అన్న‌దాత‌ల‌కు అండ‌..ఉద్యోగుల‌కు చేయూత‌

డిసెంబ‌ర్ 25న 30 ల‌క్ష‌ల ఇళ్ల‌ప‌ట్టాల పంపిణీకి కేబినెట్ ఆమోదం

మూడేళ్ల‌లో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాల‌ని టార్గెట్‌

తుపాన్ ప్ర‌భావంతో పంట న‌ష్టానికి డిసెంబ‌ర్ 30 నాటికి ప‌రిహారం

పున‌రావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కొక్క‌రికి రూ.500 చొప్పున‌సాయం

పోల‌వ‌రం ఎత్తు ఒక్క సెంటీమీట‌ర్ కూడా త‌గ్గించేది లేదు

ఉద్యోగుల‌కు డీఏ పెంపు.. పాత బ‌కాయిలు చెల్లించాల‌ని నిర్ణ‌యం

డిసెంబ‌ర్ 2 ఏపీ అమూల్ ప్రాజెక్టుకు శ్రీ‌కారం

డిసెంబ‌ర్ 15న పంట బీమా ప్రీమియం చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం

ప‌శుదాణా క‌ల్తీ చేస్తే జ‌రిమానాతో పాటు జైలు శిక్ష‌

రూ.927 కోట్లతో భూముల సమగ్ర సర్వేకు కేబినెట్‌ ఆమోదం

కేబినెట్ నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి క‌న్న‌బాబు

అమ‌రావ‌తి:  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అన్న‌దాత‌ల‌కు అండ‌గా నిల‌వాల‌ని, ఉద్యోగుల‌కు బ‌కాయిలు చెల్లించాల‌ని, పేద‌ల‌కు ఇళ్ల స్థ‌లాలు ఇవాల‌నే ప‌లు అంశాల‌పై కేబినెట్‌లో నిర్ణ‌యం తీసుకున్నారు. నివ‌ర్ తుఫాన్ ప్ర‌భావంతో న‌ష్ట‌పోయిన అన్న‌దాత‌ల‌ను ఆదుకోవాల‌ని, ఉద్యోగుల బ‌కాయిలు చెల్లించాల‌ని కేబినెట్‌లో నిర్ణ‌యం తీసుకున్నారు.  డిసెంబర్ 25న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు 28లక్షల 30వేల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వైయ‌స్సార్‌ హౌసింగ్ కాలనీల నిర్మాణం, డిసెంబర్ 8న 2.49లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టే ముసాయిదా బిల్లులు, కురుపాం జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీకి 105 ఎకరాల భూ సేకరణ, 2019 ఖరీఫ్‌ ఉచిత పంటల బీమా పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఫిషరీస్‌ యూనివర్శిటీ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వైయస్‌ఆర్‌ శాశ్వత భూహక్కు, యాజమాన్య సమగ్ర సర్వేకు కేబినెట్‌ ఆమోదించింది. రూ.927 కోట్లతో భూముల సమగ్ర సర్వేకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కేబినెట్‌లో చ‌ర్చించిన అంశాల‌ను మీడియాకు వెల్ల‌డించారు.   

డిసెంబర్‌ 30 కల్లా పంట నష్టపరిహారం

నవంబర్‌ 23 నుంచి 26 తేదీల మధ్య నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో దాదాపు 289 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని అధికారులు వివరాలు ఇచ్చారు. సాధారణ వర్షపాతంతో చూస్తే ఇది 188 శాతం అధికం. నెల్లూరు, చిత్తూరు, వైయస్‌ఆర్‌ జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది.  నివ‌ర్ తుఫాన్ ప్ర‌భావంతో రాష్ట్రంలోని 30 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. 1300 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. డిసెంబర్‌ 30 కల్లా పంట నష్టపరిహారాన్ని అందించాలని సీఎం  వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. సుమారు 10వేల మందికిపైగా సహాయక శిబిరాలకు తరలించాం. శిబిరాల్లో ఉన్నవారికి రూ.500 ఇవ్వాలని సీఎం ఆదేశించారు.  147 సహాయక శిబిరాలను నిర్వహిస్తున్నారు. అవసరమైతే ఇంకా పెంచాలని సీఎం ఆదేశించారు. ఇప్పటి వరకు 10 వేల మందికిపైగా సహాయ శిబిరాల్లో ఉన్నారని అధికారులు వివరాలు ఇచ్చారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 30 వేల హెక్టార్‌లో వ్యవసాయ పంటలు, 13 వేల హెక్టార్‌లలో ఉద్యాన పంటలు నష్టపోయినట్లుగా సమాచారం. 170 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని, చాలా చోట్ల చెరువులకు గండ్లు పడినట్లుగా సమాచారం. విద్యుత్‌ సరఫరాకు అక్కడక్కడ అంతరాయం ఏర్పడినట్లుగా.. సబ్‌ స్టేషన్లకు కొన్ని చోట్ల నీరు చేరినట్లుగా సమాచారం. యుద్ధ ప్రతిపాదికన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో పరిస్థితిని సమీక్షించేందుకు ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాను ఆదేశించారు. సహాయక శిబిరాల్లో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఒక్కొక్కరికి రూ.500 ఇవ్వాలని ఆదేశించారు. డిసెంబర్‌ 15 నాటికి పంట నష్టాల అంచనాలు పూర్తి చేయాలి.. డిసెంబర్‌ 30వ తేదీ నాటికి పరిహారం రైతులకు చెల్లించాలని ఆదేశించారు. అధిక వర్షాల వల్ల ముగ్గురు మృతిచెందినట్లుగా సమాచారం ఉంది. తుపాన్ల కారణంగా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగినప్పుడు ఎలాంటి సాయం అందిస్తామో.. ఆ ప్రకారం చేయాలని సీఎం ఆదేశించారు.

