అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం ఆర్టీసీ జేఏసీ నేతలు కలిశారు. విలీనంపై సీఎం స్పష్టమైన హామీ ఇచ్చారని ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు.సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో జేఏసీ నేతలు తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎంతో చర్చల అనంతరం జేఏసీ నేతలు మాట్లాడుతూ విలీనంపై ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమించారు. కాగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్ ఆర్టీసీ)ను తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ పాదయాత్ర సందర్భంగా వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
విలీనంపై అధ్యయన కమిటీ
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై రాష్ట్ర సర్కారు త్వరలో అధ్యయన కమిటీని నియమించనుంది. గతంలో ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా పనిచేసి, పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. కమిటీలో కార్మిక సంఘాల నేతలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు. కమిటీ నియామకంపై రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం జీవో జారీ చేయనుంది. రెండు నెలల్లో ఈ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు ఖరారు చేస్తారు.