సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లపై టీడీపీ జులుం

వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరుల అక్రమ అరెస్టు

బంధువులకు సమాచారం ఇవ్వని పోలీసులు

ఓటమి భయంతో చంద్రబాబు అడ్డదారులు

అమరావతి: టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే పోలీసులు అగమేఘాల మీద కేసులు నమోదు చేస్తున్నారు. ఏ జిల్లా పోలీసులు..ఎందుకు అరెస్టు చేస్తున్నారు..ఎక్కడికి తీసుకెళ్తున్నారో కనీస సమాచారం కూడా చెప్పకుండా అరెస్టు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైయస్‌ఆర్‌సీపీ సానుభూతిపరులే లక్ష్యంగా  అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పోలీసులు టీడీపీ నాయకుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారి వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కొద్ది రోజులుగా గుంటూరు అర్బన్‌ జిల్లా పోలీసులు నిత్యం ఏదో ఒక జిల్లాకు చెందిన యువకులను అరెస్టు చేయడం పరిపాటిగా మారింది. కారణం అడిగితే సోషల్‌మీడియాలో సీఎంను కించపరిచేలా పోస్టింగ్‌లు పెట్టారని చెబుతున్నారు. ఏవైనా ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఎవరైనా అదుపులోకి తీసుకునేటప్పుడు ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు, బంధువులకు కనీస సమాచారం ఇవ్వాలన్న ధర్మాన్ని పోలీసులు పాటించడం లేదు.

కుటుంబ సభ్యులకు చెప్పకుండా యువకులను అరెస్టు చేసి తీసుకెళ్తున్నారు. దీంతో ఆ యువకుల ఆచూకీ కోసం వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎం చంద్రబాబుపై సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో నలుగురిని ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని పొందూరుకు చెందిన కాలేషావలి, గుంటూరు జిల్లా దాచేపల్లి మండలానికి చెందిన గుదిబండి గోపి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పత్రి నరేష్, కృష్ణాపురానికి చెందిన రామకృష్ణ ఉన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతిపరులనే ఈ యువకులపై టీడీపీ నేతలు అక్రమ కేసులు బనాయించారు. అరెస్టు చేసిన వారిలో కాలేషావలి సోదరి నిశ్చితార్థం ఉందన్నా వినిపించుకోలేదు. వారి బంధువులు ఆచూకీ కోసం పోలీసు స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. 

గ‌తంలో పొలిటిక‌ల్ పంచ్ అడ్మిన్ ఇంటూరి రవికిర‌ణ్‌ను కూడా పోలీసులు ఇలాగే ఆరెస్టు చేస్తే..వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ‌గా నిలిచింది. ఇటీవ‌ల కాలంలో వైయ‌స్ఆర్ సీపీ సానుభూతిప‌రుల‌ను అరెస్టు చేస్తుండ‌టంతో వైయ‌స్ జ‌గ‌న్ మ‌ద్ద‌తుగా నిలిచారు. చంద్ర‌బాబు అరాచ‌కాల‌ను ఎండ‌గ‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. ఈ కేసుల‌ను న్యాయ‌ప‌రంగా ఎదుర్కొనేందుకు వైయ‌స్ఆర్ సీపీ సిద్ధంగా ఉంద‌ని ధైర్యం చెప్పారు. సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు వైయ‌స్ఆర్ సీపీ మ‌ద్ద‌తుగా నిలుస్తుంది. 

Back to Top