ఆర్థిక లోటు తగ్గడం మంచి పరిణామం 

కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గ‌న 

విజయవాడ: ఆదాయపు పన్ను శ్లాబ్‌ రేట్లు ఊరటనిచ్చాయని ఏపీ ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చాయన్నారు. ఆర్థిక లోటు తగ్గడం మంచి పరిణామం. కొన్ని సెక్టార్లలో తక్కువ కేటాయింపులు చేశారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి కేటాయింపులు తగ్గాయి. వ్యవసాయానికి కేటాయింపులు తగ్గించి, రోడ్లు, రైల్వేలకు పెంచారు. 7 రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ని రూపొందించారు. అయితే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదు’’ అని మంత్రి పేర్కొన్నారు.

 రాష్ట్రాలతో నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశాల్లో మన సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. పంప్ స్టోరేజ్ విధానాన్ని అమలు చేయాలని కోరాం. ఏపీ రోల్ మోడల్‌గా ఈ రంగంలో ఉంది. దీనిపై పాలసీ తేవాలని కోరామని, దానిని ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అనువుగా కొన్ని నిర్ణయాలు ఉన్నాయి. నర్సింగ్ కాలేజీలు, స్కిల్  డెవలప్‌మెంట్ సెంటర్లు, ఎయిర్‌ పోర్టులు, పోర్టులు నిర్మాణానికి ఉపయోగపడుతుంది. గృహ నిర్మాణం, ఏకలవ్య స్కూళ్ల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. వ్యక్తిగత పన్ను రాయితీలు కొన్ని ప్రకటించడాన్ని హర్షిస్తున్నామని మంత్రి బుగ్గన అన్నారు.

Back to Top