అమరావతి: సీపీఎస్ రద్దుపై ఏపీ ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కొత్త కమిటీ ఏర్పాటు చేసింది. సీఎస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి సభ్యులుగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలతో కొత్త కమిటీ చర్చలు జరపనుంది. చర్చల తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. జీపీఎస్(గ్యారంటీ పెన్షన్ స్కీం) ప్రతిపాదన సీపీఎస్ అంశంపై సచివాలయం రెండో బ్లాకులో పలు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం సమావేశమైంది. ఉద్యోగ సంఘాల ముందు జీపీఎస్(గ్యారంటీ పెన్షన్ స్కీం) ప్రతిపాదనను ప్రభుత్వం ఉంచింది. ఈ కొత్త ప్రాతిపాదన అంగీకరించేది లేదని, సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఉద్యోగ సంఘాలకు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ ఆర్) శశిభూషణ్ కుమార్, కార్యదర్శులు గుల్జార్, హెచ్.అరుణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం)పి.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఆర్ సూర్యనారాయణ, ఏపీ (పీ ఆర్ టి యు) అధ్యక్షులు మిట్టా కృష్ణయ్య, ఏపీ యుటిఎఫ్ అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు, ఏపీటిఎఫ్ అధ్యక్షులు జి.హృదయ రాజు తదితరులు పాల్గొన్నారు.