మాట త‌ప్పేది లేదు

ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డిన ఏపీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి ‘అమ్మ ఒడి’

ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పత్రికా ప్రకటన విడుదల 

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘అమ్మ ఒడి’ పథకాన్ని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి వర్తింపజేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. పేద తల్లులు తమ పిల్లల్ని ఏ బడికి పంపినా వారికి ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుస్తామని పేర్కొంది. పాదయాత్రలో భాగంగా సీఎం వైయ‌స్‌ జగన్‌ ఇచ్చిన హామీని అనుసరించి ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ముందుగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల స్థితిగతుల్ని, రూపు రేఖల్ని మార్చాలని సీఎం జగన్‌ నిర్ణయించినట్లు పేర్కొంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది.

అన్ని చర్యలు తీసుకుంటాం..
పేదల పిల్లలు ప్రతీ ఒక్కరు బడికి వెళ్లి చదువుకోవాలన్న ఉద్దేశంతోనే సీఎం వైయ‌స్‌ జగన్‌ అమ్మ ఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని సీఎంఓ పేర్కొంది. బడిబాట కార్యక్రమంలో అక్షరాభ్యాసం సందర్భంగా, విద్యా శాఖ సమీక్ష సమావేశంలో ఈ పథకం గురించిన విధివిధానాలు రూపొందించాలని ఆయన ఆదేశించారని తెలిపింది. ఇందులో భాగంగా ముందుగా ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని వెల్లడించింది. ‘దేశం మొత్తంలో నిరక్షరాస్యుల సగటు 26 ఉంటే.. ఏపీలో 33 శాతం ఉంది. మన రాష్ట్రంలో ప్రతీ 100 మందిలో 33 మంది నిరక్షరాస్యులే. అక్షరాస్యత విషయంలో ఏపీ దేశంలో అట్టడుగున ఉంది. ఈ పరిస్థితిని మార్చి.. పేద కుటుంబాల్లోని పిల్లలు చదువుకునే విధంగా ఈ పథకాన్ని ప్రకటించారు’ అని ‘అమ్మ ఒడి’ పథకం ఆవశ్యకతను వివరించింది. ఈ కార్యక్రమంలో ఎలాంటి సందేహాలు, అపోహలకు తావు లేదని పిల్లల్ని బడికి పంపే ప్రతీ తల్లికి ఈ పథకం వర్తిస్తుందని సీఎంఓ స్పష్టం చేసింది.

 

తాజా వీడియోలు

Back to Top