రైతులను ఆదుకోవడమే లక్ష్యం..

జూన్‌ నుంచి ఇప్పటి వరకు వరసగా వర్షాలు పడుతున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉందనుకుంటున్న తరుణంలో అధికవర్షాలు పడి పంటలు నష్టపోతున్నాయి. అయినా, ఎప్పటికప్పుడు రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా చాలా స్పష్టమైన ఆదేశాలిచ్చి జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు పంట నష్టం జరిగిన వారికి అక్టోబర్‌లో పరిహారం అందించాం. అక్టోబర్‌లో జరిగిన నష్టాలకు నవంబర్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించడం జరిగింది. ఇప్పుడు పడుతున్న వర్షాలకు జరిగే పంట నష్టానికి డిసెంబర్‌లో పరిహారం ఇవ్వాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు.

పోలవరం ప్రాజెక్టు సెంటీమీటర్‌ కూడా తగ్గించేది లేదు..

పోలవరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీలు, కొన్ని పత్రికలు దుష్ప్రచారం చేస్తున్నాయి. దీన్ని నిద్వందంగా కేబినెట్‌ ఖండించింది. పోలవరం ప్రాజెక్టు ఒక్క సెంటీమీటర్‌ ఎత్తు కూడా తగ్గించడం లేదని సీఎం వైయస్‌ జగన్‌ కేబినెట్‌లో ప్రకటించారు. ప్రాజెక్టు ఒరిజినల్‌ డిజైన్ల ప్రకారమే నిర్మాణం జరుగుతుందని సీఎం చెప్పారు. స్పిల్‌ వే పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నామని చెప్పారు. 2017లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రత్యేక ప్యాకేజీని ఆమోదించే హడావుడిలో 2014 రేట్లను మాత్రమే ఆమోదిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ దానికి ఎలాంటి అభ్యంతరాలను చంద్రబాబు చెప్పలేదు. అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైయస్‌ జగన్‌ ఆ విషయాన్ని లేవనెత్తిన విషయాన్ని ఈరోజు గుర్తుచేశారు. చంద్రబాబు చేసిన తప్పును సరిదిద్దే కార్యక్రమం సీఎం వైయస్‌ జగన్‌ చేస్తున్నారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ రూ.29 వేల కోట్లు అవుతుంది.. రూ.23 వేల కోట్లు ప్రాజెక్టుకు అవుతుంది.. అలాంటప్పుడు అంచనా వ్యయం తగ్గిస్తే కరెక్ట్‌ కాదని స్పష్టంగా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేంద్రం నుంచి కూడా సానుకూలత వ్యక్తం చేస్తోంది.

ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ బకాయిలు..

ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ బకాయిలు చెల్లించాలని కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. 2018 జూలై 1వ తేదీ నుంచి ఇవ్వాల్సిన డీఏలు ఇవ్వలేదు. డీఏ1 2018 జూలై నుంచి ఇవ్వాల్సిన ఎరియర్స్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 నెలలకు రూ.3,017.40 ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది. దీంట్లో రూ. 2136.90 కోట్లు ఉద్యోగుల జీతాలు అయితే.. పెన్షన్‌ రూ.880.5 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  సంవత్సరానికి ఇదే విధంగా అమలు చేస్తే రూ.854.76 కోట్లు ఉద్యోగుల జీతాల్లోనూ, పెన్షన్‌ కింద 352.2 కోట్లు అదనంగా చెల్లించడానికి నిర్ణయం తీసుకుంది. 3.144 శాతం డీఏ పెంపును ఆమోదించడం జరిగింది. ఈ ప్రకారం రూ.3017 కోట్ల ఎరియర్స్, జనవరి 2021 నుంచి ప్రతి నెలా జీతాలు, పెన్షన్లతో కలిపి ఇస్తాం.

