చంద్రబాబు అసెంబ్లీలో సెలక్ట్‌ కమిటీకి పంపమని ఎందుకు అడగలేదు?

 వికేంద్రీకరణ బిల్లుపై 11 గంటలపాటు సుదీర్ఘ చర్చ 

ఏడాదిలో 52 బిల్లులు పాస్‌ 

ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం

అమరావతి :  వికేంద్రీక‌ర‌ణ బిల్లును చంద్రబాబు అసెంబ్లీలో సెలక్ట్‌ కమిటీకి పంపమని ఎందుకు అడగలేదని, శాసన మండలిలో అడగడం వెనుక ఉద్దేశమేంటి అని ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్ర‌శ్నించారు. న్యాయస్థానాల్లో కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, సెలక్ట్‌ కమిటీలో పెండింగ్‌ ఉందని కోర్టులో చెప్తున్నారని ఆయ‌న మండిపడ్డారు. అసలు సెలక్ట్ కమిటీ ఏర్పాటు కానప్పుడు పెండింగ్‌లో ఎలా ఉంటుందని ప్రశ్నించారు. కోర్టులను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు. సెలక్ట్ కమిటీకి పంపాలంటే కచ్చితంగా ఓటింగ్ జరగాలని, ఓటింగ్ జరగనప్పుడు సెలక్ట్ కమిటీ ఎలా ఏర్పాటవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

 ప్రతిపక్షానికి ఎక్కువ సమయమే కేటాయించాం
 ప్రతిపక్షానికి అసెంబ్లీలో ఉన్న బలం కంటే ఎక్కువ సమయమే కేటాయించినట్లు  స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం పేర్కొన్నారు. వికేంద్రీకరణ బిల్లుపై 11 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. చర్చలో అధికార పక్షం 4 గంటలు, ప్రతిపక్షం 2.17 గంటలు మాట్లాడినట్లు పేర్కొన్నారు. ప్రతిపక్షానికి ఉన్న బలం కంటే ఎక్కువ సమయమే కేటాయించినట్లు తెలిపారు. అయినప్పటికీ అసెంబ్లీలో చర్చ సరిగా జరగలేదని ప్రతిపక్షం విమర్శించడం సరికాదని హితవు పలికారు. న్యాయ సమ్మతంగా ప్రతిపక్షానికి ఎక్కువ సమయం ఇచ్చామని స్పీకర్‌ తెలిపారు.ఏడాదిలో 52 బిల్లులు పాస్‌ చేసినట్లు ఆయన తెలిపారు .  చారిత్రక రిజర్వేషన్లు, సంక్షేమానికి చెందిన బిల్లులు పాస్‌ చేసినట్లు స్పీక‌ర్‌ వెల్లడించారు.  మంత్రులను మండలికి రాకూడదని వ్యాఖ్యానించడం ఎంతవరకు సమంజసం అని ఆయన  ప్రశ్నించారు.

 యనమల ఇచ్చిన రూలింగ్ ఇప్పటికీ అమలు

1997లో శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదని అప్ప‌ట్లో స్పీక‌ర్ స్థానంలో ఉన్న యనమల రామ‌కృష్ణుడు రూలింగ్ ఇచ్చారు. యనమల ఇచ్చిన రూలింగ్ ఇప్పటికీ అమలులో ఉంది. అదే యనమల ఇప్పుడు ఎలా విభేదిస్తారు? శాసనసభ నిర్ణయాలపై ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు? యనమల ఆరోజు ఇచ్చిన రూలింగ్‌ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పాల‌ని నిల‌దీశారు. నిన్న కోర్టులో కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది. శాసనసభ వ్యవహారాలపై కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది. సీఎం వైయ‌స్ జగన్ మ్యానిఫెస్టోలో చాలా వివరంగా చెప్పారు. రాజధానిని ఫ్రీజోన్‌గా చేస్తానని, నిజమైన వికేంద్రీకరణ లక్ష్యంగా, మూడు ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని వైయ‌స్‌ జగన్‌ చెప్పార‌ని  స్పీకర్ త‌మ్మినేని సీతారాం స్పష్టం చేశారు.‌

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top