ఆప"రేషన్‌' సక్సెస్‌

కరోనా వైరస్‌ నేపథ్యంలో ఉచితంగా రేషన్‌ పంపిణీ ప్రారంభం

దూరం పాటిస్తూ రేషన్‌ తీసుకుంటున్న ప్రజలు

సరుకుల పంపిణీని పరిశీలిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

ప్రభుత్వ సాయంతో పేద ప్రజలకు ఊరట

అమరావతి: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న కష్ట కాలంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో పేద ప్రజలు ఆహారం కోసం ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఉచితంగా బియ్యం, కంది పప్పు అందించాలని సీఎం వైయస్‌ జగన్‌ సంకల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. ఒక్కొక్కరికి ఐదు కేజీల బియ్యం, ఒక కేజీ కందిపప్పు, చెక్కరను రేషన్‌ డీలర్లు అందజేస్తున్నారు.

సామాజిక దూరం పాటిస్తూ..
ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ సరుకులు తీసుకుంటున్నారు. ‘కరోనా వైరస్’ కారణంగా కొన్నిరోజులుగా నిత్యావసర సరుకులు దొరకక నిరుపేద కుటుంబాలు ఇబ్బందులు పడగా.. రెండు రోజుల ముందుగానే బియ్యం సరఫరా చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా రేషన్‌ కార్డుదారులకు నిత్యావసర సరుకులను ఈ నెల 29 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  రేషన్‌ పంపిణీ కార్యక్రమాన్ని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా పరిశీలించి తగు సూచనలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రేషన్‌ పంపిణీ.. 
నెల్లూరు:
జిల్లా వ్యాప్తంగా పేదలకు ఉచితంగా రేషన్ పంపిణీ కోనసాగుతోంది. దీంతో ఆరు లక్షల కుటుంబాలకు లబ్ది కలగనున్నది. రేషన్ పంపిణీపై కార్డుదారులు హర్షం వ్యక్తం చేశారు. రేషన్‌ డీలర్లు కార్డుదారులకు బియ్యం, కందిపప్పు, చక్కరను పంపిణీ చేస్తున్నారు. పాయకరావుపేటలో మంత్రి అవంతి శ్రీనివాస్ రావు పర్యటించి రేషన్‌ సరుకుల పంపిణీని పరిశీలించారు. అదేవిధంగా ఎమ్మెల్యే గొల్ల బాబురావుతో కలిసి మంత్రి రైతు బజారులో చేసిన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. రేషన్ డిపో నుంచి సరుకును మంత్రి అవంతి శ్రీనివాసరావు వినియోగదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలన్నారు. దీంతోపాటు సామాజిక దూరం పాటించడం ద్వారా కరోనా కట్టడి చేద్దాం అని చెప్పారు.

కాకినాడ: ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఎమ్యెల్యే ద్వారంపూడి అన్నారు. ఇక సామాజిక దూరం పాటించాలని, బయటకు వెళ్లితే మాస్క్‌లు ధరించాలని ఆయన ప్రజలకు సూచించారు. కాకినాడలో 40 ఆటోల ద్వారా రైతుబజార్ల ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. మూడు రైతుబజార్లను మైదాన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.

ప్రకాశం: రేషన్‌ సరుకుల పంపిణీలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.అనంతరం ఆయన పీవీఆర్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రైతుబజార్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ధీరజ్ ఆస్పత్రి వద్ద రేషన్‌షాపులో బాలినేని ప్రజలకు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు.

వైఎస్ఆర్‌ కడప: నగరంలోని మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్‌ను  డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సందర్శించారు. అనంతరం ఆయన పేద ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నివారణకు ప్రజలు సామాజిక దూరం పాటించాలని సూచించారు.

విజయవాడలో  
సత్యనారాయణపురంలో రేషన్‌ సరుకుల పంపిణీని ఎమ్మెల్యే మల్లాది విష్ణు సందర్శించారు. క్యూలో ఉన్నవారికి ఆయన శానిటైజర్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సరుకులు పదిహేను రోజులపాటు పంపిణీ చేస్తామని తెలిపారు. రేషన్ షాపు వద్ద ఎక్కువగా క్యూ లైన్‌ ఉంటే కొంత సమయం ఇంటి వద్దనే ఉండాలని ఆయన సూచించారు. రేషన్‌కార్డు ఉన్న పేదలందరికీ సరుకులు అందిస్తామని ఆయన చెప్పారు.

రేషన్‌ డిపోలకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో వేలిముద్రతో సంబంధం లేకుండా డీలర్లు సరుకులను పంపిణీ చేస్తున్నారు. సామాజిక దూరం పాటించేలా మీటరు దూరంలో రింగులు ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్‌తో ఎలా బతకాలి అన్న భయం కలిగిందని, ఆందోళన చెందుతున్న సమయంలో సీఎం వైస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయం తమకు ఊరట కలిగించిందని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మూడు నెలల పాటు ఆహారానికి ఇబ్బంది పడకుండా నిర్ణయం తీసుకున్న సీఎం వైయస్‌ జగన్‌కి తాము రుణపడి ఉంటామన్నారు. కరోనా కట్టడికి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ఆప"రేషన్‌' కార్యక్రమం విజయవంతమైందని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ సూచనల మేరకు ఇంట్లోనే ఉంటూ ఆరోగ్యంగా జీవిస్తామని సామాన్య జనం పేర్కొంటున్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top