రాష్ట్రంలో లంచాలే ఉండవు

సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

కొత్త పరిశ్రమలు రావని అపోహాలు సృష్టిస్తున్నారు

పరిశ్రమల్లో ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకముంటే స్థానికులు సహకరిస్తారు

మూడేళ్లలో వాళ్లకు కావాల్సిన విధంగా యువతకు శిక్షణ ఇప్పిస్తాం

విద్యుత్‌ ఒప్పందాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు తీసుకుంటున్నాం

అమరావతి: మన రాష్ట్రంలో పై స్థాయి నుంచి కిందిస్థాయి వరకు లంచాలు అనే మాటే ఉండదని, పారదర్శకంగా వ్యవహరిస్తామని పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కొత్త పరిశ్రమలు రావని కొందరు అపోహాలు సృష్టిస్తున్నారని, పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు తీసుకువస్తామని, పారిశ్రామికవేత్తలకు సహకరిస్తామని పేర్కొన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల బిల్లుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సభలో మాట్లాడారు. ఈ చట్టం వల్ల పరిశ్రమలు ఆగిపోతాయని, పారిశ్రామికవేత్తలు రావడానికి ఇబ్బంది పడుతారని, పరిశ్రమలు మూతపడుతాయని రకరకాలుగా కొన్ని కథనాలు గమనిస్తున్నామన్నారు. 
ఇక్కడ రెండు విషయాల గురించి చెప్పాలి. స్థానికులకు 75 శాతం పరిశ్రమల్లో ఉద్యోగాలకు సంబంధించి చెప్పాలంటే..తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో నిరుద్యోగ సమస్యలపై పూర్తిగా ఆకలింపు చేసుకున్నాను.  ఫ్యాక్టరీలు పెట్టేందుకు ముందుకు వచ్చినప్పుడు ఏదో మభ్యపెట్టి భూములు కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఎవరైనా రాజకీయ నాయకులు వెళ్లి అడిగినా కూడా పట్టించుకునే నాథుడు లేడు. ఎవరైనా పోరాటాలు చేసినా కేసులు పెట్టే పరిస్థితి చూశాం. ప్రతి ఫ్యాక్టరీతో కొద్దోగొప్పో కాలుష్యం ఉంటుంది. చదువుకున్న స్థానికులకు ఉద్యోగాలు రాని పరిస్థితిలో అక్కడి ప్రజలు పరిశ్రమలకు భూములు ఇచ్చేందుకు ఎందుకు ముందుకు వస్తారు. అలాంటప్పుడు ఫ్యాక్టరీలు ఎలా వస్తాయి. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకం కలిగించినప్పుడే సాధ్యమవుతుంది. రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లాల్సిన అధ్వాన్నమైన పరిస్థితి ఉంది. కొద్దోగొప్పో వీటి వల్ల మంచి జరుగుతుందని చెబితే పరిశ్రమలు వస్తాయి. ఎక్కడైతే భూములు ఉన్నాయో వాటిపైనే స్థానికత అని చెబుతాం. ఎదైతే క్వాలీఫికేషన్‌ అక్కడ లేదో..ఆ తరువాత చుట్టప్రక్కల వారికి అవకాశం వస్తుంది. అక్కడ కూడా దొరకకపోతే జిల్లా, రాష్ట్రస్థాయికి వెళ్తుంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ద్వారా యువతకు నైపుణ్యం కలిగిస్తాం. పరిశ్రమలతో మాట్లాడి వారికి కావాల్సిన క్వాలిఫికేషన్‌పై శిక్షణ ఇస్తాం. కలెక్టర్‌ నేతృత్వంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తాం. మూడేళ్లలో మీకు ఏ రకమైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కావాలో మేమే ఖర్చు చేసి ట్రైనింగ్‌ఇస్తాం. అందరం కలిసి మన పిల్లలను తయారు చేసుకుందాం. ప్రతి అడుగు పరిశ్రమలు వచ్చే విధంగా చేస్తాం. పరిశ్రమలు రావాలని మన పిల్లలు కూడా ఆహ్వానించేలా చేస్తాం.

విద్యుత్‌ ఒప్పందాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  ఇలా చేస్తే పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి రారని చెబుతున్నారు. మనం కొనుగోలు చేసే కరెంటుకు రేటు ఇచ్చేది ఎవరూ? పవర్‌ కొనుగోలు చేసేందుకు పరిశ్రమలకు కొంత లాభానికి అమ్ముతాం. అక్కడి నుంచి ఆదాయంతోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం, పేదలకు 200 యూనిట్ల వరకు ఇవ్వగలుగుతున్నాం. అలాంటి సమయంలో మన పవర్‌ కొనుగోలు చేసేందుకు ఏ పారిశ్రామిక వేత్త ముందుకు వస్తారు?. రాష్ట్రంలో పవర్‌ రేట్లు ఇంతింత ఉన్నాయని పారిశ్రామికవేత్తలు వేరే రాష్ట్రానికి వెళ్తారు. అందుకే మేం అడుగులు వేస్తూ ఒక వైపు యువతకు ఉద్యోగాలు రావాలని, రెండోవైపు పరిశ్రమలు మన రాష్ట్రానికి రావాలని బ్యాలెన్స్‌ చేస్తూ ఈ రకమైన చట్టాలు చేస్తున్నాం. 

మన రాష్ట్రం గురించి గొప్పగా, గర్వంగా చెప్పే అంశం ఏంటంటే ఇక్కడ లంచాలు అన్నవి ఉండవన్ని చెబుతున్నాను. పై నుంచి కింది స్థాయి వరకు పారిశ్రామికవేత్తలను లంచాలు అడిగే వారు ఉండరని చెబుతున్నాను. పారదర్శక పాలసీలను పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతున్నాం. మీకు ఏం కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం తప్ప మరేది నాకు అవసరం లేదు. ఇవన్నీ చేయడం వల్ల మంచి జరుగుతుంది, పరిశ్రమలు రావు అన్నది తప్పు అవుతుంది. దేవుడి దయ, ప్రజలందరి దీవెనలతో ఇంకా ఎక్కువ పరిశ్రమలు వచ్చే పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విశ్వాసం వ్యక్తం చేస్తూ పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాల బిల్లును ఆమోదింపజేయాలని కోరారు.
 

Back to Top