రెండవ డీఏ జనవరి 2019 నుంచి పెండింగ్‌లో ఉంది. ఇది కూడా 30 నెలల కాల పరిమితి తీసుకుని లెక్కిస్తే.. రూ.3017.40 కోట్లు ఎరియర్స్‌. ప్రతి సంవత్సరం రూ.1206.96 కోట్లు జీతాలు, పెన్షన్లతో కలిపి ఇవ్వాలని నిర్ణయం. దీంతో పాటు థర్డ్‌ డీఏ 5.24 శాతం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. జూలై 2019 నుంచి ఇవ్వాల్సి ఉంది.. జనవరి 2022 నుంచి అమల్లోకి వస్తుంది. థర్డ్‌ డీఏ 30 నెలలకు రూ.5028.90 కోట్లు చెల్లింపులు చేస్తాం. సంవత్సరానికి రూ.1424.64 కోట్లు జీతాలు, రూ.586.92 కోట్లు పెన్షన్లుగానూ ప్రతి సంవత్సరం రూ.2011.56 కోట్లు చెల్లించాల్సి వస్తుంది.

 జీతాల పెంపు..

ఉద్యోగులకు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆశా వర్కర్లకు జీతాల పెంపు, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. అంగీన్‌వాడీ వర్కర్లు, హోంగార్డులు, పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు పెంపు. దీంతో పాటు పాత బకాయిలు చెల్లించడం. కాంట్రాక్ట్‌ ఎంప్లయీస్‌ను అప్కాస్‌ కిందకు తీసుకువచ్చాం. కొత్తగా 1.40 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం.

రెండు నెల‌ల్లో పెండింగ్ వేత‌నాలు..

కరోనా సమయంలో మార్చి నెలకు సంబంధించి శాలరీస్, పెన్షన్‌ను హోల్డ్‌లో పెట్టారు. వాటిని డిసెంబర్‌ నెలలో చెల్లింపులు చేయబోతున్నాం. ఏప్రిల్‌ నెలలో విధించిన శాలరీస్‌ కోతను జనవరిలో చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించి రూ.2,324 కోట్లు జీతాలు, రూ.482 కోట్లు పెన్షన్లుగా ఇవ్వడానికి ఆమోదం తెలిపాం.

ఇళ్ల పట్టాల పంపిణీ..

డిసెంబర్‌ 25న పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ప్రారంభించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 30.60 లక్షల మందికి ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వనుంది. ఇందు కోసం 66,518 ఎకరాలను రూ.23 వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం సేకరించింది. దాంట్లో 25,193 ఎకరాలు ప్రభుత్వ భూమి అయితే 22,342 ఎకరాల ప్రైవేట్‌ భూమిని సేకరించాం. రాష్ట్రంలో 11 వేల పంచాయతీలు ఉన్నాయి. పేదలకు ఇచ్చే లేఅవుట్‌లు చూస్తే 17 వేల కాలనీలు వస్తున్నాయి. ఇళ్లు లేని పేదలు ఉండకూడదనేది సీఎం లక్ష్యం. 175 నియోజకవర్గాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చి తక్షణమే 16 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతాం. రెండో దశలో మిగిలిన ఇళ్ల నిర్మాణం చేపడుతాం. మూడేళ్లలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని టార్గెట్‌ పెట్టుకున్నాం. 8,494 లేఅవుట్‌లలో 16 లక్షల ఇళ్ల నిర్మాణం డిసెంబర్‌ 25న మొదలవుతుంది. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో తరువాత దశలో నిర్మాణం.  ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు ప్రభుత్వం సాయం చేస్తుంది. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. తొలి విడతలో ప్రారంభించే ఇళ్లు 2022 జూన్‌ నాటికి పూర్తిచేయాలని నిర్ణయం. మిగిలిన 13 లక్షలు కూడా 2021 డిసెంబర్‌లో ప్రారంభించి 2023 నాటికి పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కాలనీలకు విద్యుత్‌ సరఫరా, తాగునీటి సరఫరా, మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం సూచించారు.

