అమరావతి: నేటి నుంచి ఏపీలో కుల గణన కార్యక్రమం ప్రారంభమైంది. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలో గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలలో 1,33,16,091 మంది నివసిస్తున్నారు. మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ఉన్నారు. సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరించనున్నారు. జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఇంటింటి కులగణన ప్రక్రియలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకుండా మిగిలిన వారి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు సంబంధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కులగణన కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నాయి. కులగణనకు సంబంధించి ఇప్పటికే వివిధ కుల సంఘాల ప్రతినిధులతో జిల్లాల వారీగా ప్రభుత్వం ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది. 7 సచివాలయాల పరిధిలో పైలట్ ప్రాజెక్టు పూర్తి రాష్ట్ర స్థాయి కులగణన నేపథ్యంలో ఆరు జిల్లాల్లో 7 సచివాలయాల పరిధిలో పైలట్‌గా కులగణన ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. 3,323 కుటుంబాలకు సంబంధించి 7,195 మంది వివరాలను నమోదు చేశారు. శ్రీకాకుళం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఎనీ్టఆర్, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడపతోపాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని సచివాలయాల పరిధిలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. గిరిజన, మారుమూల ప్రాంతాల్లో యాప్‌లో వివరాల నమోదుకు సిగ్నళ్లు లేనిచోట్ల ఆఫ్‌లైన్ విధానంలో సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా 300–400 వరకు మారుమూల ప్రాంతాల్లో ఇలా సేకరించాల్సి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. 726 కులాలు.. ప్రత్యేక యాప్ కులగణన ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా వర్గీకరించి మొబైల్ యాప్‌లో అనుసంధానించారు. ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ సమయంలో ఆయా కుటుంబం ఏ కేటగిరిలోకి వస్తుందో యాప్‌లో సెలెక్ట్ చేయగానే కులాల జాబితా కనిపిస్తుంది. వారు వెల్లడించే వివరాల ప్రకారం కులగణన సిబ్బంది దాన్ని నమోదు చేస్తారు. ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలో పేర్కొన్న 723 కులాలకు అదనంగా మరో మూడు కులాలు బేడ జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్ (తేవర్), యలవ కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్ కేటగిరిలో సేకరించనున్నారు. వీటితో పాటు నో– క్యాస్ట్ కేటగిరీని కూడ కులగణన ప్రక్రియలో ఉపయోగించనున్నారు. కులగణన ప్రక్రియలో అత్యంత పారదర్శకంగా వివరాల నమోదు అనంతరం ఆ కుటుంబంలో ఎవరైనా ఒక వ్యక్తి నుంచి ఆధార్‌తో కూడిన ఈ –కేవైసీ తీసుకోనున్నారు. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలకు అవకాశం కల్పించారు.