు చేసిన వారు ప్రజాజీవితంలో అంతులేకుండా వెళ్లిపోయారు. చరిత్రపుటలు తిరగేసి చూస్తే విషయం అర్థం అవుతుంది. అధికారం అనే మానసిక వ్యాధి చంద్రబాబులో ముదిరిపోయింది. ఎవడి అంతు చూస్తావ్‌.. ఏం చేస్తావ్‌..? గబ్బిలాల రోజులు గతించాయి.. నీ పార్టీ, నువ్వు అంపశయ్య మీద ఉన్నారు. ఎప్పుడు ఆ వెంటిలేషన్‌ లాగేస్తారని ఎదురుచూడటం తప్ప చేసేది ఏమీ లేదు. ఈసారి ఎన్నికలతో టీడీపీ శాశ్వత సమాధి కాబోతుంది. చంద్రబాబు చేసేది అసమర్థుడి అంతిమయాత్ర. ఒకసారి ప్రజల విశ్వసనీయత కోల్పోతే, జవాబుదారీతనం లేకపోతే ప్రజలు నమ్మరు. 2019లో 612 వాగ్దానాలు ఇచ్చాడు.. ఒక్కటి కూడా నెరవేర్చలేదు. టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టోను కూడా తొలగించాడు. వాటి గురించి ఎందుకు మాట్లాడటం లేదు’’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. 

Back to Top