16న ఇడుపులపాయలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

తాడేప‌ల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ‘అభివృద్ధి.. సంక్షేమం.. సామాజిక న్యాయం’ను చూపెడుతూ మరోసారి అధికారం దక్కించుకునే దిశగా వైయ‌స్ఆర్‌సీపీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే గరిష్టంగా శాసన సభ స్థానాలకు, పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సమన్వయకర్తలను(ఇన్‌ఛార్జిలను) నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అభ్యర్థుల తుది ప్రకటనకు రంగం సిద్ధమైంది.

వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ  నెల 16వ తేదీన వైయ‌స్ఆర్‌ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. వైయ‌స్ఆర్‌ ఘాట్‌ వేదికగా.. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను స్వయంగా ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్ట్‌ను ఆయన ప్రకటించారు. 16వ తేదీ నాటి ప్రకటన అనంతరం సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎన్నికల ప్రచారంలోకి దిగుతారని సమాచారం. 

ఉత్త‌రాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీ‌కారం
ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం వైయ‌స్‌ జగన్‌..మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈ నెల 18వ తేదీన ప్రచారం  మొదలుపెడతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇచ్ఛాపురం నుంచి మొదలుపెట్టి అదేరోజు విజయవాడ వెస్ట్‌, నెల్లూరు రూరల్‌లో ఆయన ప్రచారంలో పాల్గొనచ్చని తెలుస్తోంది. ఇలా రోజుకు రెండు లేదంటే మూడు బహిరంగ సభలు, రోడ్ షోలో సీఎం వైయ‌స్‌ జగన్‌ పాల్గొనేలా పార్టీ వర్గాలు ఒక షెడ్యూల్‌ను రూపకల్పన చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్యనేతలు రూట్ మ్యాప్ పైన చర్చించినట్లు తెలుస్తోంది. 

ఒకట్రెండు మార్పులే!
ఇక.. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితా దాదాపు ఖరారైంది. ఒకటి రెండు మార్పులతో సమన్వయకర్తల చివరి జాబితాను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం.  ఒకట్రెండు రోజుల్లో ఆఖరి జాబితా విడుదల కానుందని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు చెబుతున్నాయి.  ఇప్పటివరకు విడుదలైన జాబితాల వారీగా చూస్తే..   77 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్‌ స్థానాలకు ఇన్‌ఛార్జిలను నియమించింది(మార్పులు చేర్పులతో కలిపి).  

ఇక ఈ ఇన్‌ఛార్జిలనే ఎన్నికల్లో దాదాపుగా అభ్యర్థులుగా ఖరారు చేశామని.. ఒకట్రెండు చోట్ల మార్పులు ఉంటే ఉండొచ్చని మంగళగిరిలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఆఖరి జాబితాతో ఎన్నికల్లో పోటీకి దించబోయే అభ్యర్థుల్ని దాదాపుగా ప్రకటించేసినట్లవుతుంది.

►మరోవైపు మేదరమెట్లలో జరిగిన ఆఖరి సిద్ధం సభలో.. త్వరలో మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని కూడా సీఎం వైయ‌స్ జగన్‌ ప్రకటించారు. ఈ క్రమంలో.. వైయ‌స్ఆర్‌సీపీ మేనిఫెస్టో రూపకల్పన కూడా దాదాపు సిద్ధం అయ్యిందనే తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో 99.5% అమలు చేసింది విదితమే. దీంతో..  ఈ ఎన్నికల కోసం సీఎం వైయ‌స్ జగన్‌ ప్రకటించబోయే మేనిఫెస్టో ‘ఎలా ఉండబోతుందా?’ అని రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ వర్గాలు  ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. 

Back to Top