రాజకీయాలు మాని అసెంబ్లీకి వస్తే మంచిది

ప్రతిపక్షం అడిగే ప్రతీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం

ప్రశ్నలు అడిగేందుకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తాం

పార్టీల మధ్య ఎన్ని విభేదాలు అయినా ఉండొచ్చు కానీ, అసెంబ్లీని గౌరవించాలి

స్పీకర్‌ అనుమతితో అసెంబ్లీ పవర్స్‌పై చర్చ జరిపేందుకు ప్రయత్నిస్తాం

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

సచివాలయం: ప్రతిపక్షం రాజకీయ కోణాలు మాని అసెంబ్లీ సమావేశాలకు వస్తే మంచిదని, ప్రతిపక్ష సభ్యులు వేసే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో గౌరవ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం, గౌరవ శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అధ్య‌క్ష‌త‌న‌ శాసన సభ, మండలి సెక్రటరీస్, అన్ని డిపార్టుమెంట్ల హెచ్‌ఓడీలతో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం అనంతరం చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘‘అసెంబ్లీ సమావేశాలకు ఉన్న ప్రాధాన్యత, ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఉన్న గౌరవం గురించి శాసనసభ స్పీకర్, కౌన్సిల్‌ చైర్మన్‌ సమక్షంలో సుదీర్ఘంగా చర్చించాం. అసెంబ్లీ జరిగే రోజుల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం రావాలని స్పీకర్‌ ఆదేశాలిచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లో జీరో అవర్‌కు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, ఏ సభ్యుడు ఏ ప్రశ్న అడిగినా సభ్యులకు సమాధానం పంపే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఉన్న విలువలను అధికారులకు తెలియజేశారు. పెండింగ్‌లో ఉన్న 418 ప్రశ్నలకు త్వరగా సమాధానం పంపించాలని చెప్పారు. భద్రత ఏర్పాట్లపై పోలీస్‌ అధికారులకు స్పీకర్‌ ఆదేశాలిచ్చారు. 

ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి ఇంత ప్రాధాన్యత ఉన్నప్పుడు, ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నప్పుడు.. ప్రతిపక్షానికి మైక్‌ ఇవ్వడానికి ప్రయత్నిస్తే ప్రతీసారి సబ్జెక్ట్‌ మాట్లాడకుండా వ్యక్తిగత ఆరోపణలతో, వైయస్‌ఆర్‌ సీపీని, ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలనే చూశారు. సబ్జెక్ట్‌లోకి రండి అని చెప్పినా.. ఎవరూ మాట్లాడని అంశాన్ని తీసుకొని కుటుంబ సభ్యులను కూడా అంశంలోకి తీసుకువచ్చి రాజకీయం చేసి సమావేశాలను చంద్రబాబు బహిష్కరించాడు. 

బయట ప్రభుత్వం ఏం చేయలేదని చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నాడు. అదే సభలో మాట్లాడేందుకు కావాల్సిన సమయాన్ని కేటాయించడానికి స్పీకర్‌ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎలాంటి ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పడానికి, చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్టీల మధ్య ఎన్ని విభేదాలు అయినా ఉండొచ్చు కానీ, అసెంబ్లీని గౌరవించాలి. పార్టీకి మైలేజ్‌ తెచ్చుకోవాలనే ప్రయత్నాలు మాని ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలకు వస్తే ప్రతీ మాటకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. 

పారదర్శకంగా సభ నడిపేందుకు, ప్రతిపక్షం ప్రశ్నలు అడిగేందుకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తాం. రాజకీయ కోణాలు మాని సమావేశాలకు వస్తే మంచిది. అసెంబ్లీ విలువలు పెంచిన వారు అవుతారు. వ్యక్తగత స్వార్థం కోసం రాజకీయాలు చేస్తే ప్రజాస్వామ్యాన్ని కించపరిచినవారు అవుతారు. ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాలు హాజరై మంచిది. 

అసెంబ్లీకి ఎలాంటి పవర్స్‌ లేవు గౌరవ కోర్టు పరిధి నుంచి కొన్ని అంశాలు వచ్చాయని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీనిపై చర్చ జరగాలని సీనియర్‌ శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు కూడా లేఖ రాశారు. కచ్చితంగా బీఏసీ సమావేశంలో ఈ అంశాన్ని లేవదీసి.. స్పీకర్‌కు వివరిస్తాం. అసెంబ్లీ విలువలపై, పవర్స్‌పై చర్చ జరిగితే మంచిది. స్పీకర్‌ అనుమతితో చర్చ జరిపేందుకు ప్రయత్నిస్తాం’’ అని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. 

 

Back to Top