మీ తండ్రీకొడుకుల బతుక్కు బయోడేటా ఉందా..?

లోకేష్ బుర్ర‌లో అసలు డేటా ఉందా..?

శుభకార్యానికి, పరామర్శకు తేడా తెలియకుండా లోకేష్‌ ప్రవర్తన

అసలు జల్లయ్య గురించి లోకేష్‌కు తెలుసా..?

పిల్ల రాజకీయాలు, పిల్ల చేష్టలు నీ ఇంట్లో కొడుక్కు చెప్పుకో.. 

ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఫ్యాక్షన్‌ చిచ్చుపెట్టేందుకు కుట్ర

ఏడు మర్డర్‌ కేసులో ఏ1 ముద్దాయి టీడీపీ మాచర్ల ఇన్‌చార్జ్‌ బ్రహ్మారెడ్డి

పల్నాడు ప్రాంతంలో అడుగుపెట్టేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుంటే మంచిది

లోకేష్‌కు ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరిక

తాడేపల్లి: భయం లేదని ప్రకటించుకునే తండ్రీకొడుకుల బతుకులకు బయోడేటా అనేది ఉందా..? లోకేష్ బుర్ర‌లో అసలు డేటా ఉందా..? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో ఫ్యాక్షన్‌ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు, లోకేష్‌లపై పిన్నెల్లి మండిపడ్డారు. పల్నాడు ప్రాంతంలో అడుగుపెట్టేముందు ఒళ్లు దగ్గరపెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీని, జెండాను, ఎన్టీఆర్‌ ట్రస్టు ఆస్తులను దొంగలించిన దొంగలకు బయోడేటా ఎక్కడుందని ప్రశ్నించారు. ఏపీలో ఆధార్‌కార్డు కూడా లేని లోకేష్‌.. హైదరాబాద్‌ నుంచి చుట్టపుచూపుగా వచ్చే పెయిడ్‌ ఆర్టిస్టుకి మా గురించి మాట్లాడే హక్కు ఉందా..? అని నిలదీశారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా పిన్నెల్లి ఏం మాట్లాడారంటే..
జల్లయ్య కుటుంబ పరామర్శ పేరుతో లోకేష్‌ పల్నాడుకు వచ్చాడు. శుభకార్యానికి, పరామర్శకు అర్థం తెలియని లోకేష్‌ నాలుగు దండలు వేసుకొని చనిపోయిన ఇంటికి వచ్చి ప్రెస్‌మీట్‌ పెట్టి నోటికి వచ్చినట్టుగా మాట్లాడాడు. అసలు లోకేష్‌కు పల్నాడులో ఏం జరుగుతుందో తెలుసా..? లోకేష్‌లో నిరాశ, నిస్పృత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. చంద్రబాబు కొడుకుగా పల్నాడుకు వచ్చి పెద్ద పెద్ద బొట్టు పెట్టుకొని మీసాలు మెలేసి.. డైలాగ్‌లు చెబుతుంటే.. మా అందరికీ సినిమాలో కిల్‌బుల్‌ పాండే పాత్ర పోషించిన బ్రహ్మానందంగా మా ప్రాంత ప్రజలు భావించారు.

అసలు జల్లయ్య గురించి లోకేష్‌కు తెలుసా..? జల్లయ్య అనే వ్యక్తిపై 2014–19లో టీడీపీ అధికారంలో ఉన్నప్పడు 10 కేసులు ఎఫ్‌ఐఆర్‌ అయ్యాయి. అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి వచ్చాడు. మాచర్ల నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా పంపించిన బ్రహ్మారెడ్డి గురించి నీకు తెలుసా..? నిన్నటి వరకు హాఫ్‌ నిక్కర్లు వేసుకొని విదేశాల్లో విహార యాత్రలు చేస్తున్నావు. నీ పక్కన కూర్చున్న బ్రహ్మారెడ్డి తల్లి 2014–19లో ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత మండలంలో 15 మర్డర్లు జరిగాయి. బ్రహ్మారెడ్డి విలేజ్‌లో 13 ఫ్యాక్షన్‌ హత్యలు జరిగాయి. అలాంటి వ్యక్తి లోకేష్‌ పక్కన కూర్చున్నాడు. 