వైయ‌స్ఆర్ ఉచిత‌ పంట బీమా పథకం..

రైతు మీద భారం లేకుండా ప్రతి రూపాయి ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది. డిసెంబర్‌ 15న పంట బీమా ప్రీమియం చెల్లించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రూ.1227 కోట్లు రైతులకు పరిహారంగా అందబోతుంది. 2016 నుంచి 2019 వరకు మూడేళ్ల కాలానికి కలిపి 60.84 లక్షల మందికి పథకం అమలు చేస్తే.. 2019–20 ఒక్క సంవత్సరంలోనే 58.77 లక్షల మంది రైతులకు పంట బీమా పథకాన్ని అమలు చేశాం. 2016–19 కలిపి 70.71 లక్షల హెక్టార్లకు పంట బీమా అమలు చేస్తే.. 2019–20లో 56.86 లక్షల హెక్టార్లకు పంట బీమా అమలు చేశాం. 2016–19 మధ్య పంట బీమా సొమ్ము రూ.37,457 కోట్లు అయితే 2019–20 ఒక్క ఏడాదిలోనే రూ.37,721 కోట్లు. 2016 నుంచి 2019 వరకు ప్రీమియం భారం రూ.871 కోట్లు అయితే.. 2019–20లో రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. 2019 ఖరీఫ్‌కు సంబంధించి రూ.1555 కోట్లు ప్రీమియంను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇకపై ప్రభుత్వమే సొంతంగా ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయబోతుంది. ఇది వచ్చే ఏడాది నుంచి పనిచేస్తోంద‌ని మంత్రి క‌న్న‌బాబు కేబినెట్ నిర్ణ‌యాల‌ను వెల్ల‌డించారు.

మహిళల ఆర్థిక స్వావలంబన, సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం..
గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల్లో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయాలని అమూల్‌ సంస్థతో  ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మహిళల ఆర్థిక స్వావలంబన, సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం చేపడుతున్న ఈ కార్యక్రమానికి అమూల్‌తో అనుసంధానమే పాల ఉత్పత్తిదారుల కార్యకలాపాలు ప్రారంభించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. డిసెంబర్‌ 2న ఏపీ అమూల్‌ ప్రాజెక్టును సీఎం ప్రారంభిస్తారు. ఇప్పటి వరకు ఎంపిక చేసిన చేయూత, ఆసరా పథకాల మహిళలకు ఆవులు, గేదెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మొదటి దశలో చిత్తూరు, ప్రకాశం, వైయస్‌ఆర్‌ జిల్లాల్లోని 4 వందల గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 9899 బల్క్‌ చిల్లింగ్‌ సెంటర్లు నిర్మాణం చేయాలని ఈ రోజు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

4.68 లక్షల పాడిపశువులను, 2.49 గొర్రెలు, మేకలను చేయూత కింద మహిళలకు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఒక్క యూనిట్‌కు 14 గొర్రెలు కానీ, మేకలు గానీ ఉంటాయి. ఇందులో ఒక మేకపోతు లేదా గొర్రెపోతు ఉంటుంది. డిసెంబర్‌ 10వ తేదీన ఈ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. 

నాణ్యమైన పశుదాణా ఉత్పత్తి, పంపిణీ బిల్లు
రాష్ట్రంలో నాణ్యమైన పశుదాణా ఉత్పత్తి, పంపిణీ జరగాలని, లేనిపక్షంలో వ్యవస్థ దెబ్బతింటుందని ప్రభుత్వం గమనించింది. పశుదాణా ఉత్పత్తి, పంపిణీ బిల్లును  జరగబోయే అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎవరైనా దాణా కల్తీ చేసినా, ఉత్పత్తి లేనివి పంపిణీ చేసినా జరిమానాతో పాటు జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకురావాలని సీఎం కేబినెట్‌ సమావేశంలో సూచించారు. 

