ఉద్యోగ సంఘాల సమ్మెను వ్యతిరేకిస్తున్నాం

సమస్య ఏదైనా చర్చలకు వచ్చి పరిష్కరించుకోండి

ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ 

పే స్లిప్పులు చూస్తే జీతాలు పెరిగాయని స్పష్టంగా తెలుస్తోంది

చంద్రబాబు ఆడించే నాటకంలో ఉద్యోగులు పావులు కావొద్దు 

ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ గౌతమ్‌రెడ్డి

తాడేపల్లి: మంత్రుల కమిటీతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించుకోండి అని పదేపదే చెబుతున్నా.. వినిపించుకోకుండా ఉద్యోగ సంఘాల నేతలు సమస్య పెద్దది చేస్తున్నారని, సమ్మె పరిష్కారం కాదని గౌరవ హైకోర్టు చెబుతున్నప్పటికీ చర్చలకు రాకుండా వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ గౌతమ్‌రెడ్డి అన్నారు. మొన్నటి వరకు జీతాల్లో కోత విధిస్తున్నారని ప్రచారం చేశారని, జీతాల పే స్లిప్‌ చూస్తే ఏ ఒక్క ఉద్యోగికి కోత విధించలేదని, ఉద్యోగుల జీతాలు పెరిగాయని స్పష్టంగా తెలుస్తుందన్నారు. చర్చలకు రాకుండా ఉద్యోగ సంఘాలు తీసుకున్న సమ్మె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని గౌతమ్‌రెడ్డి చెప్పారు. 

విజయవాడలో ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ చైర్మన్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం 23శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించి ప్రభుత్వం ఫైనలైజ్‌ చేసిందని, మొదట అంగీకరించిన ఉద్యోగ సంఘాలు, తరువాత అభ్యంతరాలు వ్యక్తం చేశారన్నారు. ఉద్యోగ సంఘాలకు ఉన్న సందేహాలపై, సమస్యలపై చర్చించి పరిష్కరించేందుకు ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసినా.. చర్చలకు రాకుండా సమస్యను జఠిలం చేస్తున్నారన్నారు. 

ఫిబ్రవరి 6వ తేదీ నుంచి సమ్మె చేస్తున్నట్టు ప్రకటించి.. అంతకంటే ముందే సహాయ నిరాకరణకు దిగారని, కొత్త జీతాలు ఇచ్చే సమయంలో ఆర్థిక శాఖ ఉద్యోగులను సహాయ నిరాకరణ చేయమని ప్రేరేపించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.  జీతాలు రాకుండా ఉంటే అందరూ కలిసికట్టుగా వస్తారనే దురుద్దేశంతో కొందరు పనిగట్టుకొని ఓ ప్రయత్నం చేశారన్నారు. 1వ తేదీనే ఉద్యోగులకు కొత్త జీతాలు చెల్లించాలనే కృతనిశ్చయంతో ఉండటం వల్ల కొత్త జీతాలు ఉద్యోగుల బ్యాంక్‌ అకౌంట్లో జమ అయ్యాయన్నారు. పే స్లిప్పులు చూస్తే ఏ ఒక్క ఉద్యోగికి జీతం తగ్గలేదనే విషయం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఐదు డీఏలు ఒకేసారి ఇచ్చి, ఉద్యోగుల వయో పరిమితిని 62 సంవత్సరాలకు వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పెంచిందన్నారు. 

ప్రతిపక్ష పార్టీల చేతుల్లో కీలుబొమ్మలుగా తయారు కాకుండా, వారు ఇచ్చే డబ్బు సంచులకు ఆశపడి కొందరు సమ్మెకు ఉద్యోగులను పురిగొల్పుతున్నారని, చంద్రబాబు ఆడించే నాటకంలో పావులు కావొద్దని, ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఏ సమస్య వచ్చినా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, సీఎం వైయస్‌ జగన్‌ ప్రజల కష్టాలు తెలిసి మనిషి అని గౌతమ్‌రెడ్డి అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top