కృష్ణంరాజు మరణం సినీ, రాజకీయ రంగాల‌కు తీరనిలోటు

రెబల్‌స్టార్‌ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఏపీ మంత్రులు 

హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు భౌతిక కాయానికి ఏపీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు, పినిపె విశ్వరూప్, ఆర్కే రోజా, చీఫ్‌ విప్‌ ప్రసాదరాజు నివాళులర్పించారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ..  కృష్ణంరాజు ఎంతమంచి మనసున్న వ్యక్తో ఎవరూ మర్చిపోలేరు. ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్‌బాబు, కృష్ణంరాజు పెద్దదిక్కుగా ఉంటూ ఇండస్ట్రీని ముందుకు నడిపించారు. కృష్ణంరాజు మరణం చాలా బాధాకరం. వారి కుటుంబానికి, రాజకీయాలకు, ఇండస్ట్రీకి తీరనిలోటు. ఆయుర్వేదిక్‌ అంటే ఆయనకు చాలా ఇష్టం. భగవంతుడు ఆ కుటుంబానికి అండగా ఉండాలి, కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని మంత్రి రోజా అన్నారు. 

కృష్ణంరాజు సేవలు మరువలేనివి అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉండేవారన్నారు. ఆపదలో ఉన్న ఎవరికైనా సాయం చేసే గొప్ప వ్యక్తి కృష్ణంరాజు అని కొనియాడారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. 

కృష్ణంరాజు మరణం బాధాకరమని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన స్నేహం ఉండేదని గుర్తుచేశారు. రాజకీయాల్లో హుందా కలిగిన వ్యక్తి కృష్ణంరాజు అని మంత్రి పినిపె విశ్వరూప్‌ అన్నారు. నర్సాపురంలోని ఏ గ్రామానికి వెళ్లినా ఆయన జాడలు కనిపిస్తాయన్నారు.  

తాజా వీడియోలు

Back to Top