ఆంధ్రప్రదేశ్‌ ఫిషరీస్‌ యూనివర్సిటీ చట్టాన్ని తీసుకురావడానికి బిల్లును వచ్చే అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

భూముల సమగ్ర రీసర్వే..
భూముల సమగ్ర రీసర్వే కార్యక్రమాన్ని డిసెంబర్‌ 21వ తేదీన ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. వైయస్‌ఆర్‌ జగన్న శాశ్వత భూహక్కు–భూరక్షణ పథకం కింద నామకరణం చేశాం. వంద సంవత్సరాల తరువాత జరుగుతున్న భూసర్వే. ఒక సాహసమైన నిర్ణయం. భూసమగ్ర రీసర్వేలో సర్వేరాళ్లను కూడా రైతులకు ఉచితంగా ఇస్తున్నాం. భూరీసర్వే కోసం రూ.927 కోట్ల ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్‌లతో కేసు..
ఆన్‌లైన్‌ గేమింగ్, గ్యాబ్లింగ్‌ వల్ల యువత నష్టపోతుంది. దీనిపై ఉక్కుపాదం మోపాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఏపీ గేమింగ్‌ యాక్ట్‌ 1974ను సవరిస్తూ.. ఒక ఆర్డినెన్స్‌ తీసుకువచ్చి వచ్చే అసెంబ్లీ సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టనున్నాం. నాన్‌బెయిలబుల్‌ సెక్షన్స్‌తో ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఆడేవాళ్లనే కాదు.. ఆడించే వాళ్లను కఠినంగా శిక్షించేలా చట్టాన్ని రూపొందించాలని సీఎం ఆదేశించారు.. దానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

ఆస్తిపన్ను విధింపులో మార్పు
అర్బన్‌ ప్రాంతాల్లో ఆస్తిపన్ను విధింపు మార్పు చేస్తూ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇంతకు ముందు వార్షిక ఆదాయంపై పన్నువేశారు. అందరికీ ఒక సమానమైన పన్ను వ్యవస్థ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయం. ఆ ప్రకారం అవినీతికి ఆస్కారం లేకుండా ఇంటిపన్నులు వేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నివాస గృహాలకు 0.1 నుంచి 0.5 శాతం వరకు వాణిజ్య భవనాలకు 0.2 నుంచి 2 శాతం వరకు మాత్రమే పన్ను విధిస్తారు. గతంలో కంటే 15 శాతం మించి పెరిగే ప్రసక్తే లేదు. పేదల ఇళ్లకు రూ.50 మాత్రమే ఇంటిపన్ను విధిస్తూ నిర్ణయం. ఇదే విధానం కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమలవుతుంది. కేంద్రం కూడా ఇదే విధానాన్ని రాష్ట్రాలకు సూచిస్తోంది. పన్ను రూపంలో వచ్చిన డబ్బంతా మున్సిపాలిటీలకే అందిస్తారు. వారే ఆ నగరాల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా ఖర్చు చేసుకోవచ్చు. 

– ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల కోసం అభివృద్ధి కార్పొరేషన్‌ను ఈఐపీడీసీఎల్‌ పేరుతో స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ను ఏర్పాటు చేయడానికి.. దాని రిజిస్ట్రేషన్‌కు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 
– ఆంధ్రప్రదేశ్‌ పల్నాడు ఏరియా ట్రాట్‌మిటిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పేరిట ఒక ఎస్‌పీవీ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే గుంటూరు చానల్‌ ఎక్స్‌టెన్షన్‌ స్కీమ్‌ ఉంటుంది. వైయస్‌ఆర్‌ వేదాద్రి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ కూడా ఉంటుంది. 
– సోమశిల కండలేరు కాల్వ సామర్థ్యాన్ని 12 వేల నుంచి 24 వేల క్యూసెక్కులకు పెంచే పనులకు పరిపాలన అనుమతులను కేబినెట్‌ ఆమోదించింది. దీంట్లో 45 కిలోమీటర్ల కాల్వ పనులు, బ్రిడ్జీల నిర్మాణం ఉంటాయి. సుమారు రూ.918 కోట్లు ఉంటుందని నిర్ణయం. 
– అనంతపురం జిల్లా చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ 10 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి చర్యలు, ముంపు బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం రూ.240.53 కోట్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం. నాలుగు గ్రామాల పరిధిలోని 1729 కుటుంబాలు నిర్వాసితులుగా ఉన్నారు.. వారికి పరిహారం అందుతుంది. 
– ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్‌ నార్త్‌ ఫీడర్‌ కెనాల్‌ విస్తరణ పనులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దాదాపు వంద కిలోమీటర్లు కాల్వ సామర్థ్యం పెంచుతారు. దీనికి దాదాపు రూ.632 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాను కేబినెట్‌ ఆమోదించింది. 
– వైయస్‌ఆర్‌ జిల్లా కొప్పర్తి ఇండస్ట్రియల్‌ హబ్‌లో కొత్త పరిశ్రమలకు రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్‌ అనుమతిచ్చింది. 
– టిడ్కో ఇళ్లు రూపాయికే ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇళ్లను త్వరలోనే పంపిణీ చేసేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నాం. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top