వైయ‌స్ఆర్ సీపీ ఆరో జాబితా విడుదల 

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో మరో ఆరు శాసనసభ, నాలుగు లోక్‌సభ స్థానాలకు వైయ‌స్ఆర్‌సీపీ సమన్వయకర్తలను నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వై.య‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద శుక్రవారం సాయంత్రం వెల్లడించారు. ప్రజాబలమే గీటురాయిగా..  సామాజిక న్యాయం పాటిస్తూ... ఆరో జాబితా తయారు చేసినట్టు ఈ సందర్భంగా వారు తెలిపారు. 

 

గత ఎన్నికల్లో నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా... ఈ సారి బీసీ వర్గానికి చెందిన మహిళా అడ్వొకేట్‌ గూడూరి ఉమాబాలను ఎంపిక చేశారు. రాజమండ్రి లోక్‌సభ స్థానానికి డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌(బీసీ)ను, గుంటూరుకు ఉమ్మారెడ్డి వెంకటరమణ, చిత్తూరుకు సిటింగ్‌ ఎంపీ ఎన్‌.రెడ్డప్పను ఎంపిక చేశారు. గత ఎన్నికల్లో మైలవరం శాసనసభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా.. ఈ సారి సర్నాల తిరుపతిరావు యాదవ్‌(బీసీ)ను నియమించారు.

గత ఎన్నికల్లో ఎమ్మిగనూరు శాసనసభ స్థానం నుంచి ఓసీ వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దించగా.. ఇప్పుడు మాజీ ఎంపీ బుట్టా రేణుకను నియమించారు. మార్కాపురానికి ఎమ్మెల్యే అన్నా రాంబాబు, గిద్దలూరుకు ఎమ్మెల్యే కె.నాగార్జునరెడ్డి, గంగాధరనెల్లూరు(ఎస్సీ)కు డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి, నెల్లూరు సిటీకి ఎండీ ఖలీల్‌ను నియమించారు. వీరి నియామకంతో ఇప్పటివరకూ 63 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను కొత్తగా నియమించినట్టయింది.

ఇప్పటిదాకా ప్రకటించిన శాసనసభ స్థానాల సమన్వయకర్తల్లో 21 మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు, 18 మంది బీసీలు, ఐదుగురు మైనార్టీలు, 16 మంది ఓసీలకు చెందిన వారు ఉన్నారు. 16 లోక్‌సభ స్థానాలకు నియమించిన సమన్వయకర్తల్లో బీసీలు తొమ్మిది మంది, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ఓసీలు నలుగురు ఉన్నారు. ఈసారి వెలువరించిన జాబితాలో ఐదుగురు కొత్తవారు ఉండటం గమనార్హం.

గుంటూరు లోక్‌సభకు వెంకటరమణ
గుంటూరు లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపికైన ఉమ్మారెడ్డి వెంకటరమణ వాస్తవానికి తొలిసారిగా బరిలో నిలవనున్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు, శాసన మండలి చీఫ్‌ విప్‌గా ఉన్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు ఈయన పెద్దకుమారుడు. 1961లో జన్మించిన ఈయన మాస్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌లో డిస్టింక్షన్‌లో పాస్‌ అయ్యారు. స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ బాధ్యతలు చూస్తున్నారు.

నర్సాపురం నుంచి తొలి బీసీ మహిళ
నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా తొలిసారిగా బీసీ మహిళను ఎంపిక చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలైన గూడూరి ఉమాబాల పేరెన్నిక గన్న న్యాయవాది. న్యాయవాద విద్యలో బంగారు పతకం సాధించిన ఆమె న్యాయవాదిగా ఉంటూనే 1995 నుంచి భీమవరం మున్సిపల్‌ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు.

2001లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పోటీ చేశారు. అంతకుముందు కాంగ్రెస్‌ పార్టీలో జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా, జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా, డీసీసీ ప్రధాన కార్యదర్శిగా, వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం జిల్లా కన్వీనర్‌గా, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా, ద్వారకాతిరుమల దేవస్థానం పాలకమండలి సభ్యురాలుగా కూడా వ్యవహరించారు. 

ప్రజల నాడి పట్టగల డాక్టర్‌ శ్రీనివాస్‌
రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపిక చేసిన డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌ స్వగ్రామం నరసాపురం. ఎంబీబీఎస్, డీఎల్‌ఓ (ఈఎన్‌టీ), ఎండీ (పల్మానాలజీ) ఎఫ్‌సీసీపీ అభ్యసించిన ఈయన విజయ భారతి చెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శ్వాసకోశ నిపుణులుగా కొనసాగుతున్నారు. ఇప్పటివరకూ ఐఎంఏ సెక్రటరీగా, రాజమహేంద్రవరం ఏపీఎన్‌ఏ సెక్రటరీ ప్రెసిడెంట్‌గా, ఉమ్మడి తూర్పు గోదావరి ఇండియన్‌ చెస్ట్‌ సొసైటీ సభ్యునిగా వ్యవహరించారు.

ఈయన భార్య  గూడూరి రాధిక అడ్వొకేట్‌గా మాజీ కార్పొరేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈయన 8 నెలల క్రితం వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగారు. అనంతరం ఆయన స్థానంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను నియమించి, ఈయన్ను రాజమహేంద్రవరం లోక్‌సభ సమన్వయకర్తగా నియమించారు. మృదు స్వభావిగా, వైద్యునిగా మంచి ఆదరణ పొందారు.

జెడ్పీటీసీకి నియోజకవర్గ బాధ్యతలు
ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం శాసనసభ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన సర్నాల తిరుపతిరావు(బీసీ–యాదవ) ప్రస్తుతం జెడ్పీటీసీగా వ్యవహరిస్తున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయన 2013నుంచి రాజకీయాల్లో ఉన్నారు.

నెల్లూరు సిటీ నుంచి డిప్యూటీమేయర్‌
నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన ఎండీ ఖలీల్‌ ప్రస్తుతం నెల్లూరు నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్‌గా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు నగరం 43వ డివిజన్‌ పరిధిలోని జెండావీధి ప్రాంతంలోగల కంతర్షావలీ దర్గా సమీపంలో నివసిస్తున్న మహ్మద్‌గౌస్, మహ్మద్‌జుబేదాబేగం దంపతుల ఏడుగురి సంతానంలో ఈయన చివరివాడు.

డీవైఎఫ్‌ఐలో కొంతకాలం పనిచేసి, తరువాత సీపీఎంలో సభ్యుడిగా చేరారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముస్లింలకు 4శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో ఆయనకు అభిమానిగా మారారు. వైఎస్సార్‌ మరణం అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. 2013, 2021లో కార్పొరేటర్‌గా పోటీచేసి విజయం సాధించారు.

అద‌న‌పు బాధ్య‌త‌లు
అనకాపల్లి, అరకు, విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్‌గా వైవీ సుబ్బారెడ్డిని, అలాగే.. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ, అసెంబ్లీ నియోజకవర్గాలకు.. విజయనగరం, శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గాలకు మజ్జి శ్రీనివాసరావును డిప్యూటీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌గా నియమించింది వైయ‌స్ఆర్ సీపీ .

 

Back to Top