సింపతీ కోసమే భువనేశ్వరి యాత్ర

అవినీతి, అబద్ధం, అన్యాయం గెలవాలి అని ఉద్యమం చేస్తే మీకు ఉపయోగం ఉండొచ్చు 

మంత్రి అంబటి రాంబాబు

చంద్రబాబు ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు సిద్ధమా?

ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు నిజం చెప్పారా?

తూర్పు గోదావరి:  నారా భువనేశ్వరి ‘సింపతీ కోసమే యాత్ర చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. భువనేశ్వరి నిజం గెలవాలి అని యాత్ర చేపట్టారు. అలా కాకుండా.. అవినీతి గెలవాలి, అబద్ధం గెలవాలి, అన్యాయం గెలవాలి అని ఉద్యమం చేయండి. అప్పుడు మీకు ఉపయోగం ఉండొచ్చు అని ఎద్దేవా చేశారు. గురువారం రాజమహేంద్రవరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ అని యాత్ర మొదలుపెట్టారని.. అయితే నిజం గెలవాలని ఉద్యమం చేస్తే చంద్రబాబు మరింత ఇరుక్కుంటారని అన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబు ఇవాళ జైల్లో ఉన్నారని స్పష్టం చేశారు. 
మీ ఆస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణకు మీరు సిద్ధమా?. మీరు విచారణకు ఆహ్వానిండి.. అప్పుడు నిజం గెలుస్తుందని చంద్రబాబు కుటుంబ సభ్యులకు మంత్రి సూచించారు.

చంద్రబాబు కేసులో ప్రాథమిక ఆధారాలున్నాయి. అందుకే బాబును అరెస్ట్‌ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు ఇవాళ జైల్లో ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్‌ చేశారని, ఇది అక్రమ అరెస్ట్‌ ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు.  సీఎం వైయస్ జగన్‌పై బురద జల్లేందుకు పథకం ప్రకారమే ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.

చంద్రబాబు ఎప్పుడైనా నిజం చెప్పారు?
స్కామ్‌లన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయి. చంద్రబాబు ఎప్పుడు నిజం చెప్పారు? కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు చెప్పారా? ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడు నిజం చెప్పారా? తెలంగాణలో ఓటుకు నోటు కేసులో నిజం చెప్పారా? రాజధాని భూముల కేసులో నిజం చెప్పారా? అధికార ధనబలంతో నిజాన్ని ఇంతకాలం తొక్కిపెట్టారు అని మంత్రి చురకలంటించారు.

కొత్త బ్రాండ్‌ల‌కు మా ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వలేదు
బీజేపీ ఏపీ చీఫ్‌ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన మద్యం ఆరోపణలపై అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు త‌గ్గాయి. కొత్త డిస్టరీస్‌లకు అనుమతి ఇవ్వలేదు. కొత్త బ్రాండ్‌లకు అనుమతి ఇవ్వలేదు. బూమ్‌ బూమ్‌ బీర్లకు, ప్రెసిడెంట్ మెడల్‌కు సైతం చంద్రబాబే అనుమతి ఇచ్చారు అని మంత్రి అంబ‌టి రాంబాబు  గుర్తు చేశారు. 
 

Back to Top