పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

అమరావతి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి   పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాప్ట‌ర్ ద్వారా ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించిన ముఖ్య‌మంత్రి..ఆ త‌రువాత క్షేత్ర‌స్థాయిలో ప్రాజెక్టును సంద‌ర్శించి ప‌నుల వివ‌రాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు.  ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయినిగా పేరుగాంచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో స్వయంగా ప‌రిశీలించారు.  తన తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోలవరం పనులు శ్రీకారం చుట్టినా తర్వాత వచ్చిన టీడీపీ సర్కారు పట్టించుకోకపోవడంతో ప్రాజెక్టు ఆలస్యమవుతూ వచ్చింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. చంద్రబాబు కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టు పనులు మందగించాయి.

ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలు మార్చే పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైయ‌స్ జగన్‌ టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. 2018 నాటికి ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయింది. 2018 నాటికి గ్రావిటీతో నీరు ఇస్తాం రాసుకోమంటూ అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అసెంబ్లీలో వెటకారంగా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ప్రాజెక్టు పూర్తి కాలేదు. నిర్వాసితులను పూర్తిస్తాయిలో తరలించి, ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు ఇవ్వగలిగితేనే ప్రాజెక్టు పూర్తయినట్లు. లక్షా ఐదు వేల కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 3 వేల కుటుంబాలకు మాత్రమే పునరావాసం కల్పించారు. అంటే 3 శాతంలోపు మాత్రమే పునరావాస కార్యక్రమాలు జరిగాయి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు రోజువారీ సమీక్షలతో సరిపెట్టారు. ఈ ప‌నుల‌ను వేగవంతం చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న సీఎం ఇవాళ పోల‌వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించ‌డం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top