ఆకలిమంటలతో చచ్చేబదులు.. రాజధాని కోసం పోరాడిచద్దాం.. 

విశాఖకు పరిపాలన రాజధాని సాధించేవరకు ఉద్యమిద్దాం

సీఎం వైయస్‌ జగన్‌ తీసుకున్న పవిత్రమైన నిర్ణయాన్ని రక్షించుకుందాం

శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

విశాఖపట్నం: జడివానలోనూ విశాఖ గర్జన ర్యాలీ జనవాన ప్రవహించిందని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. 130 సంవత్సరాలుగా వివక్షకు గురయ్యామని, ఆకలిమంటలతో చచ్చేబదులు.. విశాఖకు పరిపాలన రాజధాని కోసం పోరాటం చేసి చద్దామని పిలుపునిచ్చారు. విశాఖ గర్జన ర్యాలీ అనంతరం నిర్వహించిన సభలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం భావోద్వేగ ప్రసంగం చేశారు. 

‘‘మన ప్రాంత వెనుకబాటు తనం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, ఆకలిమంటలు ఇవన్నీ తరాలుగా మనల్ని పట్టిపీడిస్తున్నాయి. దానికి కారణం వివక్షత. పరిపాలన పరమైన వివక్షత. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ఉద్యమాలకు పోరుగడ్డ. ఆకలికోసం, భూమికోసం, భుక్తికోసం, విముక్తి కోసం ఉద్యమాలు జరిగాయి.  మేధావులు, విజ్ఞులు, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆనాడు రాజీనామాలు చేసి ఉద్యమంలో చేరారు.. మేము వెళ్లిపోయినా భావితరాలకు న్యాయం జరగాలని పోరాటం చేశారు. ఇవన్నీ మనం గుర్తుచేసుకోవాలి. 

ప్రత్యేక రాష్ట్రం కోసం మరో ఉద్యమం రాకూడదని సీఎం వైయస్‌ జగన్‌ పవిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. మూడు ప్రాంతాలను సమగ్ర అభివృద్ధి చేయాలని, కర్నూలులో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, విశాఖకు పరిపాలన రాజధాని చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారిని నిలదీయాలి, పట్టుకొని కడిగేయాలి.  

ముఖ్యమంత్రి తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని మనం కాపాడుకోవాలి. 130 ఏళ్ల అసమర్థత తొలగి.. సమగ్రమైన అభివృద్ధి, విద్య, ఉద్యోగం, అన్ని రకాల హక్కులు సాధించుకోవడానికి గొప్ప అవకాశం కల్పించిన మహనీయుడు, మనవతావాది మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. ఆకలిమంటలతో చచ్చేబదులు రాజధాని కోసం పోరాడిచద్దాం.. మహిళలు, పురుషులు, యువత అంతా ఉద్యమంలో పాల్గొనాలి,  విశాఖ రాజధాని సాధించే వరకు ఉద్యమాన్ని రక్షించుకోవాలి. పవిత్రమైన ఆశయం, సంకల్పంతో సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని రక్షించుకుందాం’’ అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top