అర్హులంద‌రికీ ఎస్సీ కార్పొరేషన్ పథకాలు

 మంత్రి మేరుగ నాగార్జున‌

 అమరావతి: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అమలు చేయనున్న అమృత్ జలధార, యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకాలలో లబ్ది కోసం అర్హులైన ఎస్సీలు దరఖాస్తులు చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఒక ప్రకటనలో కోరారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ జలధార పథకం కింద ఎస్సీ రైతుల భూములకు నీటి వసతిని కల్పించేందుకు బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా ఇప్పటికే రుణాలు మంజూరైన రైతులకు బోరు బావులు, స్పింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవడానికి రూ.50 వేలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.

 
రైతులు రెండున్నర ఎకరాల భూమి, రూ.3 లక్షలకు లోపు వార్షిక ఆదాయం కలిగిన రైతులు అమృత్ జలధార పథకంలో లబ్ది పొందేందుకు అర్హులని తెలిపారు. అలాగే యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకంలో భాగంగా ట్రాక్టర్లు, ట్రాలీలు, కమర్షియల్ వాహనాలు, వేర్ హౌసెస్ తదితర స్వయం ఉపాధి పథకాలకు ఇప్పటికే బ్యాంకులు, ఇతర సంస్థల ద్వారా రుణాలు మంజూరైన ఎస్సీ యువతకు రూ.60 వేలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుందని వెల్లడించారు.

అమృత్ జలధార పథకం కోసమైతే పట్టాదారు పాసు పుస్తకాలు, రవాణాకు సంబంధించిన యంగ్ ఎంటర్ ప్రెన్యూర్ పథకం కోసమైతే వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటుగా ఆదాయ, కుల, విద్యా ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డ్, ఆధార్, బ్యాంక్ పాసుపుస్తకాల నకళ్లతో దరఖాస్తులు చేసుకోవాలని నాగార్జున వివరించారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆయా జిల్లాలకు చెందిన ఎస్సీ కార్పొరేషన్ ఇ.డి.లకు తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. ఈ పథకాల మంజూరు లో పరిమితి లేదని అర్హులైన వారందరికీ వీటిని మంజూరు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Back to Top