ముంపు ప్రాంతాల్లో పర్యటించండి

మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

ముంపుపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

అమరావతి: ముంపు ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.వరద ముంపుపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులతో సమీక్షిస్తున్నారు.  కాగా, ముంపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తుల శాఖ సూచించింది. 

కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. దశాబ్దకాలం తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో వరద పోటెత్తుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే వరద ధాటికి పలు గ్రామాలు నీట మునిగాయి. జగ్గయ్యపేటలోని రావిరాల, నందిగామలోని చందర్లపాడుతోపాటు పలు గ్రామాల్లో వరద నీరు  ముంచెత్తింది. అలాగే ప్రకాశం బ్యారేజ్‌కు దిగువున ఉన్న లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం ఉదయానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. 

దశాబ్దకాలం తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. పైనుంచి వస్తున్న వరద నీరు వల్ల ప్రకాశం బ్యారేజ్‌ నిండుకుండలా దర్శనం ఇస్తోంది. బ్యారేజ్‌ 70 గేట్లను ఎత్తివేసి వరద నీటిని కిందకు వదిలివేస్తున్నారు. గురువారం ఉదయం 4లక్షలతో ప్రారంభమైన వరద ప్రవాహం అంచలంచెలుగా పెరిగి అర్ధరాత్రికి 6 లక్షల క్యూసెక్కులకు చేరింది.

రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరిక..
గురువారం రాత్రి వరద ఐదు లక్షల క్యూసెక్కులు దాటడంతో రెండో నంబర్‌ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వాస్తవానికి 5,66,000 క్యూసెక్కుల వరద నీరు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. శుక్రవారం ఉదయం లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కుంటాయని గుర్తించిన అధికారులు గురువారం రాత్రి నుంచే గ్రామాల్లో వారిని ఖాళీ చేయించడం ప్రారంభించారు. అయితే ఆయా గ్రామాల్లోని ప్రజలు స్వతహాగా తమ ఇళ్లు, పశువులను వదిలి పెట్టి రావడానికి ఇష్టపడటం లేదు. అధికారులు  నచ్చచెప్పి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. 

Back to Top