7 మందిని చంపిన కేసులో ఏ1 బ్రహ్మారెడ్డి, సొంత బాబాయిని చంపిన కేసులో ఏ1, సొంత కొడుకును చంపిన కేసులో ఏ1, వరుసకు బావను చంపిన కేసులో నిందితుడు, ఫ్యాక్షన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌ బ్రహ్మారెడ్డి. అలాంటి వ్యక్తిని పక్కనబెట్టుకొని పల్నాడు ప్రాంతానికి వచ్చేసి ఫ్యాక్షన్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నావా..? 2004 నుంచి ఇప్పటి వరకు మా కుటుంబం మాచర్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ఫ్యాక్షన్‌ను పూర్తిగా అణచివేశాం. ఈ రోజు మళ్లీ ఫ్యాక్షన్‌ బ్యాక్‌గ్రౌండ్‌ను ఉన్న బ్రహ్మారెడ్డిని తండ్రీకొడుకులు పల్నాడుకు పంపించి.. ప్రశాంతంగా ఉన్న పల్నాడులో నిప్పురాజేసి గొడవలు పెట్టాలని చూస్తున్నాడు. బ్రహ్మారెడ్డి లాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే..మొన్న వచ్చిన 23 సీట్లు కాదు కదా.. 3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. 

రాయలసీమ పౌరుషం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి సింహంలాంటి సీఎం వైయస్‌ జగన్‌ మాత్రమే. చంద్రబాబు, లోకేష్‌ గ్రామ సింహాలు మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాలి. పేరుమార్చుకో అని ఏదేదో మాట్లాడుతున్నాడు. నిన్నటి వరకు లోకేష్‌ ఎక్కడో విహార యాత్రలు చేసివచ్చి ఇవాళ హడావిడి చేస్తున్నాడు. పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గానికి నాలుగుసార్లు ప్రజలతో ఎన్నుకోబడి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని, గవర్నమెంట్‌ విప్‌గా, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. పిల్ల రాజకీయాలు, పిల్ల చేష్టలు నీ ఇంట్లో కొడుకుకు చెప్పుకో.. పల్నాడు ప్రాంత ప్రజలకు కాదు. ఫ్యాక్షన్‌ను మళ్లీ ప్రోత్సహించి పల్నాడును అల్లకల్లోలం చేయాలని చూస్తే ఆ ప్రాంత ప్రతినిధిగా చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు.

సింహం లాంటి సీఎం వైయస్‌ జగన్‌ను చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఎలా ఉంటుందో అదే లోకేష్‌ పరిస్థితి. రాష్ట్రంలో ఏదో జరిగిపోయిందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు. పల్నాడులో ఏ గ్రామానికైనా రా.. క్రియాశీలకంగా ఉన్న  నీ కార్యకర్తలు, నాయకుల ఇళ్లకు వెళ్దాం.. నీ తండ్రి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలకు ఎంత న్యాయం జరిగిందో.. గడిచిన మూడేళ్ల పాలనలో సీఎం వైయస్‌ జగన్‌ ఎంత సహాయం చేశారో చూద్దాం.. కావాలంటే పల్నాడులో ఏ గ్రామానికైనా రా.. వచ్చే ధైర్యం నీకు ఉందా..? వాస్తవాలు తెలుసుకోకుండా అబద్ధాలు ఎల్లోమీడియాలో ప్రచారం చేస్తే.. నాలుగు దండలు వేసుకొని పల్నాడులో హడావిడి చేస్తే ప్రజలు నమ్మరు. పల్నాడు ప్రాంతంలో అడుగుపెట్టేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుంటే మంచిది అని హెచ్చరిస్తున్నాను. 
 

Back to Top