బారులు తీరిన ఓట‌ర్లు

ప్ర‌శాంతంగా మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌‌

 అమ‌రావ‌తి: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిప‌ల్ ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. ఉద‌యం 7 గంట‌ల‌కే  పోలింగ్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. ఉదయం 9 గంటల వరకు 13.23 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద  ఓటర్లు బారులు తీరారు.  పోలింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని 12 నగరపాలక సంస్థలు, 71 పురపాలక సంఘాలు/నగర పంచాయతీల్లో ఎన్నికల పోలింగ్‌ జరుగుతుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఎప్పటికప్పుడు మున్సిపల్‌ ఎన్నికల సరళిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా అధికారులు పరిశీలిస్తున్నారు. ఎన్నికల అధికారి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్ లో నిఘా ఏర్పాటు చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్‌ తెలిపారు.  పోలింగ్ కేంద్రాల బయట కూడా కెమెరాలు ఏర్పాటు చేశామని,  ఇప్పటివరకూ ఎటువంటి సంఘటనలు లేవన్నారు. ఎక్కడ చిన్న సంఘటన జరిగినా దగ్గరలో ఉన్న ఎన్నికల, పోలీస్ అధికారులను వెంటనే అలెర్ట్ చేస్తామని ప్రసన్న వెంకటేష్‌ పేర్కొన్నారు. 

ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని, విశాఖ జిల్లా భీమిలి నేరెళ్లవలసలో అవంతి శ్రీనివాస్‌, వైయ‌స్సార్‌ జిల్లా కడప 29వ డివిజన్‌లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 53వ డివిజన్‌లో వెల్లంపల్లి శ్రీనివాస్‌, ప్రకాశం జిల్లా ఒంగోలు 34వ డివిజన్‌లో బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు 25వ డివిజన్‌లో ఆళ్ల నాని.. తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. 

టీడీపీ నేత‌ల దౌర్జ‌న్యం
తిరుపతి 15వ డివిజన్‌లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వైయ‌స్సార్‌ సీపీ అభ్యర్ధి భర్తను దుర్భాషలాడారు. ఓటు హక్కు లేని టీడీపీ నేతలు కూడా పోలింగ్ కేంద్రానికి రావడాన్ని ప్రశ్నించడంతో ఈ విధంగా వైయ‌స్సార్‌ సీపీ నేతలపై అక్కసు వెళ్లగక్కారు.
 
 

Back to Top